గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఏప్రిల్ 2025, గురువారం

"యువత-భవిత"

0 comments

 

శ్రీరస్తు               శుభమస్తు               అవిఘ్నమస్తు

విషయము…..‘ శ్రీవిశ్వావసు వత్సర ఉగాది పద్య రచనల పోటీ’

"యువత-భవిత"

 

౧.శా.  శ్రీమన్మంగళ భారతావని సదా శ్రేయోభిరామమ్ముగా

భూమిన్ వెల్గఁగ హేతు వీ యువత, తా పూజ్యప్రవృత్తిన్ లసత్

ప్రేమోదారసుధాస్రవంతియన సద్విఖ్యాతితో సృష్టిలో

క్షేమంబున్ సహవాసులన్ గనెడి సచ్ఛ్రీమార్గమందొప్పుతన్. 

 

౨.చ.  యువత శుభాస్పదంబయిన నుజ్వల దివ్యమనోజ్ఞమైన సద్

భవితను గాంచనెంచవలె, వర్ధిలు మార్గము లెంచి, యుక్తమౌ

ప్రవర పథంబులో నడచి, భద్రతనొప్పెడి భావి నిప్పుడే

కువలయమందు నెంచుకొని కోరిన రీతి గ్రహింగాఁదగున్.

 

౩.ఉ.  బాల్యమునుండి పిల్లలకు భక్తియు, యుక్తియు, శక్తిఁ గొల్పుచున్,

లౌల్యము చేరనీక మదులన్ స్థిరనిర్ణయమొప్ప నేర్పు చా

కుల్యత లేని గొప్ప కుదురైన మనంబును కల్గఁ జేసి, ప్రా

బల్యము పెంపు చేసుకొను పాఠములన్ వచియింప యుక్తమౌన్.

 

౪.శా.  స్వాధీనుండయి, నిశ్చితాత్ముఁడగుచున్ సంపాదనా శక్తి తా

మేధా శక్తిని పొంది, సంఘమునకున్ మేల్జేయు సుజ్ఞానిగా

బోధన్ గొల్పు విధంబుగా నడచుచున్ పూజ్యుండటంచంతటన్

సాధింపన్ వలె, కీర్తి నట్టి ఘనుఁడే సాధించునౌన్నత్యమున్.

 

౫.మ.  పిననాడే పర సంపదన్ బ్రతుకుటన్, వేధించి సాధించుటన్,

గొనుటన్ పేదల సొమ్మునూరకనె, సాకుల్ జెప్పుచున్ కాలయా

పనమున్ జేయుట, నేరనట్టి గతిలో పాఠంబులన్ జెప్పుచో

మన నేర్చున్ తన కాళ్ళపై యువత క్షేమంబొప్పగా భావిలోన్.  

 

౬.చ.  ఉచితము లొందుచుండుటను నోపరు కష్టము చేయనెవ్వరున్,

సుచరితులై స్వతంత్రముగ శోభిలఁ జాలరు బద్ధకస్తులై,

పచనము చేసిపెట్టునెడ వండుటకేల మనంబు వచ్చు? సా

గుచునిటులుండ, భావిని యగోచరమంచు గ్రహింపనెట్టులౌన్?

 

౭.చ.  చదువులు నేర్పునప్పు డటు సంపద గూర్చు స్వశక్తి గొల్పగా

మదికినినెక్కు పాఠములు మన్ననతో వివరింపగావలెన్,

పదునగు మేధఁ గొల్పవలె భాగ్యము సృష్టిని చేయునట్లుగన్,

పదువురి కో యుపాధినిడు భావన పెంచిన వర్ధమానుఁడౌన్.

 

౮.మత్త.  వృత్తివిద్యల శిక్షణంబిడ పృథ్విపైనెటనుండినన్

జిత్తశుద్ధిని సంపదల్ గని క్షేమమొప్పఁగ జీవనం

బెత్తరిన్ సుఖమొప్పగా నడిపింపగానగు శక్తితోన్,

మత్తువీడిన శక్తియే వరమౌ ధరన్ యువతాకృతిన్. 

