గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 37వ శ్లోకం. 280 - 287. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోగౌతమీ గోమతీ గౌరీ ఈశానా హంసవాహినీ   (వానీ)

నారాయణీ ప్రభాధారా జాహ్నవీ శంకరాత్మజా 37  

280. ఓం *గౌతమ్యై* నమః

నామ వివరణ.

గౌతముని కుమార్తె మన అమ్మ.

తే.గీ.  *గౌతమీ!* పుణ్యరాశివి! కవుల కృతుల

నాట్యమాడెడు తల్లివి, నయ నిధాన!

నీవె నాలోని కవితవై నిరతమిటులె

కవిత రూపాన ప్రవహించు గౌరవముగ.

281. ఓం *గోమత్యై* నమః

నామ వివరణ.

గోమతీ నది మన అమ్మయే.

తే.గీ.  *గోమతీ! * నిన్నుకొలిచి, నే కోరుచుంటి

భరతభూమిపై ప్రవహించి పచ్చదనము

సతతమున్ గొల్పుచుండుమా, సత్కవిత్వ

ధారలట్టుల నుర్విపై, తప్పదమ్మ.

282. ఓం *గౌర్యై* నమః

నామ వివరణ.

గౌర వర్ణముతో విరాజిల్లు జనని మన అమ్మయే.

తే.గీవినుత! *గౌరీ!* శుభాకార! వెలయుము మది,

ఘనత గాంచెద నీవున్న కవిగ నేను,

సత్ కవిత్వము మరుమల్లె సౌరభములు

నీకె యందింతుమదిలోన నీవె కలుగ.

283. ఓం *ఈశానా*యై నమః

నామ వివరణ.

ఈశ్వరుని సతీమణి మన అమ్మయే.

తే.గీవినుతి గాంచితి *వీశాన*!  విశ్వనాథు

దేహభాగముగా నుండి దీప్తిదవయి,

లోకపాలనఁ జేయుచున్ శ్లోకరూపి

ణీ! చిదానందమిమ్మమ్మ, నిన్నుఁ గొలుతు.

284. ఓం *హంసవాహిన్యై* నమః

నామ వివరణ.

హంసను వాహనముగా కలిగిన తల్లి మన అమ్మ.

తే.గీ.  *హంసవాహినీ*! నాలోన హంస కలదు

దానినేవాహనమ్ముగా దయను గొనుమ,

జ్ఞానమున హంసతేజమున్ గనగనిమ్ము,

వందనంబులు చేసెద నందుకొనుము.

285. ఓం *నారాయణీ ప్రభాధారా*యై నమః

నామ వివరణ.

నరులకు ఆశ్రయమిచ్చే నారాయణి మన అమ్మ. నారాయణుని కాంతి ప్రవాహమే అమ్మ.

కంజ్ఞానప్రద! శ్రీనారా

యణీ ప్రభాధార! నిలువు మమ్మా మదిలో,

నీ నామమె ప్రభఁ గొలుపును,

నా మదిలో నుండి సతము, నా జనయిత్రీ!

ఓం *నారాయణ్యై* నమః

నామ వివరణ.

నరులకు ఆశ్రయమిచ్చే నారాయణి మన అమ్మ.

తే.గీవినుత *నారాయణీ! * నిన్ను విశ్వసింతు,

ప్రనుత సత్కావ్యములు గొల్పు ప్రాభవమును

నాకుఁ గలిగింపుమమ్మరో లోకమునను

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *ప్రభాధారా*యై నమః

నామ వివరణ.

నారాయణుని కాంతి ప్రవాహమే అమ్మ.

తే.గీనుత! *ప్రభాధార!* నీకు సన్నుతులు జనని!

ప్రభను ధారగా కురిపించు పద్యములను

వ్రాయగాఁ జేసి కీర్తివై ప్రబలుమమ్మ.

వందనంబులు చేసెద నందుకొనుము.

286. ఓం *జాహ్నవ్యై* నమః

నామ వివరణ.

జాహ్నవీ నది అమ్మయొక్క రూపమే.

తే.గీ*జాహ్నవీ!* నిన్ను నుతియింత్రు సత్ కవులిల

జీవకోటిని బ్రతుకంగ చేయుదీవు,

దేవలోకముగా భువి నీవె చేయ

వర్ధనంబగు చుండెనో భక్త వినుత!

287. ఓం *శఙ్కరాత్మజా*యై నమః

నామ వివరణ.

శంకరుని యొక్క ఆత్మజ అమ్మ.

తే.గీ*శఙ్కరాత్మజా! * నాలోని జంకుఁ బాపి,

పంకజాక్షుని సేవలోఁ బరగనిమ్ము,

నేను భక్తితోఁ బూజించి నిన్ను గనుదు,

వందనంబులు చేసెద నందుకొనుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.