గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జులై 2025, మంగళవారం

బాలభావన శతకము ... ఒక్కరోజులో వ్రాసినది. రచన ... చింతా రామకృష్ణారావు.

 బాల భావన.

(  నీతి శతకము )

రచన: చింతా రామ కృష్ణా రావు

1) శ్రీశు మదిని నిలిపి ‘ప్రేమగా మము చూచి  -  కావుమా’ యని  మది కరఁగ వేడి,

   పెద్దలైన మిమ్ము ప్రీతితో కొలుతుము   -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. శ్రీమత్ జ్ఞాన సుసంపన్నులైన ఓ పెద్దలారా! శ్రీమన్నారాయణుని మా మదిలో నిలిపి ప్రేమగా మమ్ములను చూచి కాపాడుమా యని అతని మనసు కరిగే విధముగా ప్రార్థించి, పెద్దలైన మిమ్ములను ప్రేమతో కొలుచుదుము.


2) ప్రథమ పూజ్యుఁడైన వరసిద్ధి గణపయ్య  -  కాచుచుండు మమ్ము కరుణ చూపి.

    వందనములు చేయ వర్ధిల్ల దీవించు  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! అందరి చేతను మొదటగా పూజింపఁబడే వరములనొసఁగే గణపతి దేవుఁడు కరుణ చూపుతూ మమ్ములను కాపాడును. మేము నమస్కరించినచో మమ్ములను వర్ధిల్లమని దీవించును.


3) మదిని నిలుప లేక మన్నింప వేడుచు  -  తెలుపుచుంటిమయ్య తెలియుఁడయ్య

    మనసు కలత పెట్టు మా బాధలన్నియు  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మా మనసులను కలత పెట్టుచున్న మాకు బాధగా అనిపించుచున్న విషయములను మనసులో దాచుకొన లేక మీకు తెలియ జెప్పు చున్నాము. అవి మీరు తెలుసుకొన కోరుచున్నాము.


4) ముద్దు చేసి మాకు హద్దులు నేర్పరు.  -  హద్దు మీర మమ్ము గ్రుద్దుదురయ.

    హద్దు లెల్ల నేర్ప శ్రద్ధగా నేర్వమా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మమ్ము గారము చేసి, ఏది చేయ వచ్చునో ఏది చెయ్య కూడదో అనే వాటికి సంబంధించిన హద్దులు చెప్పరు. తెలియక పోవుటవలన మేము హద్దులు దాటినచో మమ్ములను దండింతురు. మీరు మాకు ఆ విషయములను వివరించి చెప్పినచో మేము శ్రద్ధగా నేర్చుకొందుముకదా!


5) నేర్వవలసినపుడు నేర్పక మమ్ముల  -  నేర్పు లేదటంచు నింద చేసి

    పదుగురు విన మమ్ము వదరుచుందు రదేల?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ఏది ఎప్పుడు నేర్పాలో అప్పుడు నేర్పక ఆ తరువాత మేము ఆ విషయములను నేర్చుకోలేదంటూ పదిమందిలోనూ అవమానపరుస్తూ మాటాదురుకదా! అది సరియగు పనియేనా?


6) అక్షరాలునేర్పి యవధులు కనఁ జేయ   -  శ్రద్ధతోడ మేము చదివి, కనమె?

    బొమ్మ చూపి చదువు రమ్మన్న వచ్చునా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాకు మీరు సక్రమముగా వర్ణమాల నేర్పి, మంచి చెడ్డలను చూపినచో మేము శ్రద్ధతో చదువుకొని, మీరు చెప్పినవి గ్రహింపలేమా? బొమ్మలు చూపించుతూ చదువు చెప్పుచున్నచో మాకు ఏవిధంగా చదువు అబ్బుతుంది?


7) పలక చేతికిచ్చి పద్యాలు వ్రాయించి  -  పలుకునటులఁ జేయ పలుకఁ గలము.

   పద్యమొక్కటైన పలుక నేర్పరదేల?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మా చేతికి రాతి పలక వ్రాసుకొనుటకు ఇచ్చి, మా చేత పద్యాలు మీరు వ్రాయించి చదువునట్లు చేసినచో మేము ఆ పద్యములు చెప్పఁగలము కదా. మీరు చక్కని తెలుఁగుపద్య మొక్కటైనా మాకు నేర్పరెందులకు?


8) తోటివారితోడ సాటిగా మముఁ జేయ  -  నబ్బనట్టి విద్య నరయఁ జేసి,

    ఫలము దక్కకున్న పనికిరామనుదురా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీ తోటివారి పిల్లలను చూచి వారితో మమ్ములను పోల్చుకొంటూ మమ్మల్ని కూడా వారిలాగా చేయడం కోసం మా కు అబ్బనట్టి విద్యను బలవంతముగా నేర్పు చున్నారు. అది మాకు అబ్బక, మీరు కోరుకొన్న ఫలితము దక్కకపోవుసరికి మమ్ములను పనికి రారు అని పలికి కించపరచుదురా? ఇది న్యాయమేనా?


9) మాకు నచ్చు విద్య మమ్మెంచుకోనీక  -  మీకు నచ్చుదాని మాకు పులుమ

    మాకు రాకపోవు. మాదోషమాయది?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!మాకు నచ్చిన చదువును మమ్ములనెంచుకోనీకుండా మీకు నచ్చిన విద్యను మాచే బలవంతముగా నేర్పింతురు., ఆ విద్య మాకు రాక పోతే అది మా తప్పా?


10) చదువుకొనెడి వేళ చదువుకోనీయక  -  పనులు చెప్పి మమ్ము పంపు మీరు

    చదువు వెనుకఁబడిన, చవటగా చూతురా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చదువుకొనవలసిన సమయంలో చదువుకోనీకుండా ఏవో పనులు మాకు చెప్పి మా చదువుకు ఆటంకము కలిగిస్తారు. ఆ కారణముగా మేము చదువులో వెనుకబడుసరికి మేము పనికిరాని చవటలమన్నట్లుగా మీరు చూస్తారు. ఇదేమైనా బాగుందా?


11) దూర దర్శనమును మీరు చూచుచు మమ్ము - మెదలకుండ చదువు చదువుమనిన

   మనసు నిలుచునెటుల? మాకది సాధ్యమా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు దూరదర్శన యంత్రము ద్వారా కార్యక్రమములను చూస్తూ, మమ్మల్ని కదలకుండా మెదలకుండా చదవమంటారు. మీరు చూస్తున్న కార్యక్రమాలు అక్కడే ఉంటున్న మేము చూడకుండా, ఆశబ్దము వినకుండా మమ్ములను మేము ఎలా నిరోధించుకొనగలము? ఈ విషయమును మీరెందుకు ఆలోచించరు?


12) దూర దర్శనమున దుర్భర ఘన శబ్ద  -  కలుషమునకు మనసు కలత చెందు.

    శబ్దమెక్కువున్న చదువుట సాధ్యమా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు దూరదర్శనములో చూచే కార్యక్రమాలు స్వరమునధికము చేసి వినుచున్న కారణముగా దుర్భరమైన ఆధ్వని కాలుష్యమునకు మా మనసు కలత చెందుతుంది కదా? అంత శబ్దములో చదువుట మాకు సాధ్యమగునా?


13) శ్రవణ పుటములందు చప్పుళ్ళు పడుచుండ  -  చదువుచున్నఁగాని మదికి పోదు.

    చదువుచున్న మాకు సహకరింపరదేల?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చదువుకొనే సమయంలో మీరు అవసరమున్నవాటిని గూర్చి, అవసరము లేనివాటిని గూర్చి మాటాడుకొంటూ ఏవేవో చప్పుళ్ళు చేస్తుంటారు. మా ఏకాగ్రతకు భంగం వాటిల్లుతోంది కదా? మాకు మీరు చదువుకొనేటందుకు ఎందుకు సహకరించడం లేదు?


14) తిట్టుచుంద్రు మమ్ము కొట్టుచు నుందురు    -  పెంచి పెద్ద చేయు పెద్ద మీరు

     మమ్ము మీరు తిట్ట మాటాడ లేముగా!    -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మమ్మల్ని అవసరంగాను, ఒక్కొక్కప్పుడు అనవసరంగాను కొట్టుతూ తిట్టుతూ ఉంటారు. మమ్మల్ని పోషించి, పెంచే పెద్దవారు మీరు తిట్టితే మిమ్మల్ని మేము ఏమి అనఁగలము చెప్పండి?