 

౯.చ.  యువతకుఁ గొల్ప సద్భవిత నొప్పుగ ధర్మ విశుద్ధ చిత్తులై,

కువలయమందుఁ జూచి యనుకూల పరిశ్రమలన్ రచించుచున్,

ప్రవిమల శిక్షణంబులిడి, భావిని మేలుగ వాడు వస్తువుల్

ప్రవరముగా సృజించునటు భవ్యముగా నొనరింపగా వలెన్.

 

౧౦.ఉ.  భిక్షకు చేయి చాపుటను, భీరువుగా తలయొంచి యుండుటన్,

రాక్షసబుద్ధి నుంటను, భరంబుగనన్యులపైన మన్కి, స

ల్లక్షణ దూర వర్తనము లక్ష్యముతో నెడబాపి, చక్కనౌ

శిక్షణ నీయగా వలెను చిన్నతనంబునే శుభార్థులై.

 

౧౧.శా.  నిర్లిప్తంబగు జీవనంబు విడుచున్, నిస్తంద్రతన్ మెల్గుచున్,

స్వర్లోకాద్భుత హర్మ్య భర్మముల త్రోవన్ వీడి స్వప్నంబులన్

దోర్లీలన్ సృజియించు వాని గనుచున్, దుర్నీతులన్ వీడుచున్,

స్వర్లోకంబుగ భారతావనిని ధ్యాసన్ జేయుతన్ ధీనిధుల్.

 

౧౨.గుప్త పంచమ పాద గోమూత్రికాబంధ ఉత్పలమాల.

భావంబందలి వెల్గు నేర్పు నుత సేవాసక్తి, నుత్పాద్యతన్,

భావిన్ భారతి వెల్గు నీ యువత సేవన్ భాతి నత్యున్నతి(న్),

న్భావ స్వేచ్ఛ, గణింపుచున్ యువత లోనన్ యోగ్య  సంపత్ప్రభన్

భావిన్ స్వచ్ఛత తోడ వెల్గు వసుధన్ భాసింప సంస్కారముల్.

 

౧౩.అనేక ద్వివిధ కంద గీత గర్భ చంపక మాల.

వర నుతమేదినిన్ నిధుల భారత దేశము నిండుకుండరా,

పర హితమౌశుభాకరము భక్తితరంగపు కల్పవల్లి, ధీ

వర ధృతిచేతనే యువత భాగ్య తలంబిది యుచ్ఛఁ గొల్పుగా,

పర గతియౌమహా సుగతి భారతి భావికి శోభఁ గూర్చురా!

 

౧౪. శివలింగ బంధ భావ గోపనచిత్ర ఉత్పలమాల.

శ్రీయుత భావ! భారత ప్రసిద్ధి  నృపాలకులంతరాత్మలన్

జేయఁగ నౌను చింతనను, చేసి యపార క్షుధార్తి బాధితుల్

మాయ,కొలాలు చూపుచును మాడు జనంబుల ప్రేమ వీడరా

దేయని దేహియంచననిదీనులె యుండని తీరు నేలుతన్.

 

౧౫.శుద్ధ నిరోష్ట్య తేటగీతి(ఉ ఊ ఒ ఓ ప ఫ బ భ మ వ/వర్ణ నిషేధము)

తైజ సాకృతి నెనలేని ధారణ, నిజ

శక్తి నెన్నగ తనరిట చాలినంత

కీర్తి గని, జననేతలీ క్షితిని సహజ

శ్రీశ! కాంతిని దనరిన శ్రీనిధిదియె.

 

౧౬.మణిప్రవాళ మాలిని.

యువత భవిత దేఖో, యుద్ధతే నాఽస్తి కించిత్,

ప్రవణ గరిమ గ్రేటే, వర్ధనంబెన్న డౌటే,

నవత గనఁగ ఫారన్ నప్పునంచున్ చలంతి,

ప్రవరవరులు, హేరామ్! వారలన్ గావు మాల్వేజ్!

 

౧౭.శ్రీచక్రబంధ తేటగీతి.

కనఁగ మీశక్తి శ్రీమాత కాంతి చేత,

లక్ష్యమీడేరు సుశ్రీ యువాళి బ్రతుక,

సిరుల భారతీ శ్రీమాత మిమ్ము బ్రోచు,

కమల వాసిని తప్పక కాంచునింక.

 

౧౮.చ`తురంగ స్వస్తిక్ బంధ లఘు కందము.

