గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జనవరి 2018, మంగళవారం

9వ పద్యపక్షము తెలుఁగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర, మన కర్తవ్యము.. రచన. చింతా రామ కృష్ణా రావు.

1 comments

జైశ్రీరామ్.
9వ పద్యపక్షము
తెలుఁగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర, మన కర్తవ్యము..
రచన. చింతా రామ కృష్ణా రావు.
. ఆటవెలది త్రయ గర్భ సీసము.
శ్రీకరంబు తెలుఁగు. శ్రీవాణి మంజీర - నాద మంజులమగు నా తెలుంగు.
తెలుఁగు దివ్వె భువిని కొడికట్టుకొనుచుండ, - ప్రభుత కాంచకుండె భవిత కృష్ణ.
జీవభాష తెలుఁగు, చిన్మూర్తిఁ గనఁ జేయు, - ధైవభాష పోలి ధాత్రి వెలిఁగె.
భావ సుందరమగు పదసంపదల భాష. - బ్రతుకఁ జేయుమయ్య క్షితిని కృష్ణ!
.వె. ప్రభుత దృష్టి పెట్టి పాఠశాలలనుండి - తెలుఁగు వరలఁజేసి నిలుప వలయు.
జనులు మాతృభాష ఘనతను మరువక - తెలుఁగు నేర్వ భువిని వెలుఁగు కృష్ణ!
. ఆటవెలది త్రయ గర్భ సీసము.
తెలుఁగు తెనుఁగు నాంద్ర దేదీప్య నామాల - వెలుఁగె నాడు తెలుఁగు జిలుఁగులీని
తెలుఁగు వెలుగుకింక తెల్లవారుచునుండె - నాంగ్లమరయుచుంట నమల కృష్ణ!
చిత్ర కవిత, బంధ చిత్ర, గర్భకవిత, - శ్లేష కవిత తెలుఁగు హృదయమపుడు
నేడు వర్ణచయము నేర్వకుండుటఁ జేసి, - వీడిపోయె తళుకు వినుము కృష్ణ!
.వె. సద్వధాన సుగతి, సరస వాఙ్మయముతో - నలరు భాష తెలుఁగుకథమ గతియె
కలుగుచుండె. ప్రభుత కని కావఁగావలెన్, - మరచిరేని తెలుఁగు మనదు కృష్ణ!
. ఆటవెలది త్రయ గర్భ సీసము.
మనము తెలుఁగు భాష మాటలాడవలయు - సరస కావ్య తతిని చదువ వలయు.
ఘనత చాటు తెలుఁగు ఘన చిత్ర బంధముల్ - కలవటంచు తెలుపవలయు కృష్ణ!
నవ రసామృత మిది, శ్రవనసుందరమిది - నవ్య గతుల వెల్గు భవ్య భాష
అట్టి తెలుఁగు వీడుటన్యాయమేకద! - అరసి కావుమయ! యనంతకృష్ణ!
.వె. బ్రతుకు కొఱకు మనము పాశ్చాత్య దేశాల - కేగి యుండవచ్చు నెచ్చటున్న
మాతృభాష తెలుఁగు మన్ననందునటుల మేము - చేయవలయు పృథ్వి కృష్ణ!
4. కంద గీత చంపకమాల గర్భ సీసము.
మన తెనుఁగున్ సదా మహిని మన్నన లందెడి మ్రానిపండునాన్ కమ్రగతిని
ఘనత గనన్గ సత్ కవులు గాంచెడి ధీపథ క్రాంత దర్శిగా తరిచి తరిచి
కని మనుపందగున్. కనఁగ కమ్మని తెన్గిది, గ్రాహ్యమిద్ది. మా తేజమంచు
ధనమనుచున్, సదా ధరణి తప్పక నిల్చెడి ద్రవ్యమౌనుగా భద్రతనిడ.
తే.గీ. ప్రభుతయున్ బ్రజ తెన్గును వర్ధిలంగ - చేయ వలయును సద్ గణనీయ కృషిని.
చిత్ర బంధ సద్గర్భాది శ్రీకరమగు - రచనలను చేసి సత్ కవుల్ ప్రబల వలయు.
సీస గర్భస్థ చంపకమాల.
మన తెనుఁగున్ సదా మహిని మన్నన లందెడి మ్రానిపండు నాన్
ఘనత గనన్గ సత్ కవులు గాంచెడి ధీపథ క్రాంత దర్శిగా
కని మనుపందగున్ కనఁగ కమ్మని తెన్గిది గ్రాహ్యమిద్ది. మా
ధనమనుచున్, సదా ధరణి తప్పక నిల్చెడి ద్రవ్యమౌనుగా.
సీస గర్భస్థ కందము.
తెనుఁగున్ సదా మహిని మ
న్నన లందెడి మ్రానిపండు నాన్ ఘనత గనన్
మనుపందగున్ కనఁగ క
మ్మని తెన్గిది గ్రాహ్యమిద్ది. మా ధనమనుచున్,
సీస గర్భస్థ తేటగీతి.
మహిని మన్నన లందెడి మ్రానిపండు
కవులు గాంచెడి ధీపథ క్రాంత దర్శి
కనఁగ కమ్మని తెన్గిది గ్రాహ్యమిద్ది.
ధరణి తప్పక నిల్చెడి ద్రవ్యమౌను.
5. చం. తెలుఁగునఁ గల్గు చిత్రములు, దీపిత గ్రాహ్య మహత్ ప్రహేళికల్,
వెలుఁగులనీను కావ్యములు, వేల్పులఁ జూపెడి భాషణాంశముల్,
సులువగు నీతి పద్యములు, సుందర సద్రచనాదికంబులన్
వెలుఁగఁగ చేయుటే విధిగ ప్రీతిని చేకొనుటొప్పునందరున్.