15) శ్రద్ధఁ గొలిపి భవిత నర్థవంతము చేయు  -  భవ్యమూర్తి తండ్రి బ్రహ్మ మాకు.

    నవత మరిగి మమ్ము నడిపించ మరచిరే !  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాలో శ్రద్ధ కలిగించి, మా జీవితాలను అర్థవంతంగా తీర్చిదిద్దే తండ్రి మాకు బ్రహ్మయే. అట్టి తండ్రి ఈ నాడు ఆధునిక జీవన సరళిలో మమ్ములను పట్టించుకోవడం లేదుకదా! ఇది ధర్మమేనా?


16) నవత భ్రాంతిలోన నడయాడుచును మీరు  -  పిల్లల విడుటేల? ప్రేమ లేదొ?

    భవిత మాది. మదిని పట్టించుకొనరేల?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! నవ జీవన భ్రాంతిలో మీరు జీవిస్తూ, పిల్లలను అశ్రద్ధతో అక్కడా ఇక్కడా ఇతరులకు అప్పిచెప్పి విడిచి పెట్టుట యెందులకు? మాపై మీకు ప్రేమ లేదా? మా భవిష్యత్తును గురించి ఆలోచించుతున్నారా? మీరే స్వయముగా పట్టించుకొన వలసి యున్నది. మరి పట్టించుకోరెందుకు?


17) పెద్దవారిఁ గనుచు పిల్లలు నడుతురు  -  మంచి చెడ్డ లనున వెంచకుండ.

    మంచి త్రోవ నడిచి మము నడిపించుడు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పెద్దవాళ్ళను గమనిస్తూ, వారి ప్రవర్తనా సరళినే మేమూ అనుసరిస్తాము. అందలి మంచిచెడ్డలను మేము పరిగణింపఁ జాలముకదా. అందుచేత మీరు మంచి మార్గంలో నడుస్తూ మమ్మల్నీ నడిపించండి.



18) పెద్దలందు మీరు వెలయించు భావన  -  వెలుగు బాట మాకు నిలుచు మదిని.

    మీరు నడచు దారి మేలైనదే కదా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీ పెద్దవారిపై మీరు చూపించే ప్రేమాదులు మీకుండే భావనలు మాకు వెలుఁగు బాట లగును. అవి మా మనస్సులలో నాటుకుపోతాయి. మీరు సంచరిస్తున్న విధానములో దోషము లేదుకదా? ఒకవేళ ఉన్నట్లైతే అది మాకూ అంటుతుందని మరచిపోకండి.


19) తల్లిదండ్రులందు దండిఁగా దొరికెడి   -  ప్రేమ మధువుఁ గ్రోలఁ బ్రీతి మాకు.

     పిల్లల విడనాడు పెద్దలు పెద్దలా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లి దండ్రులలో సమృద్ధముగా లభించెడి అకళంకమైన ప్రేమ అనే అమృతము సేవించుట యనిన మాకెంతయో ప్రీతి.. అట్టి తల్లిదండ్రుల ప్రేమను కోరుకొనే పిల్లల్ని విడిచిపెట్టే పెద్దలు పెద్దలా? ఏనాడూ మీ పిల్లలను మీ ప్రేమకు దూరం చేయకండి.


20) అన్నదమ్ములందు మన్నన నేర్పిన  -  రామలక్ష్మణులనఁ గ్రాలఁగ నగు

     నాస్తికన్నమిన్న యనురాగ బంధము.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్న తనమునుండియు అన్నదమ్ములను ఒకరినొకరు ప్రేమతో పిలుచుకొనుట మీరు నేర్పినచో మేము పెద్దైనా సరే రామ లక్ష్మణులలాగే ఒకరిపై మరొకరు ప్రేమభావంతో సంచరించుటకు దోహదపడును. ఇట్టి అన్నదమ్ముల మధ్య ప్రేమ అనేది చిన్న నాటినుండియు నేర్పనిచో  మాలో ప్రేమలోపించును. అన్నదమ్ముల మధ్య ప్రేమ యనెడి బంధమి  ఆస్తికన్న ఎంతో గొప్పది కదా! మాలో అనురాగ బంధాన్ని పెంచండి.


21) మాట నేర్పు నేర్పి మన్నన నేర్పిన  -  మాటలాడఁ గలము మమత తోడ.

    మాటలాడకున్న మమతలు పెరుగునా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పిల్లలు ఎవరెవరితో ఎలా మన్ననతో మాటలాడ వలెనో పెద్దలు నేర్పుచున్నచో తప్పక నేర్చుకొని మసలు కొనగలము.. ఆ విధముగా నేర్పకపోతే ఎవరెవరితో ఎలా మాటాడాలో నేర్వక మాటాడుటకు అలవాటు పడము. అందువల్ల ఒకరిపై ఒకరికి ఉండ వలసిన మమతానురాగాలు కనిపించకుండా పోతాయికదా! ఆ తప్పు మీరు మాకు శిక్షణ ఇవ్వకఫోవుటవలననే కదా?


22) భయము మప్ప మమ్ము భయపెట్టఁ జూచిన-భయము తోడ మేము నయము తప్పి

     యిల్లు వీడి పోయి యిక్కట్లు కొలుపమా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాకు మీరు భయము నేర్పాలనే ఉద్దేశ్యముతో మమ్మల్ని భయపెట్టఁ జూచినట్లైతే మేము భయపడిపోయి, పోకూడదని తెలిసియూ, ఇల్లువిడిచి పారిపోవుదుము. అందువలన మీకూ మాకూ అనేకమైన ఇక్కట్లు కలుగుచున్నవి కదా? మాకు మీ యెడల ఉండ వలసినది భయము కాదు. ప్రేమ మాత్రమే. అది పెంచే ప్రయత్నం మాత్రమే చెయ్యండి. మమ్మల్ని భయపెట్టేయకండి.


23) చదువు చదువనుచును చదువమందురె కాని-చదువ వలయు దాని నెదను కనరు.

     చదువ వలయుదాని చదివించ చదువమా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మమ్మల్ని మీరు అస్తమానూ చదువుకో  చదువుకో అంటూంటారే కాని, మేము చదువ వలసిన దేమిటో, చదువుతున్నదేమిటో పరిగణించరు కదా! మేము ఏది చదవవలసి ఉందో మీరు తెలుసుకొని, దగ్గర కూర్చొని అది చదివించితే మేము చదవమా? మీరు బద్ధకించకుండా మా చదువు విషయంలో వ్యవహరించ వలసి ఉందని మీరు గుర్తించండి.


24) శ్రద్ధతోడ మేము చదివెడిదేమిటో   -  చూచిరేని మీరు కాచుకొనుచు

     చదువకుండ నుండి చవటలమౌదుమా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మా చదువు విషయమున శ్రద్ధ వహించి, నిరంతరమూ పరిశీలిస్తూ మేము ఏమి చదువుతున్నామో గమనిస్తున్నట్లైతే మేము చదువుతున్నట్ట్లు నటిస్తూ, చవటలుగా మారము కదా?


25) పాఠశాలలోన వ్రాసెడి పని పెంచి  -  చదువ సమయ మీక వ్యధను పెంచ

     చదువు ధ్యాస మాకు చచ్చిపోవును కదా!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాకు బడులలో వ్రాతపనే ఎక్కువగా ఇస్తున్నందువల్ల చదువుకోడానికి తగిన సమయం ఇవ్వటం లేదు. ఈ కారణంగా మాకు చదువుమీద ధ్యాస తగ్గిపోతోందని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు?


26) పుస్తకములు మాకు బస్తాలతో యిచ్చి  -  మూపుపైన పెట్టి మోయమనిన

     మోయు బరువు చేత మొద్దుగా మారమా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చదువు పేరు చెప్పి మేము మోయలేనన్ని పూస్తకాలు కొనిపించి, పెద్ద బస్తాలవంటి సంచీలో ఉంచి మా వీపుపై పెట్టి మోయిస్తున్నారు. ఈ బరువు మోయడం వల్ల మేము మొద్దుబారిపోతున్న విషయమెప్పుడైనా మీరు ఆలోచించారా? పుస్తకాలు ఎక్కువ ఉంటేనే బాగా చదివిస్తున్నామన్న భావన తల్లిదండ్రులలోను ఉపాధ్యాయులలోను తొలగి పోవాలి.