(గుఱ్ఱపుటెత్తులలో వచ్చు పదములు యువతకు - భవితను - ప్రజలిల - కొలుపుత,)

 

జననుత ప్రభువులు యువతకు

ఘనమగు ధృతియు నిలుపుత, సుకర వర! కొలువుల్

ఘన తకు సులలితముగ మన

ను నిజ బృతికి భవితకు ప్రభను గొనవలెనిలన్.

 

౧౯.చ.  త్రికరణ శుద్ధితో యువత ప్రేమను కోరెడి పాలకోత్తముల్

ప్రకటనలిచ్చుచుండవలె భన్యపు జీవన వృత్తులిచ్చుటన్,

ముకుళిత హస్తులై విధులు పొంది మహత్తర సేవఁ జేయుచున్

సకలజగంబునన్ యువత చక్కగ కీర్తిని పొందగా వలెన్.

 

౨౦.ఉ.  మంగళమౌత భారతికి, మంగళమౌ యువసజ్జనాళికిన్,

మంగళమౌత శాంభవికి, మంగళమౌగురుదేవపాళికిన్,

మంగళమౌత సత్కవుల మంగళ సత్కవితాసుధారకున్,

మంగళమౌత మీకు, పరమాత్మునకెల్లెడమంగళంబగున్.

 

స్వస్తి.

చిత్ర బంధ పద్యముల వివరణ.

14 శివలింగబంధ ఉత్పలమాల.



17. శ్రీచక్ర బంధ తేటగీతి
౧౮.చ`తురంగ స్వస్తిక్ బంధ లఘు కందము.


జైహింద్.

శ్రీ విశ్వావసు ఉగాది కవితాగానం. ... చింతా రామకృష్ణారావు. తే.28 - 3 - 2025. శ్రీమతి స్వేతవాసుకి చానల్ లో ప్రసారితము.

0 comments

 

జైశ్రీరామ్.

శ్రీరస్తు                             శుభమస్తు                    అవిఘ్నమస్తు.

విశ్వావసు వాసంతిక.

చింతా రామకృష్ణారావు.


శా.  శ్రీమన్మంగళ సద్ వసంత కళతో శ్రీమంత విశ్వావసున్

క్షేమానంద శుభ ప్రమోద సుఫల శ్రీలన్ బ్రసాదింపగా

ధీమాన్యుల్ గల భారతావని కిలన్ దేదీప్యమానంబుగాఁ

బ్రేమన్ రమ్మని స్వాగతమ్ము పలికెన్ విఖ్యాతి నీ కోకిలల్.

 

ఉ.  చల్లని పిల్లగాలులిల చక్కని పుష్ప పరీమళంబులన్

మెల్లగ సంతరించుకొని మేలగు నూతనవత్సరాదిలో

సల్లలితంపు భావన లసాదృశ రీతిని గొల్పుచుండె, రం

జిల్లగ మానసంబులు, ప్రసిద్ధ కవీశుల మెప్పులందుచున్.

 

ఉ.  హైందవధర్మ తేజము, మహేశ్వరి రూపము వత్సరాది,  మో

హాంధము బాపి, సత్ప్రభ నహర్నిశలున్ వెలుగంగఁ జేసి, గ

ర్వాంధులఁ బారఁద్రోలి, అజరామర కీర్తిని దేశమాతకున్

సంధిలఁజేయ లోకమున చక్కగ వచ్చెను నేడు ప్రేమతో,

 

ఉ.  నూతన శక్తి సంపద ననూనముగా ప్రభవింపఁ జేయగా

ఖ్యాతిగ షడ్రుచుల్ కలిగి కమ్మగనొప్పు నుగాదిపచ్చడిన్

ప్రీతిగనిచ్చి చిత్తములు వెల్గగఁ జేయు మహోత్సవంబిదే,

నీతిగనుండువారల ననేక విధంబుల కావ వచ్చెనే.

 

ఉ.  భావజవైరి పత్నికి శుభంకర కాళికి మంగళంబు, వి

శ్వావసు వత్సతంబునకు, భాగ్యవిధాతకు  మంగళంబగున్,

ధీవర పండితాళికిని, దేవులఁ గొల్చెడి భక్తపాళికిన్,

జీవనభాగ్యమై వెలుగు స్రీ  జనపాళికి మంగళంబగున్.

స్వస్తి.

తే. 20 – 3 – 2025.

జైహింద్.