జైహింద్.

15, జనవరి 2018, సోమవారం

ఆర్యులారా! మీ అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! మీ అందరికి 
మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
ఉ:- బంగరు కాంతులీను పురి పాకలు, మామిడి తోరణావళుల్
ముంగిట రంగవల్లుల నమోఘముగా విరచించు కన్యకల్
చొంగలు కార్చుచున్ కనెడి సోకుల రాయుల వేష భాషణల్
రంగుగ నద్దినట్టి చదరంగపు మ్రుగ్గుల మధ్య గొబ్బిళుల్,
జంగమ దేవరల్ కొలుపు చక్కని నాదములిచ్చు శంఖముల్
టింగరి వోలె చెట్లపయి డేకుచు నాడెడు కొమ్మ దాసరుల్
సాంగముగా హరిన్ కొలుచు సన్నుత శ్రీ హరి దాసరావళుల్
పింగళ వర్ణులౌ పగటి వేషపు గాండ్రును, పల్లె వాసులున్,
రంగుల వస్త్ర ధారణను రాజిలు ముంగిటి గంగిరెద్దులున్
హంగులకాశ చేసి వరహాలను జల్లెడి పెత్నదారులున్
నింగికినంటు యాశల మునింగియు నల్గెడి క్రొత్త యల్లుళున్
రంగులు పూసి బావలకు రాతిరి యక్కల దాచు చెల్లెళున్
బంగరు బావ గారనుచు వందలు గుంజెడి బావ మర్దులున్,
బెంగగ నుండు నప్పులిల పేరుకు పోవుచునున్న మామలున్.
భంగమునొంది జూదమున పళ్ళికలించెడి తోటి యల్లుళున్.
ఖంగని మ్రోగునట్టి గుడి గంటలు. మండెడి భోగి మంటలున్,
నింగికి నంటు సంతసము నివ్వటిలే సరి క్రొత్త జంటలున్,
బంగరు పళ్ళెరంబులను పంటికి నోటికి నచ్చు వంటలున్,
రంగుల నీను పల్లెలును రమ్యత నొప్పెడి పట్టణంబులున్,
యింగిత మున్నసత్కవుల కెల్ల మనోజ్ఞ ము సంకురాత్రులౌన్.
జైహింద్

14, జనవరి 2018, ఆదివారం

8వ పద్యపక్షము సమాజ శ్రేయస్సు - నా కర్తవ్యము. రచన. చింతా రామ కృష్ణా రావు

2 comments

జైశ్రీరామ్.  