27) మస్తకంబు చెడును మణుఁగుల బరువున్న- పుస్తకములు మోయ. బుడుతలమయ

     వెన్నుపూస విఱుగు. వినిపించుకోరేల?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మణుఁగులకొద్దీ బరువు గల పుస్తకాలను మోస్తుండడం వల్ల మా బుర్ర చెడిపోతోందికదా! మేము చిన్న చిన్న పిల్లలము కదా! మా వెన్నుపూస విరిగిపోదా? మీరీ విషయం ఎందుకు గ్రహించటం లేదు?


28) నడక చేతకాని బుడుతలమగు మాకు  -  కాళ్ళు మోయలేని జోళ్ళవేల?

     పుస్థకమ్ములేల బోధనలవి యేల?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము నడవడమే సరిగా రాని చిన్న పిల్లలము కదా! అలాంటి మా యొక్క పాదాలకు మోయలేనంత బరువుండే పాదరక్షలు ఎందుకు చెప్పండి? పుస్తకాలను చూపిస్తూ కాక బొమ్మల్ని చూపిస్తూ చేస్తున్న బోధ మాకేమి లాభం చేకూరుస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా?


29) గొప్ప దేశ భక్తి కొలిపెడి పాటలు  -  మప్పి, దైవ భక్తి మప్పుడయ్య. 

     దేశ సేవ చేసి దీపించు ఘనులార!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!  దేశ శేవ చేసి ప్రకాశించు మహాత్ములారా! గొప్ప దేశ భక్తిని మాలో కలిగించే పాటలను మాకు నేర్పండి. దైవ భక్తిని మాలో కలిగించండి.


30) ఆట పాటలాడి యమ్మతో నాన్నతో  -  ప్రేమ పంచుకొనిన క్షేమమొప్పు.

     నట్టి ప్రేమ మాకుఁ గిట్టదా? దక్కదా?   -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!  ఆడుతూ పాడుతూ అమ్మా నాన్నలతో ప్రేమగా హాయిగా ఉండడం మాకెంతో ఇష్టం. అది మాకు ఎంతో క్షేమమని మీకు తెలియదా? అటువంటి ప్రేమ మాకు కిట్టదా? ఇక మాకు దక్కదా? ఆ ప్రేమ మాకు అందని ద్రాక్షయేనా?


31) పుస్తకాలు పట్టి కుస్తీలు పట్టుటే  -  నిత్యకృత్యమాయె. నిదుర లేక

    మనసు గాడి తప్పి, మరతుము. కనరేల?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము పుస్తకాలను చేతితో పట్టుకొని వాటితో కుస్తీలు పట్టుతూ చదవడమే మాకు నిత్యకృత్యమైపోయింది. ఈ కారణం గాకు నిద్దురపోవడానికి కూడా సమయం సరిపోవడం లేదు. తీరని నిద్దుర మత్తుతో మనసు గాడి తప్పుతోందిచదివినది గుర్తుండటం లేదు. ఈ విషయం మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు?


32) తెల్ల కాగితాలు పిల్లల మనసులు  -  మమ్ము పట్టి మీరు మప్పుచుండ

     మంచి చెడులు కనుట మాకెట్లు సాధ్యము?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మా మనస్సులు తెల్లకాగితములవలె నిష్కళంకంగా ఉంటాయి. మాకు మీరు మప్పుచున్నవాటిని మేము గ్రహింతుము. వాటిలో ఇది మంచి, ఇది చెడ్డ అని తెలుసుకొనుట మాకు సాధ్యము కాదుకదా? కావున మంచి విషయములే మీరు మాకు నేర్పాలని మేము మీకు గుర్తుచేయనక్కర లేదు కదా?


33) మంచి మాటలాడి మన్నన నుండెడి  -  తల్లిదండ్రులున్న ధన్యమదియె.

     తప్పుచేయకుండ గొప్పగా మెలగుడో  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మంచిగా మాటాడుతూ మన్ననలందుతూ ఉండే తల్లిదండ్రులు కలిగి ఉండుట కంటే ధన్యత మాకేమున్నది? తల్లిదండ్రులు ఎప్పుడూ తప్పుడు పనులకొడికట్టకుండా గొప్పగా ప్రవర్తించవలసి ఉన్నదని గ్రహింతురుగాక.


34) దూరదర్శనమున దూర భాషణమున  -  కాలమెల్ల పుచ్చు కన్న వారు

     పిల్లల మదిఁ బ్రేమ పెరుఁగ నెట్టులొనర్త్రు?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!  దూర దర్శన కార్యక్రమములు చూచుచు దూర శ్రవణము ద్వారా నిరంతరము ఇతరులతో సంభాషించుచు కాలమును గదుపునట్టి తల్లిదండ్రులు ఇక పిల్లల మనసులో ప్రేమ నేవిధముగా పెరుగునట్లు చేయుదురు? వ్యర్థమైన దూర దర్శన కార్య క్రమములు చూచుట వారికి తగదు. అటులనే వ్యర్థమైన సంభాషణలు చేయుచూ కాల యాపన చేయక పిల్లలతో ప్రేమగా అవకాశము కల్పించుకొని ఎక్కువ కాలము గడి పిల్లలలో ప్రేమ కలిగించవలెను.


35) చూడఁ దగిన మంచి చూపుచు, మామది  -  వీడనట్టి నీతి పెంచి, మీరు

     మంచి మార్గమునను మము నడిపించరే?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చూడ తగినటువంటి మంచివాటిని మాకు చూపుచు, మా మనస్సును వీడిపోని నీతిని మాలో పెంచి, మమ్ములను మంచి మార్గమున మీరు నడిపించలేరా?


36) బద్ధకమ్ముతోడ పట్టించు కోకుండ  -  కాలమును గడిపెడి కన్నవారు

     మార్గదర్శకులుగ మాకెట్టులగుదురు?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కాలము వాలా విలువైనది. అట్టి కాలము గడిచి పోవుచున్నదని గ్రహించుకోకుండా బద్ధకముగా గడిపే తల్లిదండ్రులు ఉన్నట్లైతే వారు మాకు మార్గదర్శకులెలా అగుదురు?  (Time sence) కాల వివేచన కలిగి ఉండి బద్ధకం లేకుండా ఉత్సాహంగా ఉంటూ కాలంతోపాటు నడుస్తూ మమ్మల్ని నడిపించే తల్లిదండ్రులే మాకు ఆదర్శము. 


37) తమ సుఖంబు కాంచు తమ బిడ్డ సుఖములో  -  తల్లిదండ్రులిలను ధర్మమనుచు.

     కన్న వార లనిన కరుణకు ప్రతి రూపు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డల సుఖములోనే తమ సుఖమును కూడా చూచుకొందురు. ఇదియే ధర్మమని వారు తలంతురు. భూమిపై అట్టి తల్లిదండ్రులు కరుణకు ప్రతి రూపులే.


38) పిల్లల కను గప్పి బిడియము విడనాడి  -  చేయరాని పనులు చేయుచున్న 

     పెద్దలన్న ప్రేమ పెరుగునెట్టులు మాకు?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కొందరు పెద్దలు చిన్న పిల్లల కంట పడకుండా, సిగ్గు విడిచి, చేయ రాని పనులు చేయుచుందురు. అట్టి పెద్దలపై మాకు ప్రేమ ఏవిధముగా పెరుగును?


39) చదువరాని చెత్త చదువగా చదువగా  -  మనసు ఖిలము చెంది మైల పడును.

     మైల పడిన మదిని మముఁ జూడ మనసౌనె?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కొందరు పెద్దలు చదువరాని వాటిని చదువు చుందురు. అట్లు చదువుట వలన మనసు చెడి మలినమునొందును. అట్టి మలినమైన మనసుతో మమ్ము చూచుటకు వారికి ఏ విధముగా మనసు కలుగును? సిగ్గనిపించదా?


