గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఆగస్టు 2010, సోమవారం

శ్రీరామ చంద్రా! నీ గాన మాధుర్యానికి ముగ్ధులైన అభిమానుల అభినందనలందుకో! జైశ్రీరామ చంద్రా!

4 comments

ఆంధ్ర దివ్య జ్యోతిస్వరూపాన్ని తన గాత్రంద్వారా యావద్భారాతీయులూ మహదానందంతో తిలకించేలా భారతాంబ పులకరించేలా చిఱునగవులొలుకు ముఖారవిందంనుండి తేనె వాగులా పాటలను జాలువారించిన ఆంధ్ర మాత గర్వ కారకుఁడైన శ్రీరామ చంద్రను తమ కడుపు పంటగా బడసిన తల్లిదండ్రులకు ఆంధ్రామృతం అభినందనలు తెలియఁ జేస్తోంది.
నిరంతర విజయ పరంపరలతో  తనకు; తనను కడుపార గన్న తల్లిదండ్రులకు; ఆంధ్ర మాతకు; స్వర్ణ భారతాంబకు దినదిన ప్రపంచ ప్రఖ్యాతిని కలిగిస్తూ; పురోగమించాలని మనసారా కోరుకొంటూ; ఆపరమాత్మ పరిపూర్ణ ఆయురారోగ్య ఆనంద సద్గుణ సౌభాగ్యా లివ్వాలని మనసారా ప్రార్థిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్. 

15, ఆగస్టు 2010, ఆదివారం

యావద్భారతీయులకూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

3 comments

Bharat Mata

వందే భారత మాతరమ్; సు గుణ దామ్! వందే జగన్మాతమ్!
Prayer of Bharat Mata
Bharat Mata Prayer
Meaning :
I pay my obeisance to mother Bharat, whose feet are being washed by the ocean, who wears the mighty Himalaya as her crown, and who is exuberantly adorned with the gems of traditions set by Brahmarsis and Rajarsis.
కం:-
సాగర ధౌత పదమ్ములు.
బాగగు హిమవత్ కిరీట భాసిత శిరమున్,
యోగులు బ్రహ్మర్షులతో
బాగరియగు భరత మాత! వందనమమ్మా!
సోదర భారతీయులారా! ఆంధ్రామృత పాఠకులారా!దివ్య భారతి బిడ్డ లందరికీ అభినందనలు.
తేదీ. 15 - 8 - 2010. హిందూదేశ స్వాతంత్ర్య దినోత్సవము సందర్భంగా యావద్భారతీయులకూ; భారతమాత శ్రేయోభిలాషులకూ; యావదాంధ్ర ప్రజానీకమునకు; ఆంధ్రామృత పాఠకులకూ శుభాకాంక్షలు. 
జైహింద్.

13, ఆగస్టు 2010, శుక్రవారం

ఇదిగో లంచం. తీసుకొని ఆ కిటుకేంటో చెప్పవే నెమలీ!

