గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2024, సోమవారం

లక్ష్మీసహస్రం. 3వ శ్లోకం. 13 - 20. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

0 comments

 జైశ్రీరామ్.

॥ శ్రీలక్ష్మీసహస్రనామావలిః ॥

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

రచన.   చింతా రామకృష్ణారావు.

గానం. శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.


శ్లో.  ఈశావాస్యా మహామాయా మహాదేవీ మహేశ్వరీ ।

హృల్లేఖా పరమా శక్తిర్మాతృకాబీజరూపిణీ ॥ 3 ॥

13. ఓం *ఈశావాస్యాయై* నమః ।

నామ వివరణ.

అంతటనూ తానై యున్న తల్లి లక్ష్మీ మాత.

శా.  *ఈశావాస్య! * జయోzస్తు తే, యనుచు నిన్నే కొల్తురోయమ్మ! స

ద్ధీశాలాగ్రణు లెల్లవేళలను,  స్వాధీ నాత్ములై ధాత్రి, వా

గీశానీ నుత సత్ స్వరూపిణివి దేవీ!  లోకమందంతటన్

నీ శక్తిన్ గను నేర్పునిమ్ము కృపతో నిత్యంబు నిన్ గొల్చెదన్.

14. ఓం *మహామాయాయై* నమః ।

నామ వివరణ.

అష్ట లక్ష్మీ స్వరూపిణియైన జనని గొప్ప మాయా స్వరూపిణి.

శా.  మాయామోహములన్ జయింపనయితిన్ మాయన్ ద్యజించన్   *మహా

మాయా!* నీ పదపద్మముల్ కొలిచెదన్ మాయన్ విడన్ జేయుమా,

నీ యాజ్ఞన్ శిరసావహించి నడచున్ నీ సృష్టి సర్వంబు, నీ

మాయన్ బాపుట నీకు లెక్కయగునా? మాతల్లివే, పాపుమా.

15. ఓం *మహాదేవ్యై* నమః ।

నామ వివరణ.

గొప్ప దేవత జహన్మాతయైన లక్ష్మీ మాత.

కం.  భావాతీతవుగ *మహా

దేవీ!* మద్భాగ్యలబ్ధ దీపిత వీవే

కావక యున్నను నాకిక

నేవారలు ప్రోవఁగల రహీన దయాబ్ధీ!

16. ఓం *మహేశ్వర్యై* నమః ।

నామ వివరణ.

గొప్ప ప్రభ్విణి మన లక్ష్మీ మాత. మహేశ్వరుని అర్థాంగలక్ష్మి మహేశ్వరి.

కం.  నీ యనుఁగు భక్తుల కిలను

శ్రేయములిడు శ్రీ *మహేశ్వరీ!* నినుఁ గొలుతున్.

నాయందు కృపను నిలువుము

మాయను పోకార్పి కావ, మహిలో జననీ!

17. ఓం *హృల్లేఖాయై* నమః ।

నామ వివరణ.

హృదయమును తాకు జనని. హ్రీమ్ అనే అక్షరంలో ఉన్న జనని. 
కం.  *హృల్లేఖా!* నా మదిలో
కల్లోలములణచివేసి కారుణ్యముతోఁ
జల్లగ కావుము నన్నున్!
దల్లిగ నీ కృపను జూపి ధైర్యమునిమ్మా.

18. ఓం *పరమాయై* నమః ।

నామ వివరణ.

లక్ష్మీమాత గొప్పదైన తల్లి.

కం.  *పరమా* నిన్నే కొలిచెద

పరమార్థమునెన్ని నేను ప్రఖ్యాతముగా,

నిరుపమ సద్గుణ గణ్యా!

వరదాయిని వీవె నీ ప్రభావము నెంతున్.

 

19. ఓం *శక్త్యై* నమః ।

నామ వివరణ.

అమ్మ శక్తి స్వరూపణి.

తే.గీ.  శక్తివోయమ్మ శ్రీ పరా! *శక్తి! * నీవు

ముక్తి భాగ్యప్రదాయివి! పూజ్య దేవి!

యుక్తమైనట్టివిమ్ము నాకొప్పిదముగ,

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *పరమాయై శక్త్యై* నమః.
 

నామ వివరణ.

గొప్ప శక్తి స్వరూపిణి మన  లక్ష్ని మాత.

కం. ననుఁ గను *పరమా! శక్తీ! *

నిను నామది నిలిపి సతము నిన్నే కొలుతున్,

కనిపించు కంటికెదురుగ

వినయంబుగఁ బ్రణుతులిడుదుఁ, బ్రీతిగ జననీ!

