గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జూన్ 2019, సోమవారం

ప్రశంసలో చమత్కారం! శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారు.

జైశ్రీరామ్.
ప్రశంసలో చమత్కారం! శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారు.
రాయలనాడు యెవరో అజ్ఙాతకవి కృష్ణరాయలను ప్రశంసిస్తూ అద్భుతమైన ఒకపద్యం చెప్పాడు. అదిమీకోసం చిత్తగించండి!
చం: పెనిమిటి చేయు పుణ్యజన పీడన వృత్తియుఁ, దండ్రి భంగమున్ ,
దనయు ననంగ భావమును, దమ్మునికార్శ్వముఁ జూచి, రోసి, స
జ్జన పరిరక్షు,శౌర్యనిధిఁ జారుశరీరు, కళాప్రపూర్ణు, న
వ్వననిధికన్య చేరె; జితవైరి నికాయుని గృష్ణరాయనిన్ !
భావం: లక్ష్మీ దేవికి విరక్తి కలిగిందట! దేనికి? తనభర్త 'శ్రీమహావిష్ణువుచేసే రాక్షస సంహారానికీ, (పుణ్యజనులంటే రాక్షసులు, -సజ్జనులు అర్ధాంతరం ) తనతండ్రి పొందిన యవమానానికీ , (వారిధికట్టే సమయంలో దారినీయకుంటే రాముడు బాణప్రయోగానికి సిధ్ధమైనాడు. అప్పుడు సముద్రుడు భయపడి రాముని ముందు చేతులు జోడించి నిలబడినాడు అదీఅవమానం; సముద్రుడు నిలకడ లేనివాడు కెరటాలు ఉవ్వెత్తున లేచి విరిగి పడుతూ ఉంటాయి అదీభంగపాటు అర్ధాంతరంలో)
ఇక కొడుకు మన్మధునకు శరీరమే లేకపోయె. విచారమేగదా? సోదరుడా రోజురోజుకీ చిక్కిపోతూ ఉంటాడు. ఒకపక్షం రోజులు పెరగటం, మరోపక్షానికి తరగటం. ఇదీవరస! పాపం లక్ష్మీదేవికి అదోచింత. ఇన్నిరకాల విచారాలతోటి విసిగిపోయి, పరాక్రమశాలీ, మనోహరశరీరుడు ,కళావేదియు , శత్రువిజేతయు , అయిన కృష్ణరాయని చెంతకు లక్ష్మీదేవి వచ్చి
చేరినదట!
శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
బాగుంది వ్యాజస్తుతి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.