9 comments

కంద - గీత - గర్భ ఉll
ఓ నెమలీ! సఖీ! ఎటుల నోచి; మదీయుని; కృష్ణుఁ  జేరి; శ్రీ
జ్ఞాన మతిన్ సదా చతుర! కామ్య ఫలంబును చక్క నందితో?
నీ నమనంబునన్ శిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు. పో
నీనునినున్. కృపన్ తెలిపి నేర్పును గొల్పుము దివ్యుఁ జేరగా!
కll
నెమలీ! సఖీ! ఎటుల నో
చి; మదీయుని; కృష్ణుఁ  జేరి; శ్రీ జ్ఞాన మతిన్.
నమనంబునన్ శిరము నే
ర్పుమెయిన్ దగఁ జేరినావు. పోనీనునినున్.
తే.గీll
ఎటుల నోచి; మదీయుని; కృష్ణుఁ  జేరి; 
చతుర! కామ్య ఫలంబును చక్క నంది
శిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు.
తెలిపి నేర్పును గొల్పుము దివ్యుఁ జేర!
కంద - గీత - గర్భ ఉll
లంచము నిచ్చెదన్. కలుగు లాభము నిచ్చెద. గాంచుమమ్మ! బా
లంచు మదిన్; ననున్ వెలుగు లందును నీ కృప వెల్లు వైనచో
లంచము నిచ్చు నా హరియు లాస్యము  సేయును. హాయిఁ గొల్పు చా
లంచననౌన్ గదా! శిఖిరొ! డంబము చాలును.చెప్పు మమ్మరో!
కll
చము నిచ్చెదన్; కలుగు లా
భము నిచ్చెద; గాంచుమమ్మ! బాలంచు మదిన్.
చము నిచ్చు నా హరియు లా
స్యము సేయుచు; హాయిఁ గొల్పు; చాలంచన నౌన్.
తే.గీll
కలుగు లాభము నిచ్చెద గాంచుమమ్మ!
వెలుగు లందును నీ కృప వెల్లువైన.
హరియు లాస్యము సేయును; హాయిఁ గొల్పు.
శిఖిరొ! డంబము చాలును. చెప్పవమ్మ!
జైశ్రీరాం.
జైహింద్.

10, ఆగస్టు 2010, మంగళవారం

మనం గ్రహించ గలిగినా గ్రహించ లేకపోయినా ఇది మాత్రం నిజం.

1 comments

శ్లోll
పుణ్యస్య ఫల మిచ్ఛంతి , పుణ్యం నేచ్ఛంతి మానవా:
న పాపఫల మిచ్ఛంతి , పాపం కుర్వంతి యత్నత:
తే.గీ.ll
పుణ్య కార్యము లొనరింపఁ బోరు  కాని
పుణ్య ఫలము కోరుదు రయ్య! పుడమిఁ జనులు.
పాప కార్యము లొనరింత్రు. పాప ఫలము
వల దటంచును తలతురు. భావ్య మౌనె?
భావము:-
మానవులు  పుణ్యం చేయడానికి ఎంత మాత్రం ప్రయత్నం చేయరు. కాని పుణ్యం వలన వచ్చే ఫలితం మాత్రం తమకి దక్కాలని తెగ ఆరాట పడి పోతూ ఉంటారు. 
నిత్యం అనేక పాపాలు చేస్తూనే ఉంటారు కానీ, ఆ పాప ఫలితం మాత్రం తమకు రాకూడదని కోరుకుంటూ ఉంటారు ! 
మన అనుభవానికి వచ్చే మంచి చెడ్డలు మనం చేసుకొన్న పుణ్య పాప ఫలములే కాని వేరు కానేరవు అని మనం గ్రహించి ఇప్పటి నుంచైనా మనకేది కావాలని కోరుకొంటామో అది లభించే విధంగా ఆచరించ వలెను.
జైహింద్.

9, ఆగస్టు 2010, సోమవారం

శార్దూలాన్నే చక్రబంధం చేసిన మహాకవి ఎవరో తెలుసా?