2, ఏప్రిల్ 2025, బుధవారం

దత్తపీఠాధిపతులద్వారా చిరంజీవి అన్నపరెడ్డి అనిరుద్ధునకు బంగారు పతకము

1 comments

 జైశ్రీరామ్.

సహృదయమణి, రైతుబంధుకవి, నాకు ఆత్మీయులు ఐన 

శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయ్ణరెడ్డిగారి పౌత్రుఁడు 

५ సంవత్సరముల వయసుగల

చి. అన్నపరెడ్డి అనిరుధ్ 

భగవద్గీత లోని 700 శ్లోకాలు ధారణ చేసి 

దత్తపీఠం వారు నిర్వహించిన ఫైనల్ పరీక్ష లో 

ఉత్తమ శ్రేణి (distinction) పొందాడు. 

ఈ రోజు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, 

దత్తపీఠం, మైసూరు వారు దత్తపీఠం, దిండిగల్ 

హైదరాబాద్ లో 

ప్రశంసా పత్రం, బంగారు పతకం స్వయంగా అందజేసారు.

చిరంజీవి అనిరుద్ధు కు అభినందనపూర్వక ఆశీస్సులు తెలియఁజేస్తూ,

శ్రీమతిమాణిక్యాంబా శ్రీ సత్యనారాయణ దంపతులకు 

వారి కుమారునకు కోడలికి నా శుభాకాంక్షలు తెలియఁజేస్తున్నాను.

జైహింద్.

చత్వారో విత్త దాయాదాః - ... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్

శ్లో.  చత్వారో విత్త దాయాదాః - ధర్మ, భూపాగ్ని  తస్కరాః I             

జ్యేష్ట భ్రాత్రవమానేన - త్రయః కుప్యంతి సోదరాః II

తే.గీ.  ఆర్జిత ధనమునకుఁ దమ్ము లరయ నల్గు

రిలను, ధర్మ భూపాగ్నులు నహరహంబు 

చూచు దొంగలు, ధర్మమున్ చుల్కనఁగొను

వానిపై కోపమున గొంద్రు వాని ధనము.   

భావము.  మనము సంపాదించుకొన్న ధనానికి నలుగురు దాయాదులు. 

వారు ధర్మము,  ప్రభువు,  అగ్ని,  దొంగ. వారు దాయాదులైనప్పటికీ 

పెద్దన్నపై గౌరము అపారముగా కలవారు. కావుననే మనము 

మన సంపాదనను ధర్మము కొరకై వెచ్చించినచో మిగిలినవారు మన  

సమీపమునకు రారు. మనము మొదటివానికి అన్యాయము చేసినచో 

అనగా ధర్మము చేయకుండా కూడబెట్టుకొంటూ కూర్చున్నచో 

మిగిలిన ముగ్గురికీ కోపం వచ్చి మనపై దండెత్తి ధనం మొత్తం హరిస్తారు. 

అనగా మనం ధర్మ చేయుట విషయంలో నిర్లక్యముగా ఉండరాదు. 

సంపాదించినది ధర్మము చేయుచుండ వలెను.

జైహింద్.

1, ఏప్రిల్ 2025, మంగళవారం

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రజ-పద్యం మరియు అవధాన విద్యా వికాస పరిషత్ సంయుక్త నిర్వహణలో శతావధాన షడానన, శతావధాన పూర్ణచంద్ర డా॥ మారేపల్లి వేంకటరమణ పట్వర్ధన్ గారి సంపూర్ణ శతావధానము.

2 comments

జైశ్రీరామ్. 

జైహింద్.







ఉగాది కవిసమ్మేళనము. తిరుమలగిరి నాదనీరాజనంలో.-2025 || Tirumala || 30-03-2025 || SVBC TTD

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

శ్రీ విశ్వావసు …. తిరమలలో అక్షర నీరాజనము. వసంత శ్రీనివాసము. రచన….. చింతా రామకృష్ణారావు. 30 - 3 - 2025.

3 comments

 జైశ్రీరామ్.

౧. శార్దూలము.  

శ్రీమన్మంగళ శ్రీనివాసుని దయన్ శ్రీమంతమౌ ధాత్రికిన్

బ్రేమన్ జేరెను నూత్న వత్సరము తా విశ్వావసన్ బేరుతో,

ధీమంతుల్ వరభావనా కలితులై దేదీప్యమానంబుగా

ప్రేమన్ స్వాగత పద్యముల్ పలికిరా వేదాత్ముఁడే మెచ్చగన్ .

