గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 39వ శ్లోకం. 298 - 306. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోమోహినీ ద్వేషిణీ వీరా అఘోరా రుద్రరూపిణీ  

రుద్రైకాదశినీ పుణ్యా కల్యాణీ లాభకారిణీ 39  

298. ఓం *మోహిన్యై* నమః

నామ వివరణ.

మోహమును కలుగజేయు తల్లి మన అమ్మ.

తే.గీ*మోహినీ!* జగత్ సృష్టిలో మోహమేల

కల్పనంబాయె? నిజమును కనగలేము

మోహవిభ్రాంతిచేఁ, గాన, మోహముడిపి,

లోకమును వెల్గఁ జేయుమా శ్రీకరముగ.

299. ఓం *ద్వేషిణ్యై* నమః

నామ వివరణ.

ద్వేషమునకు మూలమయిన తల్లి మన అమ్మ.

తే.గీ. *ద్వేషిణీ*! దుర్జనులపైన ద్వేషమూని

నాశనంబొనరింపుము నయ నిధాన!

ద్వేష శూన్యునిగా నన్ను తీర్చిదిద్ది

కాచి రక్షించు మోయమ్మ! కన్నతల్లి!

300. ఓం *వీరా*యై నమః

నామ వివరణ.

పరాక్రమము కలిగిన వీరా మన అమ్మ.

తే.గీ. భీతినే పాపు *వీరా! * ప్రపూత చరిత!

ఖ్యాతిగా మదిలోపలఁ గలిగియుండి

వీర సంస్కారములు కొల్పి ప్రీతిఁ గనుమ

వందనంబులు చేసెద నందుకునుము.

 

301.. ఓం *అఘోరా*యై నమః

నామ వివరణ.

ఏమాత్రము ఘోరముగా ఉండని జనని అఘోరా మన అమ్మ.

తే.గీఘోర దూర! నన్ గాంచు *మఘోర* కృపను,

ఘోర కృత్యముల్ చేసినఁ గూల్చుమమ్మ,

సార హీన మీ సంసార భారమరయ,

ఘోర భవబంధముల్ బాపి కూర్మిఁ గనుము.

302. ఓం *రుద్రరూపిణ్యై* నమః

నామ వివరణ.

రుద్రుని యొక్క రూపమున ఉండు జనని మన అమ్మ.

తే.గీ*రుద్ర రూపిణీ!* నాలోని రౌద్రమీవె

శాంతముగఁ జేసి, నిల్పితి చక్కగ నను

క్షుద్రులన్ బరిమార్చుమా రుద్రరూప!

వందనంబులు చేసెద నందుకొనుము.

303. ఓం *రుద్రైకాదశిన్యై* నమః

నామ వివరణ.

ఏకాదశ రుద్రులూ మన అమ్మయే.

కం*రుద్రైకాదశినీ!* నన్

భద్రంబుగ కావుమమ్మ, భయదూర! కృపన్,

సద్రచనలు చేయించుమ,

ముద్రితమవ నీ ప్రశస్తి, పూజింతు నినున్.

304. ఓం *పుణ్యా*యై నమః.

నామ వివరణ.

పుణ్యకార్యములను ప్రశంసించు పుణ్యాత్మురాలు మన అమ్మ.

కం*పుణ్యా!* కొలిచెద నిన్నున్

గణ్యంబుగ శుభకరముగ  గౌరవమొప్పన్,

బుణ్యాత్ములకెల్లప్పుడు

సన్యాయము నడుపుమమ్మ సంస్తుతి గనగన్.

305. ఓం *కల్యాణ్యై* నమః.

నామ వివరణ.

మంగళప్రదమయిన తల్లి మన అమ్మ.

కం*కల్యాణీ!* భూజనులిక

కల్యాణప్రదముగ నిను గణియించుచు, సా

కల్యంబుగ సత్ఫలితము

లౌల్యంబును వీడి గనుత, లక్ష్యముతోడన్.

306. ఓం *లాభకారిణ్యై* నమః.

నామ వివరణ.

లాభములకు కారణభూతురాలు మన అమ్మ.

తే.గీ.  *లాభకారిణీ*! నినుఁగొల్చి లాభములను

పొందు గావుత జనపాళి భువిని సతము,

నేను నిన్ గొల్తు నిత్యంబు నీవె నాదు

చిత్తపద్మమ్ముపైనుండి చేదుకొమ్ము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.