శ్రీమద్గుణ సంపన్నులైన పాఠకాళికి 
భోగి పండుగ సందర్భముగా 
శుభాకాంక్షలు.

8వ పద్యపక్షము
సమాజ శ్రేయస్సు నా కర్తవ్యము.
రచన. చింతా రామ కృష్ణా రావు
. అటవెలది త్రయ గర్భ సీసము.
అజుని సృష్టిని భువినపురూప సౌందర్య - సత్ప్రభా ప్రణవ ప్రశస్తి నిండె.
జ్ఞాన హీనులమయి గ్రహియింపఁగాలేము. - జ్ఞానమొదవునట్లు కనుమ కృష్ణ!
జ్ఞాన దీప్తి కలుగ కానంగనగును సత్. - సత్స్వభావమిలను జయపథంబు.
నాదు కృషిని దాని శోధించి వ్యాప్తిలం - జేయఁదగును. కలుగ జయము కృష్ణ!
.వె. సత్వమీవె ప్రణవ సౌందర్యమును నీవె, నిన్నె జూపు జనులనెన్ని వారి
వలన ప్రబల సత్స్వభావంబు కృషి చేయ వలయునయ్యనేను వసుధ కృష్ణ!
. అటవెలది త్రయ గర్భ సీసము.
చిత్స్వరూపమున ప్రసిద్ధంబుగా నీవు మనములందు దాగి మసలుదువయ
నిన్నుఁ గాంచి ప్రజల కెన్ని చూపుట నాదు విది. చరింపఁ గనుమ ప్రీతిఁ గృష్ణ!
దోష గతులఁ బాపి, భాషణంబునమంచి భావనమున మంచి ప్రబలఁజేయు
ధర్మమమరె నాకు. తప్పక చేయించు, నాకు నీడవగుచు నడచు కృష్ణ!
.వె. నీవె దోష రహిత నిర్మలాత్ముఁడవయ్య! దోష రహితమైన భాషవీవె.
భావనములవెల్గు బ్రహ్మంబు నీవె నిన్ వరలజూపుదునయ వరద! కృష్ణ!
. అటవెలది త్రయ గర్భ సీసము.
ఆత్మశుద్ధి కొఱకు హరి పాదపద్మముల్ మనములందు నిలుపి మనునటులను
చేయవలయు నేను చిన్మార్గ గామినై భక్తపాళికిలను భవ్య కృష్ణ!
నీదు తోడు కలిగి ఖేదంబులను బాపి నిత్య సంతసమును నిలుపవలయు
భారతీయులమది. పరమార్థమిదె కదా! ధర్మ పథము నిమ్ము దయను కృష్ణ!
.వె. ఇహములోన కుములు నీస్వరు నెఱుఁగమిన్, మోహతప్తులగుచు మూర్ఖ జనులు.
వారి మదులకెక్క నీరూపమును జేయ వలయు నేను. మదుల నిలుచు కృష్ణ!
. . త్రికరణశుద్ధిగా శుభ గతిన్ జరియించుచు, సత్యమార్గమున్
ప్రకటితమౌనటుల్ తెలిపి భవ్యమహోద్గతి కొల్పి మేదినిన్
సకల జనాళికిన్ జయము, శాంతియు గొల్పుట నాదు ధర్మమౌన్
ప్రకటిత భక్తితో హరిని ప్రార్థన చేసి యొనర్తు నా విధిన్.
. . ప్రజలకు స్వస్తి గొల్పఁగను, రాజులు ధాత్రిని ధర్మ దీక్షతో
సుజనులు మెచ్చ చేయఁగ, వసుంధరదేవులు ధేనువుల్ సదా
ప్రజనిత సౌఖ్యమున్ వరల, ప్రాభవమొప్పఁగ చేయఁ బూనెదన్.
నిజమగు శక్తిమ్ము, ధరణిన్ విధి పూర్తిగ చేయ దైవమా!