40) చూడరానివెల్ల చూడగా చూడగా  -  కనులలోన నిలుచు కానఁ బడుచు

     చూపఁ దగినవెల్ల చూడుఁడు. చూపుఁడు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చూడ రాన్ వాటినే మనము చూడగా చూడగా ఆ దృశ్యములు మన కన్నులను వీడిపోక అలా కనులు మూసినా తెరచినా కనపడుతూనే ఉంటాయి. కాబట్టి చూడ తగిన వాటినే మీరు చూడండి అట్టివే మాకునూ తప్పక చూపించండి.


41) ఆడరాని మాట లాడెడి మీ నుండి  -  పాడు మాటలెల్ల పట్టు మమ్ము.

     మంచి మాట లాడి మంచిగా పెంచుడీ!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాటలాడ కూడనివి మీరు మాటలాడు చున్నచో  ఆ పాడుమాటలన్నియు మా మనసుకు పట్టివేయును. మేమునూ అటులే పాడుమాటలాడుటకు అలవాటు పడిపోక మానము. కాబట్టి మీరు ఆడ తగిన మంచి మాటలే మాటలాడుచు మమ్ములను మంచిగా పెంచండి.


42) మంచి త్రోవలోన మము నడిపించుచు  -  మంచి మాటలాడి మంచి నేర్పి

     మంచి మార్గమెంచి యుంచుఁడు మమ్ముల.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మమ్ములను మీరు మంచి త్రోవలో నడిపించండి. మంచిగా మాతో మాటలడండి. మంచి మార్గాన్నే మీరు యెంచి మమ్ములను ఆ మార్గమున ఉంచండి.


43) నచ్చినట్టివెల్ల వెచ్చించి కొని, తిని,  -  తినఁగఁ జేయ మాకు తెలియునెట్లు

     తినఁగ నేవి తగునొ? తినరానివేవియో?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీకు నచ్చిన తినుబండారములనన్నిట్టిని మీరు ధనము వెచ్చించి కొని, తినుచు మాకును తినుఁడని పెట్టుదురు. మీరు మాకు ఆ విధముగా అలవాటు చేయుటచే ఏవి తిన తగినవో, ఏవి తిన రానివో మాకు ఏవిధముగా తెలియును?


44) మద్య మాంసములను మా ముందు సేవించ- మేము నేర్చుకొనమె మిమ్ముఁ జూచి?

     మంచి తిండి తినుఁడు, మంచివే త్రాగుడు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మా ముందే మద్య మాంసాదులను సేవించుచుండగా, మిమ్ములను చూచి మేము నేర్చుకొనమా? మీరెల్లప్పుడు మంచి తిన తగిన పదార్థములనే తినుచు, త్రాగఁ దగిన పానీయములనే త్రాగుచుండుడు. అది ఉభయులకు శ్రేయస్కరము.


45) పాఠశాలలోన పంతులమ్మలు చెప్పు   -  మాట మాకు బ్రతుకు బాట. కాన

     మంచి మాటలాడి మంచిని పెంచుడీ !  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చదువుకొనే బడిలో మాకు పాఠములను చెప్పెడి పంతులమ్మల మాటలే మాకు బ్రతుకు బాటలు. కావున మాతో మంచి మాటలాడి మంచినే పెంచండి.


46) పేదవారి నెల్ల సాదరంబుఁగ చూచి  -  ప్రేమ ధనము పంచి వెలుగు నెవరు

     వారె భువిని మాకు నారాధ్య దైవముల్.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ధనము లేని పేదవారిని ఆదరముతో చూచుచు, ప్రేమ అనే దనమును  వారికి పంచిపెట్టి ఎవరు ప్రకాశింతురో అట్టి మహనీయులే మాకు ఆరాధ్య దైవములు.


47) స్వార్థ బుద్ధి వీడి పర సుఖంబును కోరు  -  ఘనుల మంచి గుణమె కాంతి మాకు

     దారిఁ జూపి స్వార్థ దూరులఁ జేయును.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! స్వార్థ బుద్ధిని విడనాడి, పరుల సుఖమునే ఎల్లప్పుడు కోరుకొనుచు ఉండెడి మహనీయుల యొక్క మంచి గుణమే మాకు వెలుగు. మంచి మార్గమును కనఁబరచి, మమ్ములను స్వార్థమునకు దూరముగా ఉండునట్లు చేయండి.


48) స్వార్థ బుద్ధితోడ సన్మార్గమును వీడి  -  దురిత వర్తనమున దూఱువడెడి

     పెద్దవారు పెంచ పెంపు మాకెటులబ్బు?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తమ స్వార్థ బుద్ధితో ప్రవర్తనలో సన్మార్గమును విడనాడి, దుర్మార్గ ప్రవర్తనతో నిందింపఁ బడుతూ ఉండెడి పెద్దవాళ్ళ పెంపులో మేమున్నచో మాకు ఆధిక్యత అనునది ఏ విధముగా కలుగుతుంది?


49) కులమునెంచకుండ కలిసికట్టుగనుండు  -  సంఘ జనుల పెంపు చక్కన భువి.

     కులము మతము నెంచి కూల్చఁ బోకుడు మమ్ము.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కులమతములను గణింపకుండా, సంఘీభావముతో ఉండేటువంటి సంఘము లోని జనుల యొక్క పెంపు మాకు భూమిపై చక్కఁగనుండును. కులమతములనెంచి మమ్మల్ని కూల్చకండి.


50) తినుటకిచ్చి మమ్ము తిట్టుదురప్పుడే  -  చదువలేదటంచు చవటయనుచు.

     తినుటకిచ్చి తిట్ట తినబుద్ధి పుట్టునా?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాకు తినుటకు ఆహారము పెట్టి మేము భోజనము చేయుచున్నప్పుడే చదువుకోవటం లేదు, వట్టి చవటవి అని  మమ్మల్ని పెద్దలు తిట్టుచుందురు. తినుటకు పెట్టి తిట్టుచున్నట్లైతే మాకు ఆ ఆహారము తినుటకు ఎట్లు బుద్ధి పుట్టును?


51) తల్లి ప్రేమ పంచి తల్లడిల్లుచునుండు  -  పిల్లవాఁడు పుట్టి పెరుఁగు వరకు

     తండ్రి బ్రతుక నేర్ప దండించి, చింతించు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పిల్లలను కని వారు పెరిగే వరకు తల్లి తన ప్రేమను పంచుచు వారి కొఱకై తల్లడిల్లుచునే యుండును. అంతటి ప్రేమ మూర్తి అమ్మ. తండ్రి పిల్లలకు బ్రతుకుట నేర్పుట కొఱకు తప్పని పరిస్థితిలో దండించి, ఆ తరువాత అయ్యో ఎందుకు పిల్లవానిని దండించానా అని విచారించుచుండు.ను. అంతటి జాలి గుండె కలవాడు తండ్రి.


52) తల్లిదండ్రులెపుడు పిల్లల వృద్ధినే   -  కోరుచుంద్రు సుఖము ధారవోసి.

     పెంచి పెద్ద చేసి, మంచినే చూపుడీ.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లి తండ్రులు తమ సుఖమును ధారవోసిమరీ తమ పిల్లల యొక్క అభివృద్ధినే కోరుకొనుచుందురు. అట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్ద చేస్తున్నప్పుడు వారిలో మంచి గుణములనే అభివృద్ధి చేయవలెను.


53) తల్లి ప్రేమ తీపి తలపక పిననాడు  -  కొట్టి తిట్టినాము కొరికినాము.

     తల్లి మనసు వెన్న దండించదేనాఁడు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాకు అమ్మ యొక్క ప్రేమ చిన్న తనములో తెలియక పోవుట చేత మేము ఆ ప్రేమ మూర్తిని కొట్టుట, తిట్టుట, కొరుకుట, మొదలగు పనులవలన ఎంతగానో బాధ పెట్టి యుంటిమి. ఐననూ వెన్న వంటి మనసున్న మా అమ్మ ఏనాడూ పిల్లలను దండించుట చేయలేదు. అట్టి తల్లి ఋణము ఏ బిడ్డ తీర్చుకొన గలఁడు? జీవితాంతము మేము మా తల్లిదండ్రులపై ప్రేమతో మెలగవలసి యున్నది.


