గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జూన్ 2020, ఆదివారం

మన మాజీ ప్రథాని పీ.వీ.నరసింహారావుగారి శతజయంతి సందర్భముగా దర్శనం పత్రిక నిర్వహించినకవితా నీరాజనమ్.

జైశ్రీరామ్.
మన మాజీ ప్రథాని పీ.వీ.నరసింహారావుగారి శతజయంతి సందర్భముగా
దర్శనం పత్రిక నిర్వహించినకవితా నీరాజనమ్.

స్థితప్రజ్ఞులు భారతదేశ మాజీ ప్రథాని  పీవీ నరసింహారావుగారి శతజయంతి సందర్భముగా వారిని స్మరిస్తూ సమర్పిస్తున్న నా పద్య నివాళి.
౧. ఉ.  శ్రీమహనీయ వంశజులు, చెన్నుగ నీతని తల్లి దండ్రులా
ధీమతి రుక్నయున్ మరియు ధీమహితుండగు రామరావు కాన్.
పాములపర్తి వంశమున వర్ధిలు రుక్మిణి రంగరావులన్
ధీమహితుండు చేరెనట తీరుగ దత్తత పేర పీవియే.

౨. శా.  ప్రఖ్యాతంబుగ న్యాయశాస్త్రమును తా భాసిల్లగా నేర్చి స
ద్విఖ్యాతిన్ మహనీయ మార్గచరుఁడై విశ్వంబునన్ గాంచగా
ముఖ్యుల్ కాంగ్రెసునందు చేర్చిరితనిన్ పూజ్యుండు రాణించగా
వ్యాఖ్యానించెను లోకమీతని ప్రభన్ బ్రహ్మాండమంచున్ భళీ!

౩. ఉ.  క్లేశమటంచెరింగియు విలేఖరిగా జయ మారుపేరుతో
నాశలు తీర న్యాయమును హాయిగ వ్రాయుచు కాకతీయమం
దాశిరుఁడయ్యె లోకమునకాప్తుఁడయెన్ మన పీవి. దానితో
దేశము కోరె నీతనిని దిక్కయి నిల్వగ పాలనంబుకై.

౪. సీ.  ఆంధ్రరాష్ట్రమునకు నసమాన నేతయై ముఖ్యమంత్రిగ నయి పూజ్యుఁడయ్యె,
సంస్కరణంబులు చక్కగా నెలకొల్పి నయమార్గవర్తియై నడిపె ప్రజను.
భూసంస్కరణములన్ బూర్తిగా తెచ్చి సద్ భావనన్ జగతిని పాదుకొలిపె.
కాంగ్రెస్సు నందునన్ గౌరవ పదవులన్ దక్కించుకొని కేంద్ర దక్షుఁడయ్యె.
గీ.  కేంద్రమందున గలయట్టి  కీలక పద  వులనుచేఁబట్టి నడిపి దేవుఁడుగ నిలిచె
ఎదను చేపట్టినట్టి యే పదవికైన  ఘనతఁ గొలిపి తా చణకుఁడన్ ఘనతఁ గాంచె.

౫. ఉ.  దేశ ప్రథాన మంత్రిగ విదేశములేగుచు వారి భాషలో
లేశముకూడ దోషమది లేని విధంబుగ మాటలాడి సం
దేశములిచ్చి వారి మది దివ్యునిగా చిరకీర్తి గాంచుచున్,
శ్రీశుని సత్కృపామహిమచే పరిపాలన చేసె చక్కగా.

౬. సీ. పదునేడు భాషలు ముదమార నేర్చిన ప్రఖ్యాత పురుషుడు భవ్య పీ.వి.
స్పానిష్షు భాషలో చక్కగా మాటాడి క్యూబాప్రథానికే కొలిపె వింత.
విశ్వనాథులవారి వేయిపడగలు స హస్రఫణ్ పేరున ఖ్యాతి వ్రాసి
అల మరాఠీనుండి యబల జీవితమను యనువాదమును చేసి యలరె పీ.వి.
గీ.  వ్రాసి యిన్సైడరు నవల వాసిగాంచె గొల్లరామవ్వకథ వ్రాసె గొప్పగాను..
పెక్కు రచనలు బహుమతుల్ దక్కఁజేసె. శతజయంత్యుత్సవమువేళ సన్నుతింతు.

క. పీవీ నరసింహుని మది
భావించుచు స్ఫూర్తి గాంచి వరలగవలయున్,
జీవితమంతయు మహితులు.
నే వానికిప్రాంజలింతు నిర్మల మతినై..
నమస్కారం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.