గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జూన్ 2019, బుధవారం

రమ్మన్నన్ హరి యెట్లు వచ్చునిటకున్.

జైశ్రీరామ్.
జైశ్రీమన్నారాయణ
ఆర్యులకు శుభోదయమ్.

శా. హే దేవా! కనులార కానఁబడవా? హృష్టాత్ముగా చేయవా?
ఈ దీనుండు భవత్పదాబ్జ ములనాశించెన్ గనన్. వింటివా.
మోదంబున్ పదపద్మముల్ గనినచో ముక్తిన్ గనన్ నేర్తుగా.
మోదంబున్ కనిపించ భక్తతతి నిన్ పూజించుగా శ్రీహరీ.

ఉ. నీ పదపద్మపాళిని మునీశ్వరులైనను గాంచ నేర్చిరే?
మాపులు రేపులున్ వనజ మానదు నీపదసేవ లింక నీ
వేపగిదిన్ గనంబడగ నిచ్చటకున్ గనిపించవత్తువో
శ్రీపతీ! భావనంబుననె ప్రీతిని నిన్ గని తృప్తినందమా?

శా. అమ్మా! శ్రీహరి లోకరక్షకుఁడు నీవానంద సామ్రాజ్ఞివై
నెమ్మిన్నీ పతి పాద సేవనమునే నిత్యంబటుల్ చేయుటన్
రమ్మన్నన్హరి యెట్లు వచ్చునిటకున్ ప్రార్థించినన్. నీరజా!
మమ్ముంగావగ పంపుమమ్మ హరినే. మాపుణ్యముల్ పండనీ.

జైశ్రీమన్నారాయణ
భక్తజనవిధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమే మనపుణ్యము గ్రహించి ఆదేవి హరిని పంపించాలి కదా చాలా బాగుంది .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.