గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 38వ శ్లోకం. 288 - 297. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోచిత్రఘణ్టా సునందా శ్రీర్మానవీ మనుసంభవా

స్తంభినీ క్షోభిణీ మారీ భ్రామిణీ శత్రుమారిణీ 38  

288. ఓం *చిత్రఘణ్టా*యై నమః

నామ వివరణ.

తల్లి శిరమున ఘంటాకారంలో ఉన్న చంద్రుని ధరించిన కారణంగా 

చంద్రఘంటగా ప్రసిద్ధమయింది. ‘‘ప్రసాదం తనుతే మహ్యం చన్ర్డఘణ్టేతి 

విశ్రుతా’’సుందరమయిన మెడ కలిగిన తల్లి మన అమ్మ.

తే.గీ*చిత్రఘణ్టా!* సునందాఖ్య! చిత్స్వరూప

మీవె నాలోన, నిజమిది, భావమెఱిఁగి,

నాదు హృదయాన నిల్చి నన్నాదుకొనుము,

వందనంబులు చేసెద నందుకొనుము.

289. ఓం *సునన్దా*యై నమః

నామ వివరణ.

ఆనందము కలిగించు కుమార్తె రూపముననుండునది అమ్మయే.

తే.గీమనసుకానందమును గూర్చు మా *సునన్ద!*

మానసంబున నీవున్న మధుర కవిత

లద్భుతంబుగా ప్రభవించు ననుపమగతి,

నిలిచి నామదిన్, రక్షించు నిలకడగను.

ఓం *చిత్రఘణ్టా సునందా*యై నమః

నామ వివరణ.

సుందరమయిన మెడ కలిగిన తల్లి మన అమ్మ. ఆనందము కలిగించు కుమార్తె

రూపముననుండునది అమ్మయే.

తే.గీ*చిత్రఘణ్టాసునందా*ఖ్య! చిత్స్వరూప

మీవె నాలోన, నిజమిది, భావమెఱిఁగి,

నాదు హృదయాన నిల్చి నన్నాదుకొనుము,

వందనంబులు చేసెద నందుకొనుము.

290. ఓం *శ్రి*యై నమః

నామ వివరణ.

మంగళస్వరూపిణి మన అమ్మ సర్వ సంపత్ప్రద.

తే.గీ*శ్రీ!* దయానిధీ! మదిలో వసించరమ్ము,

స్వపర భేదంబునే పాపి సన్నుతిఁ గను,

శ్రిత జనానీక సత్పోష శ్రీ ప్రకాశ!

వందనంబులు చేసెద నందుకొనుము.

291. ఓం *మానవ్యై* నమః

నామ వివరణ.

మానవత్వము కలిగిన మానవి మన అమ్మ.

తే.గీ. మనుజ! *మానవీ!* కృపఁ గను మంగళాంగి!

మానవత్వము నశియించె మనుజులందు,

నీవు శిక్షించు ధూర్తులన్, నిత్య భాస!

వందనంబులు చేసెద నందుకొనుము.,

292. ఓం *మనుసమ్భవా*యై నమః

నామ వివరణ.

అమ్మ మనువునుండి సంభవించిన తల్లి.

కం.  *మనుసమ్భవ*నా ప్రార్థన

వినుమమ్మ! దయా సముద్ర! వినిపింతును నేన్

క్షణమొక యుగముగ గడుపుచు

మనఁజాలను నీవు లేక మదిలో జననీ!

293. ఓం *స్తమ్భిన్యై* నమః

నామ వివరణ.

స్థంభించి యుండు జనని మన అమ్మ.

తే.గీ.  *స్తమ్భినీ!* నిలు మదిలోన స్తంభమట్లు

సంబరంబుగ నిను గొల్తు సన్నుతపద!

పద్యకవితలన్ బ్రభవించు, పరవసింతు,

వందనంబులు చేసెద నందుకొనుము.

294. ఓం *క్షోభిణ్యై* నమః

నామ వివరణ.

క్షోభను కలుగఁజేయు తల్లి అమ్మ.

తే.గీ. *క్షోభిణీ!* మదినున్ననా క్షోభఁబాపు

క్షోభ వాసిన నీదగు శోభ నిలుచు,

శోభ నిలిచిన కొలుచుట సులభమగును,

వందనంబులు చేసెద నందుకొనుము.

295. ఓం *మార్యై* నమః

నామ వివరణ.

అసుర సంహారము చేయు తల్లి మన అమ్మ.

తే.గీఅసుర సంహారిణీ *మారి! * మసలుదు రిల

రాక్షసాంశులా యనదగు భ్రష్టులరెరె

మంచివారిని హింసించు వంచితులగు

వారి సంహారమొనరించు వీరమాత!

296. ఓం *భ్రామిణ్యై* నమః

నామ వివరణ.

భ్రమణము కలుగఁ జేయు జనని.

తే.గీ*భ్రామిణీ!* సృష్టి చేయును బ్రహ్మ నీవు

తనదు ముఖమునఁ గల్గుటన్ దర్పమలర,

సృష్టి చేయించు నీపైన దృష్టి పెట్టి

కవితలల్లెదనా నీదు కరుణనొంది.

297. ఓం *శత్రుమారిణ్యై* నమః

నామ వివరణ.

శత్రువులను సంహరించు జనని అమ్మ.

తే.గీ. *శత్రు మారిణీ! * నీ ప్రియ పుత్రుఁడఁ, గని

శత్రు రహితునిగాఁ జేసి సదయ నిలుపు

మన్యమైనట్టివానిపై యాశ లుడుపు,

వందనంబులు చేసెద నందుకొనుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.