౨. శార్దూలము.  

శ్రీమన్మంగళ సద్ వసంత కళతో శ్రీమంత విశ్వావసున్

క్షేమానంద శుభ ప్రమోద సుఫల శ్రీలన్ బ్రసాదింపగా

ధీమాన్యుల్ గల భారతావని కిలన్ దేదీప్యమానంబుగాఁ 

బ్రేమన్ రమ్మని కూయుచున్ పిలెచె సద్ విఖ్యాతి నీ కోకిలల్.

3. ఉత్పలమాల.  

నూతన శక్తి సంపద ననూనముగా ప్రభవింపఁ జేయగా

ఖ్యాతిగ షడ్రుచుల్ కలిగి కమ్మగనొప్పు నుగాదిపచ్చడిన్

ప్రీతిగనిచ్చి చిత్తములు వెల్గగఁ జేయు మహోత్సవంబిదే,

నీతిగనుండువారల ననేక విధంబుల కావ వచ్చెనే.

౪. ఉత్పలమాల.  

చల్లని పిల్లగాలులిల చక్కని పుష్ప పరీమళంబులన్

మెల్లగ సంతరించుకొని మేలగు నూతనవత్సరాదిలో

సల్లలితంపు భావన లసాదృశ రీతిని గొల్పుచుండె, రం

జిల్లగ మానసంబులు, ప్రసిద్ధ కవీశుల మెప్పులందుచున్.

౫. ఉత్పలమాల.  

హైందవధర్మ తేజము, మహేశ్వరి రూపము వత్సరాది,  మో

హాంధము బాపి, సత్ప్రభ నహర్నిశలున్ వెలుగంగఁ జేసి, గ

ర్వాంధులఁ బారఁద్రోలి, అజరామర కీర్తిని దేశమాతకున్

సంధిలఁజేయ లోకమున చక్కగ వచ్చెను నేడు ప్రేమతోన్.

౬. చంపకమాల. 

జయములు పొందుడంచు పిక జాలము కూ యని కూయసాగ, ది

గ్జయములతోడ వెల్గుడని గట్టిగ దిక్కులు మారు మ్రోగెనే

నియతినిగల్గి మానవులు నిర్భర భక్తిని కల్గియుండి, ని

శ్చయముగ మంగళాత్ములయి చక్కగ వృద్ధిని పొందు గావుతన్.

౭. మత్తేభము. 

అలమేల్మంగ సుభాశిషంబులను మోహాదుల్ విడన్ జేయఁగాఁ,

గలలోసైతము హైందవాద్భుత గతిన్ గల్యాణ సద్వర్తనన్

వెలుగన్ జేయఁగ, మానవాళినిలపై  విఖ్యాతిగా కావగా

లలితంబై యరుదెంచె వత్సరము తా లక్ష్యంబులీడేర్చగాన్.

౮.అశ్వధాటి. 

పద్మావతీ జనని భాస్వంత తేజమును భవ్యంబుగా హృదయమన్

సద్మంబులన్ నిలుప, సంతోషమున్ గొలుప సంస్కారమున్ దెలుపుగా,

నోద్మంబుగానగుచు నుత్సాహ తేజముల నొప్పార వచ్చె మనకున్

పద్మప్రదీప్తదీప్తిని ప్రవర్ధిల్లు వత్సరము, భాగ్యంబు చూడ మనదే.

౯. చంపకమాల.  

తిరుమల వేంకటేశ్వరుని దివ్యపదాబ్జములన్ స్పృశింపగా

వెరవును జూపుమం చనిలు వేడుచు పుష్పచయం బొసంగె తా

పరిమళముల్, ముకుందునకు పర్విడి చేర్చె  వసంత వీచికల్

నిరుపమమైన పుష్పముల నిర్మల భక్తి పరీమళంబున్.

౧౦. ఉత్పలమాల.  

చిత్తమునందుపొంగె హరి చిత్తసరోజ పరీమళంబులన్

బత్తులు పంపియుండిరొకొ? పన్నుగ సన్నుత పుష్పకన్యలే 

యిత్తరి వత్సరాదియని, యింపుగ పంపిరొ? యీప్సితంబు నా

కెత్తరియైన పొందగ నహీనపు భక్తి సుపుష్పరాజిలన్.