1 comments


(చక్రంపై క్లిక్ చెయ్యండి)
పాఠక మహాశయులారా!
కవి కంఠీరవముగా చెప్ప దగిన అవధాని శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు కవి 
ఏకంగా శార్దూలాన్నే చక్ర బంధం చేసి మనముందుంచారు. 
ఆహా! ఎంతటి అద్భుతం!!!
ప్రయత్నం చేస్తే చేయలేని పనంటూ ఉండదని మనకు ప్రబోధించడానికే తానీ విధంగా ఉదాహరణ ప్రాయంగా వ్రాసి చూపారని మనం గ్రహించఁ గలిగితే; ప్రయత్నం చేసినట్లైతే మనమూ సాధించ గలమనే నేను విశ్వసిస్తున్నాను.
ఆ చక్ర బంధమైన శార్దూల అసలు స్వరూపాన్ని చూద్దామా?
శాll
విప్రస్తుత్య గుణప్రసస్త! వరదా! విశ్వాధిపా! శ్రీధరా!
సుప్రీతా! జనకాత్మజాధవ! మహాశోభాకరా! రామ! వే
దప్రామాణ్య విలాస! రాఘవ! అయోధ్యాధీశ! ధాత్రీశ్వరా!
రా ప్రాజ్ఞా! విమలా! సుఖప్రద! సురారాధ్యా! సువేషా! వరా!
ఓహో!  ఇక్కడ వివరంగా చదివితే శార్దూలంలో ఇంతటి భక్తి భావం నిబిడీకృతమై ఉందని మనకర్థమౌతోంది కదండీ!
ఇంత చక్కగా రచించిన ఆ మహా కవికి మన అభినందనలు తెలుపుతూ; 
మనం కూడా ఇక మరొక శార్దూలాన్ని చక్ర బంధం చేసే ప్రయత్నం చేద్దామా? 
ఔత్సాహికులైన కవిపుంగవులందరికీ వాంఛితార్థము తప్పక ఆ శారదాంబ నెరవేరుస్తుందని నా విశ్వాసం.
జై శ్రీరామ్.
జైహింద్.

7, ఆగస్టు 2010, శనివారం

సుజనులిల-శోభిలుదురు-"నక్షత్ర బంధ కందము".

1 comments



( నక్షత్రంపై క్లిక్ చెయ్యండి)
కll
సుకవి కభినుతులు; పలు కా
నుక లందుదు రేవురురు ఘనులరయుటన్ శో
భ కభిముఖులుఁ; జక్కం జను
లు కనుదురు; సులలిత! వనరులు సుశోభ నిడున్!
భావము:-
సులలిత హృదయుఁడ వైన ఓ పాఠకుఁడా! మంచి కవికి నా అభినుతులు. వారు అనేక బహుమతులతో గౌరవింపఁ బడుదురు. పంచ భూతములూ ఆట్టి కవి నరసి యున్న కారణముగా కళ కాంతులకభిముఖులై యుండి వర్ధిల్లుదురు. ఆట్టి ఆ మహా కవిని చక్కగా జనులు ప్రేమతో సత్కవితాభిలాషతో చూచెదరు. అట్టికవికి  వనరులు అమరి శొభలను కలుగఁ జేయును.  సుకవి కారణంగా సుజనులిల శోభిలుదురు.
ఈ నక్షత్ర బంధము నందు 
కోణములందు వరుసగా గల అక్షరములు "సు-జ-ను-లి-ల" = భూమిపై మంచివారు
కేంద్రములందు వరుసగా గల అక్షరములు "శో-భి-లు-దు-రు" = ప్రకాశింతురు.
మంచివారు భూమిపై ప్రకాశింతురు అని తత్పర్యము.
జైహింద్.

5, ఆగస్టు 2010, గురువారం

మేలిమి బంగారం మన సంస్కృతి 53; 66; 70; 77; 95; 100.భాగములందు చేర్చినవి

0 comments

సాహితీ ప్రియులారా!