జైహింద్.

13, జనవరి 2018, శనివారం

7వ పద్యపక్షము మాదక ద్రవ్యాల మత్తులో యువత - నాశనమవుతున్న భవిత. రచన. చింతా రామ కృష్ణా రావు

0 comments

జైశ్రీరామ్.
7వ పద్యపక్షము
మాదక ద్రవ్యాల మత్తులో యువత - నాశనమవుతున్న భవిత.
రచన. చింతా రామ కృష్ణా రావు
. అటవెలది త్రయ గర్భ సీసము.
శ్రీనివాసుఁడవని చిక్కుంచుకొన నిన్ను - చేయి పట్టి తరికి చేఁదుకొనవొ?
మానవాళి మరిగె మాదక ద్రవ్యముల్ - భవిత భ్రష్టమవదె? పాహి కృష్ణ!
అతిప్రమాదకరము లగును మాదకద్రవ్య - ములవి మరిగి ప్రాణములకు ముప్పు
తెచ్చుకొనుచునున్న వచ్చునెవ్వఁడు కావ, - మాన్పి కావుమఖిల మాన్య కృష్ణ!
.వె. పెద్దవారు పలుకు సుద్దులు వినఁజాల - రిట్టి మాదకములనెఱిఁగిరేని.
పిన్నవారి భవిత పీకుకుపోవును - జాగు వలదు.కావ జాలు కృష్ణ!     .
. అటవెలది త్రయ గర్భ సీసము.
నీతి నెఱుఁగ నేర్పి భాతిని పెంచినన్ బాలురెపుడు నేర్వజాలరిట్టి
మత్తు కలుగఁ జేయు మాదక ద్రవ్యముల్ గొనుట. నేర్పునటుల కనుము కృష్ణ!
మంచి చెడులనెన్న మరతురు మత్తులో భవిత శూన్యమగుట భువిని కనరు.
మత్తుమందు మరిగి చిత్తగుచున్నట్టి వారి మదులు మార్చవేర? కృష్ణ!
.వె. తల్లిదండ్రులపయి దయన్నదే వీడు, తనను తాను కనడు గుణము చెడును.
మరిగిరేని జనులు మాదక ద్రవ్యముల్ మరుగకుండ సుగతి మనుపు కృష్ణ!
. అటవెలది త్రయ గర్భ సీసము.
చదువు సంధ్యలు విడు సద్భావనలు వీడు సుగతి వీడు తనదు ప్రగతి వీడు
వీడ జాలక తను వాడు మాదకద్రవ్య ములను. కావుమతని పూజ్య కృష్ణ!
చేయ రాని పనులు చేయఁబూను యువత, ప్రాయముడుగునాడు పనికి రారు.
జ్ఞేయములను నేర్చి శ్రేయంబు గనుమార్గ గాములవగఁ జేసి కాచు కృష్ణ!
.వె. తల్లిదండ్రులెపుడు తమ పిల్లలను కని పొంగఁ జూతురుకద? ముదిమి కదిసి
మూల్గుచున్న తరిని పోషింపఁదగు సంతు మత్తు వీడి కనఁగ మలచు కృష్ణ!
చం. భవితకు మూలమౌ యువత బానిసలైనను మత్తుమందుకున్
భువినిక కల్గునెవ్వరు ప్రపూజ్య మహాద్భుత భావి గొల్పగా?
సవరణ చేయగావలెను చట్టములన్, భువి మత్తు మందులిం
కెవరును తీసుకో వెరవనెంతటి దండననైన వేయుచున్.
. ధనసంపాదనకై దురాత్ములిల సంస్థాపించి రీద్రవ్యముల్
జనులెల్లం గొననమ్ముచుండిరకటా! జాఢ్యంబుగా మారెనే
డినవంశోత్తమునైనమార్చ గలిగే యా మాదకద్రవ్యముల్
గొనకుండన్, నశియించకుండ మనగా కూర్మిన్ జనుల్ కోరెదన్.

