గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

(దత్త పది)"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి".అనే పదాలనుపయోగించి భగవంతునికీ భక్తునికీ అనుసంధాన పరచండి.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
దత్త పది:-
"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి".అనే పదాలనుపయోగించి భగవంతునికీ భక్తునికీ అనుసంధానం చేస్తూ పూరించి వ్యాఖ్యగా పంప గలరని ఆశింతును.
నా పూరణను వ్యాఖ్యలో చూడగలరు.
జైహింద్.



Print this post

12 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

దత్త పది:-"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి".అనే పదాలనుపయోగించి భగవంతునికీ భక్తునికీ అనుసంధానం చేస్తూ చేసిన నా పూరణ:-
క:-
రక్షణ కోఱుచు, ముక్తిని
భిక్షగ నే వేడు చుంటి. కృష్ణుడ! నాకున్
కుక్షిని నింపగఁ గోఱను .
పక్షీంద్రుని పైన నీవు పరుగున రావే!

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

పక్షీంద్ర వాహ శ్రీహరి
రక్షణ నీయంగ వేగ రారా మా యీ
కుక్షిని నింపెడు సంపద
భిక్షగ మాకిడిన చాలు వేవేలడుగన్.!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్షీణ భక్తి భావా!
రక్షకుఁడగు పక్షిరథుని ప్రార్థించిరె మీ
కుక్షికి సరపడ భిక్షగ.
అక్షయ సుజ్ఞాన ధనుఁడ! హనుమచ్ఛాస్త్రీ!

మీ సహృదయతకు నా అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కుక్షిం భరిత్వ మడుగను
బిక్ష గ నే కోరుచుంటి పెన్నిధి వనుచున్ !
పక్షీం ద్రుని పైన దిరిగి
రక్షణ జేయంగ జగతి రాముడు నీవై !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కయ్యా! మీ జ్ఞాన పరిపక్వతకు తోడైంది మీ కవితా పరిపక్వత. చాలా సంతోషంగా ఉంది. హృదయ పూర్వక అభినందనలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! ధన్యవాదములు.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

ఆది భిక్షకుడాతడు నవనిలోని
జనులకుక్షినింపెడువాడు శంకరుండు
పక్షిరాజాశనంబె యాభరణమగుచు
రక్ష జేయంగ, ననియెద రక్ష ! రక్ష !
( పక్షిరాజ + అశనంబె = గరుత్మంతుని ఆహారంబె )

డా.ప్రభల రామలక్ష్మి చెప్పారు...

పక్షిని గూల్చగ బోయడు
కుక్క్షిని నింపంగ జూచి కుమిలెను బాధన్
రక్షగ "మర" శబ్దంబును
భిక్షగ నిడె నారదుండు విజ్ఞత నొసగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ చింతా వారికి ధన్య వాదములు
ఇదంతా మీ ఆదరాభి మానములే గాక మీ పండిత సోదరు లందరూ , శ్రీ శంకరయ్య గారూ , పూజ్య గురువులు శ్రీ నేమాని వారూ , శ్రీ చింతా వారూ , ఓర్పుతో నేర్పిన బిక్ష ఇక బ్లాగు సోదరుల ప్రోత్సాహమే నాకు ఊపిరి .అందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు

డా. ప్రభల రామలక్ష్మి చెప్పారు...

పక్షిని గూల్చగ బోయడు
కుక్షిని నింపంగ జూచి, కుమిలెను బాధన్
రక్షగ ' మర ' శబ్దంబును
భిక్షగ నిడె నారదుండు విజ్ఙత నొసగెన్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రభల రామలక్ష్మి ప్రాశస్త్యముగ దత్త
పదిని నింపి బుద్ధి పదును చూపె.
యోచనంబు చేయ తోచకపోవునా?
యనుచు తెలియ జెప్పి రనుపమగతి.

అమ్మా! అత్యద్భుతమైన పూరణ మీది అనుటలో ఏమాత్రము అత్యుక్తి లేదమ్మా. నిజంగా చక్కని పూరణ చేసిన మీకు అభినందన పూర్వక ధన్యవాదములమ్మా.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

పక్షి గాని , నిరక్షర కుక్షి గాని
పండితోత్తముడై పేరు పడిన గాని
మదిని భక్తి సుభిక్షమై మను నతండె
ఆ జగద్రక్షకుని వాడు , హరికి హితుడు .
-----సుజన-సృజన

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.