గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, ఆగస్టు 2026, శుక్రవారం

శ్రీ కంచి పరమాచార్య స్వామివారి మూకసారములో23 వ శ్లోకమయిన మందస్మిత శతకములోని 23వ శ్లోక భాష్యము. ... శ్రీ తాడేపల్లి పతంజలి.

శ్రీ కంచి పరమాచార్య స్వామివారి మూకసారములో23 వ శ్లోకమయిన మందస్మిత శతకములోని 31వ శ్లోక భాష్యము.   ...   

శ్రీ తాడేపల్లి పతంజలి.  07 -08 -2026.

శ్లోII   చేతః శీతలయంతు నః పశుపతేరానందజీవాతవో

నమ్రాణాం నయనాధ్వసీమసు శరచ్చంద్రాతపోపక్రమాః |

సంసారాఖ్యసరోరుహాకరఖలీకారే తుషారోత్కరాః

కామాక్షి స్మరకీర్తిబీజనికరాస్త్వన్మందహాసాంకురాః ||

ప్రతిపదార్థం

కామాక్షి = ఓ కామాక్షీ దేవీ!

పశుపతేః = పరమశివునికి

ఆనంద జీవాతవః = ఆనందాన్ని తిరిగి ప్రాణవంతం చేసే దివ్యౌషధాలు,

నమ్రాణామ్ = నమస్కరించే భక్తుల యొక్క

నయనాధ్వసీమసు = కంటి చూపుల పరిధిలో (కంటి మార్గాల్లో)

శరచ్చంద్రాతపోపక్రమాః = శరత్కాలపు వెన్నెల వలె ఆహ్లాదాన్ని కలిగించేవి,

సంసారాఖ్య సరోరుహాకర ఖలీకారే = సంసారము అనే తామర చెరువును పాడుచేయడంలో (నాశనం చేయడంలో)

తుషారోత్కరాః = మంచు బిందువుల సమూహం వంటివి,

స్మర కీర్తి బీజనికరాః = మన్మథుని కీర్తి అనే పైరుకు (విజయానికి) తెల్లని విత్తనాల సమూహం వంటివి అయిన

త్వత్ మందహాసాంకురాః = నీ చిఱునవ్వు మొలకలు

నః = మా యొక్క

చేతః = మనస్సును

శీతలయంతు = చల్లబరచుగాక (శాంతింపజేయుగాక).

తాత్పర్యం

ఓ కామాక్షీ దేవీ! పరమశివునికి ఆనందాన్నిచ్చే సంజీవని వంటివి, నమస్కరించిన భక్తుల నేత్రాలకు శరత్కాలపు వెన్నెలలాగా అత్యంత ఆహ్లాదాన్ని పంచేవి, ‘సంసారం’ అనే తామరల చెరువును తుడిచిపెట్టే తుషార బిందువులు (మంచు సమూహం) వంటివి, మన్మథుని యశస్సును పెంచే విత్తనాల వంటివి అయిన నీ చిరునవ్వు మొలకలు (కాంతిరేఖలు) మా మనస్సులకు పరమ శాంతిని, చల్లదనాన్ని ప్రసాదించుగాక!

విశేష వివరణలు

1. రూపకాలంకారము:

అమ్మవారి మందహాసాన్ని కేవలం ఒక నవ్వుగా కాకుండా, శివునికి ఆనందాన్నిచ్చే 'దివ్యౌషధం'గా, భక్తుల కళ్లకు 'శరత్కాలపు వెన్నెల'గా, సంసార తామరలను తుడిచిపెట్టే 'మంచు'గా, మన్మథుని కీర్తిని పెంచే 'విత్తనాలు'గా అభేదంగా నిరూపించి వర్ణించడం వల్ల ఇందులో రూపకాలంకారము సుస్పష్టంగా ఉంది.

2. కవి సమయము (కీర్తి వర్ణన):

సంస్కృత కావ్య సంప్రదాయంలో (కవి సమయంలో) 'కీర్తి' లేదా యశస్సును ఎప్పుడూ తెల్లని రంగుతో పోలుస్తారు. ఇక్కడ అమ్మవారి నవ్వు కూడా తెల్లనిది కావడం చేత, ఆ తెల్లని చిరునవ్వులను మన్మథుని కీర్తికి కారణమైన "తెల్లని విత్తనాలు" (బీజములు) గా కవి వర్ణించారు.

3. సమాసోక్తి మరియు పరిణామాలంకారాలు (కృషక వ్యవహార స్ఫురణ):

ఈ శ్లోకంలో ఒక రైతు వ్యవహారం (వ్యవసాయ ప్రక్రియ) రూపకంగా స్ఫురిస్తుంది:

ఖలీకారే = పొలాన్ని దుక్కి దున్ని సిద్ధం చేయడం (కళ్ళం చేయడం).

తుషారోత్కరాః = నీరు చల్లడం.

బీజనికరాః = విత్తనాలు విత్తడం.

అంకురాః = మొలకలు రావడం.

ఈ విధంగా ఒక వ్యవసాయ క్రమం అమ్మవారి మందహాస వర్ణనలో అంతర్లీనంగా స్ఫురించడం వల్ల సమాసోక్త్యలంకారము ఏర్పడింది. అలాగే, ఈ అంకురాలు భక్తుల మనస్సును చల్లబరచడానికి అమ్మవారి 'మందహాసాలు'గా పరిణమించవలసి రావడం వల్ల పరిణామాలంకారము కూడా ఇందులో ఇమిడి ఉంది.

స్వస్తి.

పతంజలి తాడేపల్లి.

ఇంతటి చక్కని భాష్యమునందించిన మహోదయులు శ్రీ తాడేపల్లి పతంజలిగారికి ధన్యవాదములు.

ఈ శ్లోకమునకు నా అనువాద పద్యము.

తే.గీ.II  అభవు నానందమున్ బెంచు నౌషధంబు,

భక్తులకు శరచ్చంద్రిక, భవ సరోరు

హములఁ గలగించు మంచు, కీర్తిమొలక రతి 

పతికి, నీ నవ్వు, జనని! నన్ సతము కాచు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.