54) తండ్రి ప్రేమ చూపు. తన వస్తు వేదైన  -  పాడు చేయ మమ్ము పట్టి కొట్టు.

     తల్లి యట్లు కాక తండ్రిని వారించు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తండ్రి పిల్లలపై ప్రేమ చూపించుచుండును . కాని ఏదైనా తన వస్తువును పిల్లలు పాడు చేసినట్లైతే పట్టుకొని కొట్టును. కన్న తల్లి మాత్రము ఆ విధముగా కాదు. దండింపఁ బోవుచున్న తండ్రిని దండించనీయకుండా ఆమె అడ్డుకొనును.


55) చెత్తపనులు మేము చేయుట చూచినా   -  తల్లి చెప్పఁ బోదు తండ్రికెపుడు.

     తండ్రి కన్న తల్లి దయఁ జూచి రక్షించు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్నతనము కారణముగా మేము పాడు పనులు చేస్తున్నా కాని తల్లి చూచినప్పటికీ తండ్రికి చెప్పదు. తండ్రి కన్నా తల్లి పిల్లలను దయతో చూచుచు రక్షించుచుండును. అమ్మకు మాపై అంతటి ప్రేమ ఉంటుంది.


56) కన్నతండ్రి మనసు కఠినమందురుకాని  -  వెన్నకన్న మృదువు. కన్న బిడ్డ

     కాన రాని వేళ కలత చెందును తండ్రి.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కన్న తండ్రి యొక్క మనసు కఠినంగా ఉంటుందని అందరూ అందురు. కాని అది సత్యము కాదు. అతని మనసు వెన్నకన్నా సుకుమారమైనది. తమ కన్న బిడ్డ ఎదురుఁగా ఉన్నంత సేపూ అతనిలో ఉన్న ప్రేమ బైటకు చూపరు. తన కన్న బిడ్డ కాస్త కనిపించకపోతే ఊరికే తల్లడిల్లిపోదురు. అంతటి అనురాగ మూర్తి తండ్రి..


57) చిన్ననాడు మమ్ము మన్నన జేతురు  -  పెరుఁగుచున్న కొలది ప్రేమ తగ్గు

     మన్నన కరువైన మాకెట్లు తోచును?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని తల్లిదండ్రులు ఎంతో మన్నిస్తూ ఎంతగానో ప్రేమ కురిపిస్తారు. కాని మేము పెద్ద ఔతున్న కొద్దీ మాపై వారికి ఉండే ప్రేమ తగ్గిపోతుందని మాకు అనిపిస్తుంది. ఏలనందురా! చిన్నప్పుడు మమ్మల్ని వారు చూచినట్లుగా పెద్దైన కొద్దీ చూడరు. ఆ విధముగా వారు చూపించే ప్రేమ తగ్గుచున్నచో మాకు కష్టముగా ఉండదా?


58) పిన్నవానిపైన ప్రేమకొంచెము హెచ్చు.  -  పెద్దవానిపైన ప్రేమ తగ్గు

     పెద్దలిట్లు చూడ భీతిల్లమా మేము?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్న పిల్లలపై తల్లిదండ్రులు కొంచెము ఎక్కువ ప్రేమ చూపింతురు. చిన్న వాడు పుట్టగానే పెద్దవాడిని నిర్లక్ష్యము చేయుదురని మాకు తోచును. ఈ విధముగా చేయుచున్నచో మేము అభద్రతా భావముతో భయపడిపోమా?


59) కంటి ముందు మాకు  కనిపించు వాటిలో  - మంచి నెంచు నేర్పు మాకుఁ గొల్పి,

     మంచి చెడ్డలరసి మసలుట మప్పుడీ!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కంటి ముందు కనిపించే వాటిలో మంచినే మేము గ్రహించే నైపుణ్యము మాకు నేర్పి, మంచియేదో, చెడు ఏదో మేము తెలుసుకొని మసలుకొనే విధముగా మమ్ములను తీర్చి దిద్దండి.


60) మనసులోని మాట వినిపించ యత్నింప    -  తిరగబడితిమనుచు తిట్టెదరుగ! 

     మనసు విప్పి మేము మాటాడ కూడదా?   -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! సందర్భానుసారముగా పెద్దలతో మా మనసులో ఉన్న మాట మేము చెప్పుటకు ప్రయత్నము చేస్తుంటాము. ఐతే వారి మాటకు ఎదురు చెప్పుతున్నామని వారిపై తిరుగుబాటు చేస్తున్నామనీ తిట్టుచుందురు. మేము మనసు విప్పి మీతో మాటాడ కూడదా? మమ్మల్నర్థం చేసుకోరేమి?


61) కోరి ప్రేమఁగ మిము చేర వచ్చిన మమ్ము  -  చదువుకొండటంచు బెదర కొట్ట

     నేమి చేయ నేర్తు మెచటికి పోదుము?    -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ప్రేమగా మేము కోరి కోరి మిమ్ములను చేర వచ్చుచుండఁగా వెళ్ళు, చదువుకో, అంటూ మమ్మల్ని మీరు బెదకొట్టుచుందురు. అట్టి సమయంలో మేము ఏమి చేయఁ గలుగుదుము? ఎక్కడికి పోఁ గలము?


62) పాఠశాలలందు పాఠముల్ చెప్పుచు  -  నాటఁలాఁడఁ జేయ హాయి కలుగు.!

      ఆట లాడ మాకు నట చోటు లేదుగా!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. పాఠశలలలో  మాకు పాఠములు చెప్పుచూ, ఆటలు కూడా ఆడించుచున్నచో హాయిగా ఉండి, శారీరక మానసిక వికాశము మాకు కలుగును. ఐతే నేటి పాఠశాలలలో మేము ఆడుకొందామంటా ఆట స్థలములే లేవుకదా!


63) తల్లి తండ్రి గురువు దైవంబులగు మాకు - వారి వృత్తియందు నేరమున్న

నేర వృత్తి మాకు నేర్పకే వచ్చుగా! - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లి, తండ్రి, గురువు, వీరు మాకు దైవములే. అట్టి దేవులతో సమానమైన వారి యొక్క వృత్తమునందు నేర ప్రవృత్తి యున్నచో ఆ నేర ప్రవృత్తి మాకునూ నేర్పకనే వచ్చును కదా! కాబట్టి మాకు మార్గదర్శకులైన పెద్దలందు సత్ ప్రవృత్తియే యుండ వలెను కాని, నేర ప్రవృత్తి ఉండరాదు.


64) తల్లి కడుపులోన తన్నితిమానాడు. -  తల్లి మనసు తెలిసి తల్లడిలుదు

     మిప్పుడేమి చేసి మెప్పింప గలమయ్య?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తన్నితిమి. పుట్టిన తరువాత ఆమె మనసు తెలుసుకొనిన మేము తల్లడిల్లిపోవుచున్నాము. ఇప్పుడు మేము ఆమెకు ఏమి చేసి మెప్పించఁ గలము?

65) నాది నీది యనుచు వాదించి నేర్పుచు,    -  మాది మేము గొనగ మమ్ము తిట్టి

     స్వార్థపరులటంచు పలుకుట న్యాయమా?    -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చిన్నవారిఁగా ఉన్నప్పుడు మీరు ఇది నాది, అది నీది అంటూ మాతో వాదించి మాకు స్వార్థాన్ని మప్పుదురు. పెద్ద అయిన పిదప మేమి ఇది మాది అంటూ తీసుకొన్నచో మమ్ములను మీరు స్వార్థపరులు మీరు అని మమ్ములను నిందింతురు. ఇది మీకు న్యాయమేనా?


66) తిండి తినెడు వేళ మొండి చేతుము మేము  -  అమ్మ బుజ్జగించు, నరుచు నాన్న.

     అమ్మ నచ్చు, నాన్న యరుపు నచ్చదు మాకు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మాకు భోజనము పెట్టేటప్పుడు మాకు వద్దు, మేము తినము అని మారాము చేస్తాము. అప్పుడు అమ్మ మమ్మల్ని బుజ్జగించి తిండి పెట్టుతుంది. నాన్న మాత్రం తినమని మాపై అరుస్తారు. అందుకే అమ్మంటే మాకు నచ్చుతుంది. నాన్న అరుపులు మాత్రం మాకు నచ్చవు.