౧౧. సుగంధి.

వత్సరాది యంచు నాదు భక్తులెల్ల భక్తితోఁ

గుత్సితంబులెల్ల వీడి కూడి వచ్చి రందరు?

యుత్సుకంబుతోడ తెచ్చి రొప్పు భక్తి పుష్పముల్

మత్సమర్పణంబు చేయ, లక్ష్య సిద్ధినెంచుచున్.

౧౨. మందాక్రాంత.

గోవిందాయంచనుపమగతిన్  కూర్మితో భక్తులెల్లన్

సేవింపంగా తిరుమలగిరిన్ జేరిరీనాడు భక్తిన్,

దేవేంద్రాదుల్ గనుచుఁ బ్రజలన్ నిర్నిమేషుల్ ప్రజల్గా

భావింపంగా వరలుచు హరిన్ భక్తితో గాంచిరార్తిన్.

౧౩. మత్తకోకిల.

యాత్రికుల్ పరమాత్మ సేనకు నార్తితో నరుదెంచుచున్

పాత్రులైరి జనార్దన ప్రతిభాదులెన్ని వచింపగా,

స్తోత్రముల్ పఠియించుచు న్నుత వత్సరాదికి స్వాగతం

బాత్రతన్ వచియించు టద్భుత భావిసూచకమాయెనే.

౧౪.  మానిని. 

(భ భ భ భ భ భ భ గ .. యతి 1-7-13-19)

శ్రీ విజయప్రభ చిందులు వేయఁగ చిన్మయ తేజము చిందుచు వి

శ్వావసు వత్సర భవ్య వసంతము వచ్చెను నేడు శుభంకరమై,

ధీవరులెన్ను ప్రదీప్తి కనంబడె, దివ్యముగా గణుతింపఁ దగెన్,

శ్రీ వసుధాస్థలు శ్రీకర సస్యము చెన్నుగ పండు ప్రసిద్ధముగాన్.

౧౫.  కవిరాజవిరాజితము.

(న జ జ జ జ జ జ లగ .. యతి1 -8-14-20)

భువిని నిరంతర పుణ్యఫలంబులు, భుక్తిని గొల్పెడి పూజ్యుఁడు! శ్రీ

ధవుఁడు, శుభప్రద ధర్మ విరాజిత ధాత్రిగ నిల్పు ప్రధానముగా

కవికుల పూజిత గౌరవ భారత గణ్య సుధాత్రిని, గాంచు కృపన్,

నవనవ కాంతు లనంతముగా కరుణన్ హరిగొల్పు ననారతమున్.

౧౬. మందారదామము. 

(త త త గగ .. యతి 7)

విశ్వావసే దివ్య విజ్ఞానమిచ్చున్,

శశ్వత్ ప్రమోదంబు చక్కంగ గొల్పున్,

విశ్వాసమున్ గొల్పు, విద్యాధికుండీ

విశ్వంబునన్ గీర్తి విద్యన్ గడించున్.

౧౭. మందారదామము. 

(త త త గగ .. యతి 7)

గోవింద! గోవింద గోవింద యంచున్

దీవించు దీవించు దీవించుమంచున్

భావించుచున్ జేరు భక్తాళి, వీరిన్

బ్రోవన్ వసంతంబు మున్ గొల్పినావా?

౧౮. ఫలసదనము . 

(న న న న స గ .. యతి 10)

అసమ సుగుణ మొసఁగు ననుప ముగ విశ్వా

వసు జనులను గనుచు, వసుధ పరమాప్తిన్,

రస భరిత భవితను ప్రముఖముగ గొల్పున్, 

దెసల వరలు సుగుణ దినకర సుదీప్తుల్.

౧౯. ఇందువదన వృత్తము. 

(భ జ స న గ .. యతి 9)

శ్రీపతికి సేవలను చేయు సుజనుల్,

దీపగతి నాత్మలను తృప్తిని గనున్,

పాపములు, శాపములు పాయునపుడే,

తీపిగను వత్సరము తేల్చు మనలన్.

౨౦.  పంచచామరము.