జైహింద్.

12, జనవరి 2018, శుక్రవారం

విచ్ఛిన్నమౌతున్న వివాహ వ్యవస్థ - సంతానంపై దాని ప్రభావం. రచన. చింతా రామ కృష్ణా రావు.

1 comments

జై శ్రీరామ్.
6 వ పద్య పక్షమ్.  
విచ్ఛిన్నమౌతున్న వివాహ వ్యవస్థ - సంతానంపై దాని ప్రభావం.
రచన. చింతా రామ కృష్ణా రావు.
. సీ. శ్రీకరంబనుచును జీవన సరళికి = పెండ్లితంతు కొలిపిరిండ్లు వెలుఁగ
దాని వలన వారు తమదైన సంతతి - సుఖముపొందిరపుడు, శుభద కృష్ణ!
దంపతులగువారు తమరిద్దరొక్కటై - కలిసి మెలిసి బాధ్యతలు వహించు.
నొకరికొకరుతోడు సకల శుభములిచ్చు - ననుచునేర్పరచిరి వినుము కృష్ణ!
.వె. ఇట్టిచక్కనిదగు నీ సంప్రదాయము - మట్టిఁగలియుచుండె మహిని నేడు.
స్వేచ్ఛ పెఱిగి వారలిచ్ఛానుసారము - గొడవలు పడుచుండ విడరె కృష్ణ!
. సీ. ఆలుమగల మధ్యనన్యోన్యతయె సంతు - హేతువన్నదెఱిఁగి నీతి తోడ
మెలఁగుచున్నఁ గలుగు మేలైన సంతతి - మెలగకున్న జనత కలఁగు కృష్ణ!
ధర్మమార్గము విడి దంపతులున్నచో - కలుగు సంతు దురిత గతుల నడచు
దురితులయిన సంతు దుర్గతిపాలౌను. - చేయరాని పనులు చేసి కృష్ణ!
.వె. తల్లిదండ్రులొసఁగు ధనము ప్రేమయె కనఁ - బ్రేమ లేని బ్రతుకు బీడువారు.
లోకకంటకులగు లోకాన బిడ్డలు - తల్లిదండ్రుల విడు ధరను కృష్ణ!
. సీ. భర్తమాట వినని భార్యలుండగరాదు - భార్య మాట వినని భర్తలటులె.
వారసత్వ గతిని వర్ధిలఁ జేసిన - బాగు పడును పృథ్వి బాల కృష్ణ!
వారి సంతు వెలుఁగు భక్తిప్రపత్తులన్ - వరలఁ గలరు వారు వసుధ కృష్ణ!
కానినాడు జగతి గాఢాంధకారాన - కుములు నిజము కాంచ, గోప కృష్ణ!
.వె. ధర్మబద్ధమయిన దాంపత్య బంధమున్ - గౌరవింపవలెను కాపురమున,
గౌరవింతుమేని ఘనులైన పెద్దలన్ - దైవశక్తి మనకుఁ దక్కు కృష్ణ!
. . అహము, మదంబు, కామము, గయాళితనంబున నుండు స్త్రీలచే,
మహి ఘన పుంస్త్వ గర్వమున మత్తిలి వర్తిలు పూరుషాళిచే
నిహతమగున్ సుసంస్కృతి. నివృత్తియె లేని దురంత దుస్స్థితుల్
స్పృహను దహించు, ఛిన్నమగు శ్రీకర బాంధవ బంధనాళియున్.
. . వరలెడి ధర్మ సన్నుత వివాహ వ్యవస్థయె ఛిన్నమైనచో
తెరువిక లేదు. సంతతియు తీరుగ వర్ధిలఁ జాలరిద్ధరన్.
పరమ దురాత్ములౌన్, వినుత భారతి కీర్తి నశించు, వీరిచే.
మరువకుడయ్య వర్తిలుఁడు మన్ననతో ఘన సంస్కృతీప్రభన్.!  