మేలిమి బంగారం మన సంస్కృతి 53; 66; 70; 77; 95; 100.భాగములందు గల శ్లోకాదులు పునరుక్తమైనందున ఆ స్థానములలో నుంచిన నూతన శ్లోకాదులు ఈ క్రింద వివరింపఁ బడెను.
శ్లోll
ఈశ్వరే నిశ్చలా బుద్ధిః దేశార్థం జీవన స్థితిః.
పృథివ్యాం బంధువద్వృత్తిః ఇతి కర్తవ్యతా సతమ్.53 ( నేపాల చరిత్రమ్ )
తే.గీ.ll
దట్టమైనట్టి నిశ్చల దైవ భక్తి;
దేశ హితమయ జీవన దీక్ష కలిగి;
లోకులందరు తనవారుగా కనుటయు;
సజ్జనాళికి కర్తవ్య మిజ్జగమున.  
భావము:-
అచంచలమైన ఈశ్వర విశ్వాసము కలిగి యుండుట; తన జీవితమును దేశ హితార్థమైయే గడుపుచుండుట; లోకమందరి యెడలను బంధు సమాన దృష్టి కలిగి యుండుట; ఇవన్నీ సత్పురుషులైనవారికి కర్తవ్యములు.
శ్లోll
అద్రోహః సర్వ భూతేషు కర్మణా మనసా గిరా.
అనుగ్రహశ్చ దానంచ సతాం ధర్మః సనాతనః.66
(మహా భారతము - వన పర్వము - ౨౯౭ - ౩౫.)
తే.గీll
త్రికరణముల చేతను ప్రాణులకు నపకృతి
చేయకుండుట; ప్రేమతో చేర్చుకొనుట;
తనకు కలిగిన దానిని దాన మిడుట;
మన సనాతన ధర్మంబు. మఱవఁ దగదు.
భవము:-
మనోవాక్కాయములచే యే ప్రాణి పట్లను ద్రోహమును చేయ కుండుటయే కాక; అందరి యెడలను ప్రేమాదరములను కలిగి యుండుట; తనకు కలిగిన దానిని యెల్లరకు దానమిచ్చుచుండుట; అనునవి సనాతనమైన ధర్మములు.
శ్లోll
అకృత్వా పర సంతాపం అగత్వా ఖల మందిరం
అక్లేశయత్యచాత్మానం యదల్ప మపి తద్బహుః.70
తే.గీll
పరుల సంతాప హేతువై ప్రబల రాదు.
చెడుగు సహవాసమెన్నడు చేయరాదు.
సుకృత లేశంబులవియెయౌన్ చూచుచుండ
ఘనతరంబుగ మనకిది కనగ నగును.
భావము:-
ఇతరులకు సంతపము కలిగించకయు; ఖలులతో సహవాసము చేయకయు; గావించిన కొలది సుకృతములు కూడా మహత్తరమైనవగుచున్నవి.
శ్లోll
అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః
తే హరేః ద్వేషిణః పాప్మాః ధర్మార్థం జన్మ యద్ధరేః.77.
తే.గీ.ll
చేయ వలసెడి కర్మంబు చేయఁ బోక.
కృష్ణ కృష్ణంచు జపియించుకృష్ణ భక్తుఁ
డరయ దేవుని శత్రువు. పరమ పాపి.
ధర్మ సంస్థాపనకె జన్మ దాల్చె హరియె.  
భావము:-
స్వధర్మ కర్మలను విడిచిపెట్టి కేవలము కృష్ణ కృష్ణ యనుచు కూర్చొనువారు శ్రీహరిని ద్వేషించు వారు. పాపులు అగుదురు. ఎందుచేతనంటే ఆ హరి యవతారములెత్తినది ధర్మ రక్షణమునకే గాని ఊరకనే కాదు కదా! 
స్వధర్మానికి దూరముగా ఉంటూ భగవన్నామ జపము చేయుచూ కాలము వ్యర్థపుచ్చుట యుక్తము కాదని గ్రహించ వలెను. స్వధర్మాచరణము చేయుచూ భగవాన్నామ స్మరణ చేయుచూ కర్మఫలమా పరమాత్మకే అర్పింప దగును.
శ్లోll
నిత్యాన్నదాతా నిరతాగ్నిహోత్రీ వేదాంతవిణ్మాస సహస్ర జీవీ
పరోపకారీచ పతివ్రతాచ షట్ జీవ లోకే మమ వందనీయా:.95.
ఆ.వెll
అన్నదాతయు; ప్రథిత నిత్యాగ్ని హోత్రి;
వేదసంపన్నుఁడును; వయో వృద్ధ నరుఁడు;
పరుల కుపకారి; నుత పతి వ్రతయు నాకు
వందనీయులు. భువి పైన భాగ్యనిధులు.
భావము:-
పేదవారికి నిత్యము అన్నదానము చేయువాఁడును; నిత్యాగ్నిహోత్రియు; వేదాంత వేత్తయు; సహస్ర చంద్ర దర్శనము చేసినవయో వృద్ధుఁడు; పరోపకార పరాయణుఁడు; మహా పతివ్రత; ఈ ఆరుగురూ నాకు వందనీయులు.
శ్లోll
బ్రహ్మ నిష్ఠో గృహస్థః స్యాత్; బ్రహ్మ జ్ఞాన పరాయణః
యద్యత్ కర్మ ప్రకుర్వంతి తద్బ్రహ్మణి సమర్పయేత్.100.
తే.గీll
బ్రహ్మ నిష్ఠయు; జ్ఞానము; భక్తియు; మది
కలిగి యుండి; గృహస్థుఁడు కర్మములను
చేయ వలయును. అతఁడవి చేయు చుండి;
ఫలము కృష్ణార్పణము చేయ వలయు సతము. 
భావము:-
గృహస్థు బ్రహ్మ జ్ఞాన పరాయణుఁడై; బ్రహ్మ నిష్ఠుఁడై; ఈశ్వరార్పన బుద్ధితోనే సర్వ కర్మలను చేస్తూ ఉండ వలెను.
జైహింద్