వసంతకాలమేగుదెంచె, భాసితున్ జనార్దనున్

ప్రసిద్ధమైన క్షేత్రమందు వాసిగా గనంగనౌ

నసత్ప్రవృత్తి దూరమౌ ననంత కీర్తి చేరువౌ,

ప్రసాద దైవ దృగ్విశేష భాగ్యమబ్బునిత్తరిన్.

౨౧. మత్తకోకిల గర్భ సీసము.  

(చిత్రకవిత్వము)

శ్రీనివాసుని దీప్తి చేరఁగ చిత్త మందిర పాళిలో గొప్ప తేజమమరె,

జ్ఞానదీప్తిరహించ,  కమ్మగ గానము ల్పొనరించుచున్ దివ్య మూర్తియైన

దీన బంధుని దేవదేవుని దీవనల్ గొని పొంగుచున్ భువిన్ గూర్మి తనర,

దీనబాహ్యతనొప్పె, దీప్తిని తెచ్చి వత్సరకాంతయే గొప్పఁదనము చూపె,

తే.గీ.  నుత్సుకతహెచ్చె నానందముద్భవించె,

మత్సరాదులు నశియించి మానవాళి

సత్సమంచితవర్తనల్ సమధికమాయె,

వత్సరాదికి జేజేలు పలుకవలయు. 

సీస గర్భస్థ మత్తకోకిల.

(ర స జ జ భ ర….యతి.౧౦)

శ్రీనివాసుని దీప్తి చేరఁగ చిత్త మందిర పాళిలో,

జ్ఞానదీప్తిరహించ,  కమ్మగ గానము ల్పొనరించుచున్ 

దీన బంధుని దేవదేవుని దీవనల్ గొని పొంగుచున్ ,

దీనబాహ్యతనొప్పె, దీప్తిని తెచ్చి వత్సరకాంతయే.

౨౨. తురగవల్గిత వృత్త గర్భ సీసము. 

శుభము శుభమని వసుధపయి తన శోభఁ జిందుచునుండెనే శ్రీకరముగ

నభయమొసగుచు నహము తుడుచుచు నద్భుతంపు వసంతమే ధరణి నిండె,

విభవ మలరఁగ, భవిత తెలియఁగ విశ్వనాథుఁడె తోడయెన్ నడుపుటకును,

సభలననుపమ విజయ చరితలు సంస్తుతించుచు పాడగా తిరుపతినిట.

తే.గీ. నేమి సందోహమయ్యారె! యేమి శోభ!

యేమి సంగీతరసఝరులేమి కృతులు!

నిత్యనూతన వాసంత నిరుపమ రుతి

నొప్పు తిరుపతి కొండపై గొప్పగాను.

సీస గర్భస్థ తురగవల్గిత.

(న న న న స జ జ గ .. యతి 15) 

శుభము శుభమని వసుధపయి తన శోభఁ జిందుచునుండెనే 

నభయమొసగుచు నహము తుడుచుచు నద్భుతంపు వసంతమే ,

విభవ మలరఁగ, భవిత తెలియఁగ విశ్వనాథుఁడె తోడయెన్ ,

సభలననుపమ విజయ చరితలు సంస్తుతించుచు పాడగా. 

౨౩. తోటకము. 

(స స స స .. యతి 9)

సువసంత సమీర విశుద్ధగతుల్

నవనీత శుభప్రత నవ్యకృతున్,

కవికోకిల గాత్రపు గానరుచుల్

భవితన్ విరచించు శుభంబులిలన్.

౨౪.  తేటగీతి.  

శ్రీనివాసుని  యగణితోద్యానములను  

విరియు పూలుగా హరిఁ జేరి వరలుదుమని,

పరవశించునీ లతలెల్ల భక్తినొప్పి,  

నిరుపమానందసామ్రాజ్య నేతలనగ.

౨౫. చంపకమాల.  

తిరుమల వైభవంబు కనితీరవలెన్, కమనీయ వేద సు

స్వర వర భాసురాన్వితము, సత్ప్రణవాక్షర మంత్ర గాన సం

భరితము, భక్తి తత్పరుల భావప్రపంచము, స్వర్గధామమున్,

వరమిది నూతనాబ్ధినిట పద్యములల్లి పఠించుటీశ్వరా!

౨౬. సీసము.  