జైహింద్.

11, జనవరి 2018, గురువారం

5వ పద్య పక్షమ్. సర్కారు బళ్ళు చదువుల గుళ్ళు. రచన. చింతా రామ కృష్ణా రావు.

1 comments

జై శ్రీరామ్.
5వ పద్య పక్షమ్.  సర్కారు బళ్ళు చదువుల గుళ్ళు.
రచన. చింతా రామ కృష్ణా రావు.
ఆటవెలది త్రయ గర్భ సీసము.
శ్రీకరంబు చదువు, చిత్జ్ఞాన సుఫలద. జీవితేశునఱయఁ జేయునిదియె.
జీవ శక్తినొసఁగు జీవికకిదిప్రాపుభావి భాగ్యమిదియె, దేవ! కృష్ణ!
చదువు సంద్యలరయ, సన్మార్గమరయంగ, గురుకులంబులమరఁ గొలుప నాడు
నేడు బ్రతుకు బాట నేర్పాటు సర్కారు బడులు చేయు నవియె గుడులు కృష్ణ!
.వె. గుడులలోన శిలను కూర్మిని గను దైవ
మనుచు నేర్పు బడులు మనకు గుడులు.
సత్యమెన్నిచూడ సర్కారు బడి మేలు
కొలుపు, మదిని మేలుకొలుపు కృష్ణ!
ఆటవెలది త్రయ గర్భ సీసము.
ఓనమాలనరయ నోర్పుతో సర్కారు బడులు నేర్పి కొలుపు భక్తి మనకు
ఆంగ్లవర్ణములనె యరయమంచును నేర్పు నట్టివేల విను మహాత్మ కృష్ణ!
పెక్క సొమ్ములొసఁగి పేరున్న బడులంచు నాంగ్ల భాషనరయనంప శిశువు
చిక్కులందుపడుచు చీకాకు పొందునే? క్షేమమేల కలుగు శ్రీశ! కృష్ణ!
.వె. భాగ్యమంతపోవు, భవిత శూన్యంబగు,
తెలుఁగు భాష మరచు, నలిగిపోవు
నెట్టి కష్ట మనున దిలఁ గన సర్కారు
బడుల నుండదు కద! ప్రనుత కృష్ణ!
ఆటవెలది త్రయ గర్భ సీసము.
ఆటపాటలకును, మేటి విద్యలకును సాటిలేని ప్రగతి బాట నడుపు
సద్విభాసితమగు సర్కారు బడి సాటి లేదు చూడ భువిని లేదు కృష్ణ!
నిరుపమానులయిన నిష్ణాత బోధకుల్  నేర్పు విద్యలిచట నేర్పు మీర.
అటకు నిటకుపోయి ఆయాస పడనేల భావి జీవితమున వరల కృష్ణ!
.వె. అమ్మపాల సాటి యవనిని లేదుగా!
కమ్మ తెలుగు సాటి కనఁగ లేదు.
సదయ బోధనమున సర్కారు బడి సాటి
లేదు లేదు లేదు లేదు కృష్ణ!
చం. చదువుల దేవళమ్ములని సన్నుతి చేయుచు తల్లిదండ్రులిం
పొదవగ చేర్చు బిడ్డల మహోన్నతి కోరుచు పాఠశాలలన్.
మదులఁ దలంచి బోధకులు మాన్యతనొప్పుచు బోధఁ జేయమిన్
వదలఁడు దైవమెన్నఁడును, వారిని శిక్షలఁ గుంజునిద్ధరన్.
కం. మన్ననఁ బొందెడి బోధన,
సన్నుత సత్ప్రాంగణంబు, సద్బోధకులున్,
జెన్నుగ నుండిన మనలకు
సన్నుత సర్కారు బళ్ళు చదువుల గుళ్ళౌన్.