67) చిన్నవారిమగుట నన్నియు తెలియక   -  తప్పుచేయుచుందుమొప్పనుకొని.

     తప్పు తెలియఁ జిప్పి , దండింప మానుఁడీ..  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చిన్నపిల్లలమగుట చేత తెలియకపోయిన కారణముగా తప్పులనుకూడా చేయఁదగిన పనులుగానే భావించుట చేత ఆ తప్పులు చేస్తాము. అటువంటి సమయంలో మీరు మాకు ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలిసేలాగ చెప్పండి. అంతేకాని మమ్మల్ని శిక్షించడం మీకు తగదు.


68) పాఠశాలలోన పదిమందితో పాటు   -  అచటనున్నవాటినరయుదుమయ.

     మంచి చెడ్డలుండు. మన్నింపవలె మీరు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము బడిలో పదిమందితో కలిసి మసలుచున్నందున అక్కడి విషయములను అందరితో పాటు మేమూ నేర్చుకొందుము.  అట్లు నేర్చుకొనువాటిలో మంచివిషయములుండ వచ్చును, వాటితో పాటు చెడ్డ విషయములు కూడా ఉండ వచ్చును. ఆట్టి సమయమందు ఆ చెడ్డ మాలో చోటు చేసుకొన్నదని మీరు గ్రహించినచో మమ్ములను మన్నించి, ఆ చెడును గురించి మాకు చెప్పి, మమ్ములను మంచి మార్గమున మీరు నడిపించ వలెను.

 

69) పాఠశాలలోన బలవంత పెట్టుచు  -  చదువు నేర్ప, మాకు చదువు రాదు.

     నిజము చెప్ప మమ్ము నిలఁబెట్టి దండింత్రు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! బడిలో మాకు ఇష్టము లేని సమయమున ఉపాధ్యాయులు బోధింప యత్నించినచో మేము మా మనసులో ఉన్న యీ అభిప్రాయమును చెప్పినచో  వారు మమ్ము వారిని ఎదిరిస్తున్నామంటూ నిలపెట్టి దండిస్తారు. ఈ విధముగ చేయుట ధర్మమా?


70) పుస్థకంబు చదివి ముక్కున పెట్టిన  -  ఫలితమెట్టుండు? భావి యెటుల?

     నిండు మదిని చదువనిండుమమ్మిచ్ఛతో.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పుస్తకమును చదివి మేము ముక్కున పెట్టుకొనినచో ఫలితం ఏవిధంగా ఉంటుంది? భవిత ఎట్టులుండును?  మమ్ములను నిండు మనసుతో మనస్పూర్తిగా చదువనిండు. భవిత బాగుండును.


71) మీరు చదివి చెప్ప మేలగు కొంచెమే.  -  మేము చదివి నేర్వ మేలు హెచ్చు.

    మమ్ము చేయనిండు మా మేధ గాంచుడు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మా కొఱకు మీరే చదువుతూ, మాకు బోధించుతూ ఉన్నట్లైతే ఫలితము కొంచెం మాత్రమే ఉంటుంది. అదే మీరు మమ్మల్ని చదవి చెప్పమనినచో మా మేధా శక్తి మీకు తెలియును.


72) ఆడుకొనెడి మమ్మునల్లరి యని తిట్టి  -  చేయనీరు. మాదు చేవఁ గనరు.

     ఆట పాటలొసగు నద్భుత మేధను.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము ఆడుకొనే సమయమున మమ్ములను చూచి మీరు అల్లరి చేస్తున్నారేమిటి అని తిట్టుచుందురు. మమ్ములను ఆడుకోనివ్వరు. మీరు ఏ  ఆట పాటలను అల్లరి అంటున్నారో ఆ ఆట పాటలు మాకు అద్భుతమైన మేధా సంత్తిని కలుఁగఁ జేయును.


73) పెద్దవారి నడుమ పిల్లలమగు మేము   -  చెప్పు మాట వినరు. తప్పనుదురు.

     మమ్ము చెప్పనిండు. మా మాటవినుఁడయ్య  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మాటలాడుకొనుచున్నప్పుడు మేము ఆ మాటలు విని స్పందించి మా అభిప్రాయమును చెప్పుటకు ఉత్సహిస్తున్నప్పుడు మమ్మల్ని మీరు అడ్డుకొని, అలా మధ్యలో మాటాడ కూడదు, తప్పు అని మా నోరు నొక్కివేతురు. మమ్మల్ని కూడా మా అభిప్రాయాన్ని చెప్పనివ్వండి. మా మాట కూడా కొంచెం వినండి.


74) పిన్నలమగు మేము పెద్దవారిని పోలి   -  చూడఁ గలము. చూచి చెప్పఁ గలము.

    చూచి చెప్పనిండు తోచిన భావన.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్న పిల్లలమైన మేము కూడా పెద్దవారిలాగే వినకలము, దానికి స్పందించి మా అభిప్రాయము కూడా చెప్పఁగలము. మమ్మల్ని కూడా ఏమి జరుగుచున్నదో చూడనివ్వండి, చూచి చెప్పనివ్వండి.


75) మమ్ము త్రోసిపుచ్చి మా మాట వినరేల?  -  మాకు విలువ లేదొ? మనసు లేదొ?

     మమ్ము కూడ మీరు సమ్మతిఁ గనుఁడయ్య?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మమ్మల్ని లక్ష్య పెట్టకుండా మా మాటలను గ్రహింపరేమి? మాకు మీ మధ్య విలువ లేదా? మమ్మల్ని కూడా మీరు సమ్మతితో చూడండి.


76) ఎవరి శక్తి నెన్న నెవరికి సాధ్యము?  -  బాలలందు శక్తి ప్రబలకున్నె?

     శోధనమున భావి మేధావులము మేము  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ఎవరి యొక్క అంతర్గతంగా ఉండే శక్తి సామర్థ్యముల నెవరు గుర్తించఁ గలరు? బాలలలో కూడా శక్తి ప్రబలి ఉండునని తెలుసుకొన వలెను. భావి కాలమున పరిశోధనలను చేయు మేధావులము మేమే కదా!


77) తల్లి చేతి ముద్ద పిల్లలకనురాగ  -  బంధమరయఁ జేయు, బ్రతుకఁ జేయు.

     తల్లి ప్రేమ కొలుపు మల్లెల మనసును.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లి చేతితో పెట్టే భోజనము పిల్లలకు ప్రేమ బంధమును తెలియఁ జేయును. బ్రతుకునట్లు చేయును. తల్లి ప్రేమ మాలో మల్లెల వంటి మనసును కలుగఁ జేయును.


78) పుట్టినపుడె మాకు గుట్టుగా జ్ఞానమ్ము  -  యోగనిద్రలోన దాగియుండు

     వెలికి నుబుకఁ జేసి, వెలుఁగఁ జేయుఁడు మమ్ము.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము పుట్టిన నాటి  నుండియే జ్ఞానము మాలో గుట్టుగా యోగనిద్ర వలె అంతర్గతంగా ఉంటుంది. ఆ జ్ఞానమును బయల్పడఁ జేసి, మమ్ములను ప్రకాశింపఁ జేయండి.


79) చిన్ననాడె కృష్ణుఁడెన్నెన్నొచేయుచు  -  మన్ననలను పొంది మాన్యుఁడవఁడె?

     ఎట్టివారిలోన నేశక్తి యున్నదో!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! శ్రీ కృష్ణుఁడు చిన్నవాడుగా ఉన్న నాడే ఎన్నెన్నో అద్భుతమైన పనులు చేసి పెద్దవారి మన్ననలను పొందలేదా? ఎవరెవరిలో ఏయే శక్తులు దాగి ఉన్నవో కదా!


80) బాల వాక్కులరయ బ్రహ్మవాక్కులనుచు  -  పలుకువారె మమ్ము పలుక నీరు.

     మాటలాడనీక మమ్ము నిలుపనేల?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! బాల వాక్కును బ్రహ్మ వాక్కు అని మీరు అందురు. మరి మేము మాటాడబోతే మాత్రం మాటాడనీరు. మమ్ములను మాటానీయకుండా ఎందుకు అడ్డుకొందురు?