నిరతాన్నదానంబు పరమాత్మభక్తుల కనుపమ వరమౌట యద్భుతంబు,

వరదుడౌ గోవిందు డరమర లేక తా కరుణించి కాచుటన్ గాంచవలయు,

సకల వేదపురాణ శాస్త్ర చర్చలతోడ సందడిగానుండు స్వర్గమరయ,

సురుచిర సుందర సుమసౌరభములతో పరమాత్మ సేవకై వరలు తరులు,

గీ.  ఏనుగులు, నశ్వసంహతి యెద్దులచట

నేడుకొండలవాని యా నీడలోన

సేవలను దేలి మురియుట చిత్రమెన్న,

వేంకటేశ్వరుఁ డసలైన వేల్పు భువిని.

౨౭. సీసము.  

కోనేటిరాయని కూర్మిని గననేర్చు కోవిదుం డిలపైన కోవిదుండు,

శ్రీవేంకటేశ్వర చిన్మయమూర్తిని ఘనముగా వర్ణించు కవులు కవులు,

శ్రీనివాసుని సేవ చేయుచు మురిసెడి వైష్ణవుండే ధర వైష్ణవుండు,

గోవింద నామంబు గొంతెత్తి పలుకెడి భక్తుఁడే యవనిపై భక్తుడరయ,

గీ.  పరమపురుషుని సేవించు భక్తుల నిల

వరలఁ జేయగ వచ్చె విశ్వావసుగను

వత్సరాదినుండియును బ్రహ్మోత్సవముల

ఘనతరానందమందించి కాంతిఁగొలుపు.

౨౮. సీసము.  

ధర్మ ప్రబోధంబు ధాత్రిపై జనులకు తీరుగా నేర్పునీ తిరుమలగిరి,

కర్మంబులెడబాపి, కరుణించి భక్తులన్ దివ్యంబుగా కాచు తిరుమలగిరి,

యాబాల గోపాలమందించు ముడుపులన్  దీసుకొనుచునుండు తిరుమలగిరి,

జీవంబు పరమాత్మఁ జేరుటకునునొప్పు  తెరవును జూపును తిరుమలగిరి,

గీ.  నేటి విశ్వావ సాగమమేటికనిన

సాటి లేనట్టి శ్రీనివాసమును జూపి

కోటి జన్మల పుణ్యంబు మూటగట్టి

గూటికిని జేర్చి నిలుపుట కొఱకు నిజము.

౨౯. తోటకము. 

(స స స స .. యతి 9)

సువసంత సమీర విశుద్ధగతుల్

నవనీత శుభప్రత నవ్యకృతున్,

కవికోకిల గాత్రపు గానరుచుల్

భవితన్ విరచించు శుభంబు లిలన్.

౩౦.  పంచచామరము.

వసంతకాలమేగుదెంచె, భాసితున్ జనార్దనున్

బ్రసిద్ధమైన క్షేత్రమందు వాసిగా గనంగనౌ

నసత్ప్రవృత్తి దూరమౌ, ననంత కీర్తి చేరువౌ,

ప్రసాద దైవ దృగ్విశేష భాగ్య మబ్బు నిత్తరిన్.

౩౧. ఇందువదన వృత్తము. 

(భ జ స న గ .. యతి 9)

శ్రీపతికి సేవలను చేయు సుజనుల్,

దీపగతి నాత్మలను తృప్తిని గనున్,

పాపములు, శాపములు పాయునపుడే,

తీపిగను వత్సరము తేల్చు మనలన్.

౩౨.  ఉత్పలమాల.  

భావజవైరి పత్నికి శుభంకర కాళికి మంగళంబు, వి

శ్వావసు వత్సతంబునకు, భాగ్యవిధాతకు  మంగళంబగున్,

ధీవర పండితాళికిని, దేవులఁ గొల్చెడి భక్తపాళికిన్,

జీవనభాగ్యమై వెలుగు స్రీ  జనపాళికి మంగళంబగున్.

౩౩.  ఉత్పలమాల.  

మంగళమౌత మంగపతి మాన్యపదద్వయభద్ర కాంతికిన్,

మంగళమౌత సప్తగిరి నాథుని పత్నుల కెల్లవేళలన్,

మంగళమౌత భక్తులకు, మంగళముల్ కవిపండితాళికిన్,

మంగళమౌత భారతికి, మంగళముల్ మన మాతృభూమికిన్.

జైహింద్.