జైహింద్.

10, జనవరి 2018, బుధవారం

4వ పద్య పక్షమ్. తొలకరి చినుకులు రైతుల తలపులు. రచన. చింతా రామ కృష్ణా రావు.

1 comments

జై శ్రీరామ్.
4వ పద్య పక్షమ్.  తొలకరి చినుకులు తైతుల తలపులు.
రచన. చింతా రామ కృష్ణా రావు.
1. ఆటవెలది త్రయ గర్భ సీసము.
ఋతువులారు కలిపి వృత్తంబుగా చేసి - కాల గతిని కూర్చి కదిపినావు.
ధర్మబద్ధమయిన తరియన్నదే లేని - కాల గమనమందు కలుగు కృష్ణ!                                            
ఋతువులందు సహజ ఋతు ధర్మముం గూర్చ - గ్రీష్మఋతువు లోని కీల చేత
భూమిమాడు చుండి బగబగల్ పుట్టించ - రైతు మనసులోన రగులు కృష్ణ.
.వె. అట్టి సమయమందు నాశలు పుట్టించ - తొలకరింపువగుచు పలుకుదీవు
ప్రకృతి రక్షకుఁడగు పరమాత్మగా నెంచి, - దానిఁ గనిన రైతి తనియు కృష్ణ!
2. ఆటవెలది త్రయ గర్భ సీసము.
గ్రీష్మ ఋతువు తాను భీష్మ కీలల మాడ్చ - వేగుచున్న ధరణి బీడువారు.
పైరుపచ్చలవని పై నెండిపోవగా - పసరములవియెట్లు బ్రతుకు కృష్ణ?
పసుల జీవికకయి పలుపలు విధముల - యత్నములను చేసి యలసిపోవు
నంతలో తొలకరి నంతసమ్మునుఁ గూర్చ - వచ్చు రైతు జనులు మెచ్చ కృష్ణ!
.వె. తొలకరి పొడఁ గాంచి తుది లేని యానంద మొదవరైతు మదిని వ్యధను వీడి
భూమిదున్నుటకయి పూజలు చేయుచు పొంగిపోవునతఁడు. పూజ్య కృష్ణ!
3. ఆటవెలది త్రయ గర్భ సీసము.
చిఱు చిఱు వడగళ్ళు చెలరేగు పెనుగాలి, కారుమబ్బుల గతి కనిన రైతు
వర్షధార తడువ పరువెత్తు హర్షంబు మిన్నుముట్ట భవిత నెన్ని కృష్ణ!
చిటపట చిఱు జల్లు కటిక నేలను పడి నంతనావిరయి, నయ పరిమళము
జగతిని వెదజల్లు, సొగసైన కలవాపి నటన చేయ వలచునచట కృష్ణ!
.వె. తొలకరింపవనిని పలకరింపఁగ కవి కలము పట్టు రయితు హలము పట్టు
కలము హలములందు కలవునీవని నమ్మ, కలిగి శుభములీయఁ గలవు కృష్ణ!
4. . నేలను బుట్టి నేలపయి నిత్యము తా కృషి చేయునే క్షుధా
పీడిత మానవాళికయి ప్రీతిని గొల్పెడి భుక్తికోసమై.
శ్రీలను గొల్పు రైతు సహ జీవనమార్గ విధాత, తొల్కరిన్
జూడఁగనే ముదంబొదవ శోభిలు నాగలి చేతఁ బట్టుచున్.
5. తేట గీతి దృతవిలంబిత గర్భ చంపక మాల.
ముదమగు తొల్కరిన్ హలము పూజ్యమహానిధి హాలికాళికిన్
వ్యధలకు దూరమై పొలము హాయిగ బ్రోవుచు పొంగుచుంద్రుగా!
సుధను స్రవించెడున్ దొలుత సుందర తొల్కరి తోడుగానగన్!
సుధ వర తర్పణన్ పృథివి శోభిలు రైతుల స్వేదమేనుగా!

స్వస్తి.
జైహింద్.