81) మేలు మేలటంచు మెచ్చు వారలు మాకు  - నచ్చుదురయ. మమ్ము మెచ్చుఁడయ్య.

    మెచ్చు చున్న పొంగి మేరువెత్తుదుమయ్య!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చేయు పనులను గని చాలా బాగున్నవి అని  మెచ్చుకొనెడివారలను మేము ఇష్టపడుదుము. మా మంచి పనులను చూచినపుడు మీరు మెచ్చుకొనుడు. మీరు మెచ్చుకొనుచున్నట్లైతే మేము మీ మాటలకు పొంగిపోయి ఎంతటి పనినైనను చేయుటకు ప్రయత్నించుదుము.


82) చిన్న నాడు కథలు చెప్పిన మదినుండు.  -  నీతి మార్గమునను నిలుపు మమ్ము.

     నీతి కథలు చెప్పి ఖ్యాతిఁగా నిలుపుడీ!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మా చిన్నతనములో మీరు చెప్పెడి నీతి కథలు మదిలో నిలిచిపోవును. ఆ నీతి కథలు మాకు స్ఫూర్తిదాయకములై మమ్ములను నీతి మార్గమున నడిపించును. కావున అట్టి నీతి కథలను చెప్పి మమ్ములను ఖ్యాతితిఁగా ఉండే విధముగా భువిపై నిలపండి.


83) ప్రీతి పేదరాశి పెద్దమ్మ కథలన్న.  -  చందమామ కథలు చదువఁ బ్రీతి.

     చెప్పరేల మాకు గొప్పగా కథలల్లి  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పేదరాశి పెద్దమ్మ కథలన్నను, చందమామ కథలన్నను మాకెంతయో యిష్టము. మీరు మంచి మంచి కథలను అల్లి మాకు ఎందుకు చెప్పరు? మంచి మంచి కథలను మాకు చెప్పి మాలో నీతిని పెంచండి.


84) నీతి శతకములను నేర్పిన నేర్వమా?  -  నీతిబోధ సేయ నేర్వలేమ?

     నీతి మార్గముననె ఖ్యాతిఁగా నడుపుడీ!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మాకు నీతిశతకమును నేర్పినచో మేము నేర్వకుందుమా? నీతి బోధ మాకు మీరు చేసినచో మేము నేర్చుకొనమా? మమ్ములను మీరు నీతి మార్గములోనే ప్రఖ్యాతముగా నడిపించండి.


85) పుట్టినపుడు వారు పూజ్యులై యుండియు  -  చెడుట వలన వారు చెడ్డ చేయు.

     చెడ్డ నేర్వకుండ బిడ్డలఁ గాచుడీ!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీ బిడ్డలు పుట్టినపుడు పూజ్యమైన నిష్కళంకులే. సమాజములో కనిపించే చెడు గ్రహించి, చెడిపోతున్న కారణముగా చెడ్డవారగుచుండిరి. మీ బిడ్డలను చెడ్డ నేర్వకుండా కాపాడుతూ పెంచండి.


86) తెలుఁగు మాటలాడి, తెలుఁగు పాటలు పాడి-వెలుఁగ వలయును మన తెలుఁగువారు.

     మాకు కూడ తెలుఁగు మాటలు నేర్పుడీ!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తెలుగు భాషనే మాటాడుచు, తెలుఁగు పాటలనే పాడుచు, మన తెలుఁగు వారు ప్రకాశింప వలెను. మాకు కూడా మీరు తెలుఁగు పదజాలమును నేర్పండి.


87) కృష్ణ రాయు కీర్తి కృష్ణమ్మ విఖ్యాతి  -  తెలుఁగు కవుల స్ఫూర్తి తెలియఁ నేర్పి

     ఘనత పెంచుడయ్య కన్నబిడ్డలకిల  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!శ్రీ కృష్ణ దేవరాయల యొక్క మంచి కీర్తిని, మహానది కృష్ణమ్మ యొక్క ప్రాశస్త్యమును తెలుఁగు కవుల యొక్క స్ఫూర్తిని, మాకు తెలిసే విధముగా నేర్పి, భూమిపై మా యొక్క ఘనతను వృద్ధి చెయ్యండి.


88) తెలుఁగు తేజమెంచి తెలుఁగును నేర్పించి  -  తెలుఁగువారి కీర్తి వెలుఁగఁ జేయ

     తెలుఁగుపైన ప్రేమ తెల్లము చేయుడీ  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తెలుఁగు భాషకు గల ప్రశస్తిని గ్రహించి, ఆ భాషమను మాకు నేర్పించి, తెలుఁగువారి యొక్క సత్కీర్తిని ప్రకాశమానమగునట్లు చేసి, తెలుఁగు భాషపై మీకున్న మక్కువను స్పష్టము చెయ్యండి.


89) చూడ నేర్పుడయ్య సోదర సోదరీ  -  భావనలను పెంచి పరులఁ గనిన.

      అక్క చెల్లి యనెడి వాక్కులు నేర్పుడీ  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ఇతరులను  మేము చూచునపుడు  సోదరీ సోదర భావముతో చూచు స్వభావమును మాకు మప్పండి. ఆప్యాయముగా అక్కా! చెల్లీ! అన్నా! తమ్ముడూ! అంటూ పిలుచుటకు అలవడునట్లు ఆ పదములను నేర్పండి.


90) అమృత సదృశమైన యాంధ్రమ్ము విడఁ జేసి  -  యాంగ్ల భాష నేర్వుమనుట తగునె?

     ఆంధ్రభాష నేర్పి యాంగ్లమ్ము నేర్పుడీ.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! అమృతముతో సమానమైన ఆంధ్ర భాషను విడిచిపెట్టేలా చేసి, ఆంగ్లభాషనే నేర్చుకోమనుట మీరు చేయ తగిన పనియేనా? మాకు మాతృభాష ఐనటువంటి ఆంధ్ర భాషను మాకు మొదట నేర్పి ఆ తరువాత ఆంగ్ల భాషను అభ్యసింప చెయ్యండి.


91) స్వేచ్ఛ మప్పవచ్చు పీడన నేర్పక. -  బాధ కొలుప రాదు పరులకెపుడు.

    భవ్యమైన సుగుణ వర్తనల్ నేర్పుడీ!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పెద్దలు పిల్లలకు స్వేచ్ఛను నేర్ప వచ్చును కాని, తమ స్వేచ్ఛతో పరులను పీడించుట మప్ప కూడదు. గొప్పవైన మంచి గుణ వర్తనలు నేర్పండి.


92) మాట తీరునేర్పి మన్ననల్ గన నేర్పి  -  మంచితనము నేర్పి మసలనేర్పి

     మమ్ము తీర్చి దిద్ది మన్ననల్ గాంచుడీ!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము మాటాడ తగిన విధానమును మాకు నేర్పి, అందరినీ మన్ననతో చూచుట నేర్పి, మంచితనమును మప్పి మంచిగా మసలుట నేర్పి, మమ్మల్ని మంచివారిగా తీర్చి దిద్ది, మీరు మన్ననలను పొందండి.


93) దేశ భక్తి తోడ దీపించు మహనీయ   -  ఘనుల చరిత మాకుఁ గానఁ జేసి,

     దేశ భక్తి కొల్పి, దీప్తిని కొల్పుడు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! దేశ భక్తిచేత ప్రసిద్ధులైన గొప్ప మహనీయుల వృత్తాంతములు మాకు తెలియపరచి, మాలో దేశ భక్తిని రగులఁ గొల్పి వెలుఁగునట్లు చేయండి.


94) దైవ భక్తి చేత తలపులు మారును  -  దీక్ష నేర్చు మనసు దీనివలన

     మంచి చేయనగును. మాకవి నేర్పుడీ?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! డేశ భక్తి వైపు దృష్టి మరలినచో మన ఆలోచనా సరళి మంచిగా మారును. దీని వలన మనలో దీక్ష పెరుగును. ఆ కారణముగా సమాజములో మనము మంచినే చేయుట జరుగును. అందుచే మాకు అవి అలవడునట్లు చేయండి.