1, ఆగస్టు 2010, ఆదివారం

శ్రీ వల్లభవఝల వారి శ్రీ చక్ర బంధ గీతములు

3 comments

జై శ్రీరామ్.
ఆర్యులారా!

శ్రీమాన్ వల్లభవఝల నరసింహ మూర్తి ప్రముఖ జ్యోతిశ్శాస్త్రజ్ఞూలే కాదు. ప్రముఖ రచయిత అని కూడా వారి రచనలు రుజువు చేస్తున్నాయి.వారు రచించిన శ్రీచక్ర శోభిత గీతమే ఇందుకు తార్కాణము. పైన ఉన్న శ్రీ కేంద్రముగా కల చక్రమున ఉపరితలమున వృత్తమున గల చిన్న చరుతములలోని అక్షరములను ఒకచో చేర్చినచో ఒక అర్థవంతమైన పదము ప్రత్యక్షమగుచున్నది. దీనినే అర్థ గోపన పద బంధము అని చెప్పుకొన వచ్చును.   వీరు వ్రాసిన పదమునగల అర్థ గోపనము చూడుడు. మనము నిలచుమ! = నా మనసులో నిలచి యుండుము! పరమాత్మ తన మనసులో శాస్వితముగా నిలిచి ఉండిపోవాలనే జిజ్ఞాసతో వ్రాసిన పద్యము.ఎంత చక్కటి భావన. ఇప్పుడా పద్యం చూద్దాము.
రెండవ పద్యము కూడా ఇటులనే గ్రహింపనగును.
చూచితిరికదా!
ధన్యవాదములు.
జైహింద్.

ఆబాల గోపాలానికీ మైత్రీ దినము సందర్భంగా శుభాకాంక్షలు.

4 comments

నిత్య నూతన చైతన్య ప్రవర్ధమాన సోదర భారతీయులారా! 
మీ అందరికీ మైత్రీ దివస శుభాకాంక్షలు.
మనం పరస్పరం మైత్రీ భావ విరాజమాన హృదయులమై నిత్య నూతన చైతన్యంతో భారత మాత సత్కీర్తిజ్యోతి దిగాంతాల వరకూ వ్యాపింప జేసే విధంగా కలిసికట్టుగా పురోమార్గంలో పయనిమ్చాలని; పురోగతి సాధించాలనీ మనసారా కోరుకొంటున్నాను.
ఆ పరమాత్మ అనంత స్నేహ భావాన్నిప్రసాదించి;  మనం పరస్పరం సహకరించుకొంటూ మనమంతాఒక్కటే అని మన జాతీయ పతాకం క్రింద భారతాంబకు జేజేలు నిత్యం పలుకుతూ వర్ధిల్ల జేయాలని కోరుకొంటున్నాను.
జైహింద్.