కం.  అమ్మా! *పరమా శక్తీ!*

సమ్మోదము తోడ నాదు సంస్తుతి  వినుమా,

నెమ్మదిఁ బరమాశక్తిగ

నిమ్మది నివసింపుమో యహీన దయాబ్ధీ!

20. ఓం *మాతృకాబీజరూపిణ్యై* నమః ।

నామ వివరణ.

మాతృకా వర్ణస్వరూపిణి మన అమ్మ.

తే.గీ.  *మాతృకాబీజరూపిణీ!* మహితమయిన

మాతృకా వర్ణమయముగా మదిని నిలిచి

పద్యసంస్తుతులందీవు పరిఢవిల్లి

సంతసంబును గొలుపుమా చదువరులకు.

జైహింద్.






లక్ష్మీసహస్రం. 2వ శ్లోకం. 7 - 12. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

0 comments

 లైశ్రీరామ్.

॥ శ్రీలక్ష్మీసహస్రనామావలిః ॥

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

రచన.   చింతా రామకృష్ణారావు.

గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

॥ శ్రీలక్ష్మీసహస్రనామావలిః ॥

శ్లో.  మహాలక్ష్మీర్మహాకాలీ మహాకన్యా సరస్వతీ ।

భోగవైభవసంధాత్రీ భక్తానుగ్రహకారిణీ ॥ 2 ॥

7. ఓం *మహాలక్ష్మ్యై* నమః ।

నామ వివరణ.

గొప్ప లక్ష్మీదేవి మన అమ్మ. అందరికీ జీవనాధారమయిన తల్లి మన

మహాలక్ష్మితల్లి.

తే.గీ.  నుత *మహాలక్ష్మి!* నినుఁ గొల్చు బ్రతుకు బ్రతుకు.

క్షితిజ మానవ జాతికి బ్రతుకు నీవె,

నీవు లేకున్న బ్రతుకులే లేవు జనని,

నీదు కృపజూపి భక్తుల నాదుకొనుము.

8. ఓం *మహాకాల్యై* నమః ।

నామ వివరణ.

మిక్కిలి శక్తిస్వరూపిణి అయిన కాలీ స్వరూపము మన తల్లి.  మిక్కిలి నల్లగా

ఉండు తల్లి ఈ జనని.

తే.గీ.  శ్రీ *మహాకాలి!* నిలుము నా చిత్తమందు,

నా గృహంబున నీవుండి నన్ను గనుచు

నైహికంబును బరము నాకందఁ జేసి

నన్ను గాపాడుమమ్మరో సన్నుతముగ.

9. ఓం *మహాకన్యా*యై నమః ।

నామ వివరణ.

మన అమ్మ లక్ష్మీమాత గొప్ప కన్యక. కన్యకలయందు ప్రకాశించు మహాకన్యక

మన అమ్మ.

తే.గీ.  కన మహాకన్య వీవమ్మ కల్పవల్లి!

కొలిచెదన్ *మహా కన్య!* నిన్ గొప్పగాను,

కన్యకామణులందునఁ గలిగి నీవు

వినుత లక్ష్మీప్రదమ్ముగా వెలుగుదువుగ.

10. ఓం *సరస్వత్త్యై* నమః

నామ వివరణ.

మన అమ్మయగు లక్ష్మీ మాతయే సరస్వతీ స్వరూపము.

తే.గీ.  ఓ *సరస్వతీ!* నీకృపనొప్పిదముగ

జీవితము సాగుచుండును సేవిత పద!

హంసవాహినివగుచు నీవమరియుండి

చిత్తమునవెల్గు చుందువే చిన్మయముగ.

11. ఓం *భోగవైభవసంధాత్ర్యై* నమః ।

నామ వివరణ.

భోగమును వైభవములను మనకు ప్రసాదించుజనని లక్ష్మీమాత.

తే.గీ.  *భోగవైభవ సన్ధాత్రి!* పూజలంది

భోగవైభవములనిమ్ము పూజ్యముగను,

యోగమును గొల్ప ముక్తికై, యోగ్యులకును,

నిన్ను సేవించు యోగమే నిరుపమమిల.

12. ఓం *భక్తానుగ్రహకారిణ్యై* నమః ।

నామ వివరణ.

భక్తులపై అనుగ్రహ కారణమయిన జనని లక్ష్మీమాత.

శా.  *భక్తానుగ్రహకారిణీ!* జయము, నీ భక్తాళి ధన్యాత్ములై

రక్తిన్ నిన్ మదిలోన నిల్పి సతమున్ బ్రార్థింతురోయమ్మ! నీ

శక్తిన్ మానసమందు నెంచి కృపకై సాంతంబు నిన్ గొల్తురే,

భక్తిన్ శక్తి నిహంబు సత్ పరము నా భాగ్యంబుగాఁ గొల్పుమా.
జైహింద్.