95) కార్యదీక్ష మప్పి కర్తవ్యమును  తెల్పి  -  మమ్ము తీర్చి దిద్ది మహిమఁ గొలిపి

     దేశ సేవ చేయ దీవించి వదులుడీ!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కార్యదీక్షను మాకు ఎఱుక అపరచి,  కర్తవ్యమును తెలియఁ జేసి, మాకు శిక్షణనిచ్చి, మాలో మహనీయతను కలుఁగఁ జేసి, దేశసేవను చేయునట్లుగా మమ్ములను దీవించి, ఆ అవకాశమును కల్పించండి.


96) అమల సద్గుణముల నలరారగా చేసి  -  యాంధ్రమాత బిడ్డ లసదృశులని

     పొగడ, మెలఁగునట్లు పూర్తిగా చేయుడీ.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! నిష్కళంకమైన మంచి గుణములతో ఒప్పునట్లుగా మమ్ములను చేసి, ఆంధ్ర మాత బిడ్డలైన వీరు సాటి లేనివారని పొగడఁ బడే విధంగా మేము మెలఁగునట్లు మమ్ములను పూర్తిగా చేయవలసినదిగా కోరుకొంటున్నాము.


97) పిరికితనము బాసి చరియించుటను నేర్పి,  -  పట్టుదలను మప్పి, భక్తి మప్పి

     గట్టివారిగ మమ్ము కరుణతో చేయుడీ!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!  మాలో ఉండే పిరికితనమును విడిచి ప్రవర్తించుటను మాకు నేర్పి, మాకు మంచి విషయములను నేర్చుకొనుటయందు పట్టుదలను మప్పి, భక్తి మార్గమును తెలియఁ జేసి, దృఢమైన వ్యక్తులుగా దయతో మమ్ములను తీర్చి దిద్దండి.


98) మేలు కొల్పి మమ్ము, మేధావులను చేసి  -  అణగి యున్న శక్తినంత చూపి

     జన్మసార్ధకమవ చరియింపఁ జేయుడీ!  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! అజ్ఞానముచే నిద్రాణ స్థితిలో ఉన్న మా మనస్సులను మేలుకొలిపి, జ్ఞాన బోధతో మేధావులుగా చేసి, మాలో అణగి యున్న శక్తినంతటిని మేము కనునట్లు చేసి, మా జన్మ సార్థకమయే విధముగా చక్కని మార్గమున నడిచేటట్లు తప్పక చేయండి.


99) చిన్నపిల్లలమయి చిలిపిచేష్టలచేత -  మిమ్ము బాధ పెట్టు మమ్ముఁ జూచి

     కోపగించకుడయ మాపైన మీరలు  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చిన్న పిల్లలమగుట చేతనే చిలిపి చేష్టలు చేయుచు మిమ్ములను బాధపెట్టుచున్నామని మాపై కోపగించకండి.


100) బాల భావనలను భావించి, వివరింప  -  రామ కృష్ణ సుకవి రచన చేసి  -       

        తెలిపిరనుచు కవిని తిట్టక చదువుడు. -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము.  జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ఈ రామ కృష్ణ కవి బాలల మనసులనుండు భావనలను భావించి, అవి పెద్దలకు వివరింపనెంచి శతకముగ రచించి మీకు తెలిపినందులకు మీరు కినుక వహించి, ఈ కవిని తిట్ట వలదు. ఈ శతకమును చక్కగా చదువుడు.


101) పెద్దల కను విప్ప శ్రద్ధతో వ్రాసిన  -  ‘బాల భావన’లివి. మేలు కొలుపు!

     తల్లిదండ్రుల మది తప్పక కదిలించు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ఈ శతకమునందలి పద్యములు పెద్దల కళ్ళు తెరిపించుటకై శ్రద్ధతో వ్రాసినటువంటి బాల భావనలు. ఇవి తప్పక కనుల విప్పఁ జేయును. తల్లిదండ్రుల మనస్సులను తప్పక కదిలింప గలవు. 


102) శ్రీకరమగునట్టి చింతాన్వయుండైన  -  రామ కృష్ణ సుకవి రచితమైన

     బాలభావనలివి. పఠియింప మేలగు  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార! 

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!  మంగళప్రదమైనటువంటి చింతా వారి వంశమున జనించిన రామ కృష్ణా రావు అనెడి మంచి కవిచే రచింపఁ బడిన బాలభావనలు ఈశతకమున నిండియున్నవి. ఇవి చదివినచో తప్పక మేలు జరుగును.


103) పెద్దలెల్ల కవిని పెద్దగా మన్నించి   -  వ్రాయ మనగ వారు వ్రాసి రదియు

      నొక్క రోజు లోన. చక్కగా చదువుడు  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ఆంధ్ర భాషా సంసేవనా దక్షులైన పెద్దలు ఈ కవిని గౌరవ పూర్వకముగా శులభశైలిలో బాలురకు పఠన యోగ్యముగా ఉండు విధముగా వ్రాయమనగా వారు ఈ శతకమును ఒక్క రోజులోనే వ్రాసిరి. మీరు ఆదరముతో చక్కగా చదువుడు.


104) చిన్న పిల్లలెల్ల చిఱునవ్వులొల్కుచు  -  వన్నెగాంచ నెంచి వ్రాసినారు

      పెద్దలెల్ల చదివి పెంచుడు పిల్లలన్.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్న చిన్న పిల్లలు ఎల్లప్పుడూ ఆనందముతో చిఱునవ్వులొలుకుతూ వన్నె గాంచాలని ఆశించుతూ ఈ శతకమును ఈ రామ కృష్ణారావు కవి వ్రాసిరి. పెద్దలందరూ ఈ శతకమును చదివి బాల భావనలనెఱింగి బాలురమైన మమ్ము  చక్కని మార్గములో పెంచుడు.


105) గురుని పాద ధూళి కరుణతో మది నిల్చి  -  పద్య రచన చేయు పటిమఁ గొలుప 

      వ్రాసియుండిరి కవి వాసిగా. చదువుడు  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ఈ రామ కృష్న కవి యొక్క  గురుదేవులైన శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యులవారి పాదధూళి భావనారూపమున వారి హృదయములో నిలిచి కవిని పద్య రచన చేయుటకు శక్తి కలవానిగా చేయగా  ఈ శతకమును ఒప్పిదముగా వ్రాసిరి. మీరు తప్పక చదువుడు.


106) మల్లె మనసు నొప్పు మహిత వేంకట రత్న   -  మాతృ మూర్తి కృపను మంచి కవిత

      వరల నుబికి రాగ వ్రాసిరి కవివరుల్ -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మరు మల్లెల వలె సుకుమారమైన మనసుతోనొప్పారు మహనీయురాలైన కవి యొక్క మాతృమూర్తి వేంకట రత్నమాంబ గారి చక్కని కృప కారణముగానే మంచి కవిత్వము ప్రకాశవంతముగ నుబికి వచ్చి శతక రూపముగా నుద్భవింపగా ఈ కవి ఈ శతకమును వ్రాసిరి. మీరు తప్పక చదువుడు.


107) గుణము లొప్పియున్న గురుదేవు కృపయది.  -  దోష రాశి కవిది. ధ్యాస నిలిపి

      గుణములెంచి చదివి ఘనతఁ గాంచుడు మీరు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ఈ శతకమునందు గుణములు ఉన్నచో కవివరుని  గురుదేవులైన శ్రీమాన్ కల్వపూడి వీర వేంకట రాఘవాచార్యుల వారి కృప వలన మాత్రమే కలిగినవి. దోషములున్నచో అవి కవి యొక్క అజ్ఞానము వలన మాత్రమే కలిగినవి. గుణములనే యెంచుచు మీరు చదివి ఘనత గాంచుదురు గాక.


108) మంచినెంచు మీకు మంగళంబులు కల్గు. -  పిల్లలందు మీకు ప్రేమ పెరుఁగు.

      ప్రేమ మంగళ మది పిల్లలకు శుభంబు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!  

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ఎల్లప్పుడూ  మంచినే ఎంచునట్టి మీకు శుభములే కలుగును. పిన్నవారిపై మీకు తప్పక ప్రేమ పెరుఁగును. మీకు పిల్లపై ప్రేమ పెరుఁగుట మంగళ ప్రదము. అది పిల్లలమైన మాకు శుభప్రదమగును. శుభము అగుఁ గాక. 

స్వస్తి.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.