గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జనవరి 2018, మంగళవారం

౩వ పద్య పక్షమ్. వృద్ధాప్యం కష్ట సుఖాలు. రచన. చింతా రామ కృష్ణా రావు.

జై శ్రీరామ్.
౩వ పద్య పక్షమ్. వృద్ధాప్యం కష్ట సుఖాలు.
రచన. చింతా రామ కృష్ణా రావు.
ఆటవెలది త్రయ గర్భ సీసము.
శ్రీ రమా రమణుఁడ! శేషశాయిగనుండి - చింత చేయ వసలు జీవితాన
మానవునిఁగ బుట్టి మనుజుఁడెంతటి బాధ - లనుభవించుననుచు, కనవు కృష్ణ.
బాల్య యౌవనములు పరుగిడి పోవగా - వృద్ధ దశకుఁ జేర విస్తు గొల్పు
చింతలెల్ల మదిని చీకాకు పరచెడు. - శాంతి మార్గమగుము చాలు కృష్ణ!
.వె. కన్నులుండియు నిను మిన్నకుందురు కనన్, - కంటి చూపు తొలఁగ కలత చెంది,
కన్నతండ్రివగుచు కనులలో నిలువుమా - యనుచు నేడ్తు రపుడు వినుము కృష్ణ!    1.
ఆటవెలది త్రయ గర్భ సీసము.
పిన్న వయసులోన కన్ను గానక, నాడు - చేయరాని పనులు చేసి యుండి,
తనువు మాయు సమయమున నిన్నుఁ దలచినన్ - బాప ఫలితమెటులఁ బాయు కృష్ణ!
వృద్ధ వయసు తానె పిలవకనే వచ్చి - పైనఁ బడుచునుండ బాధపడుచు
బిడ్డలతని బాధ పెడచెవిన్ బెట్టుటన్ - నడ్డి విరిగినట్లు నడచు కృష్ణ!
.వె. దేహమతని మాట తిన్నగా వినకుండ - మూలఁబడుచు నుండ కూలిపోవు.
వృద్ధుఁడపుడు జ్ఞాన వృద్ధుఁడై చింతించి - నీవె దిక్కనునయ. నిజము కృష్ణ!    2.
ఆటవెలది త్రయ గర్భ సీసము.
దాన గుణము వీడి, దాయాదులను వీడి - ధనము నిలువఁ జేసి తనయులకిడ,
వారలతని వీడి పైదేశములనుండ - చూడరంచు వగచుచుండు కృష్ణ!
పుణ్యమొసగు కార్యములు జేయనైతినే, - సన్యసించనయితి ధన్యుఁడనవ                                          
జన్య జనక మర్మజంబగు మూర్ఖతన్ - తప్పు చేసితినని తలఁచు కృష్ణ!
.వె. ప్రగతిఁ గొలుప పద్య పక్షాన నిలనైతి - రచన చేసి కృతిని ప్రబలనైతి
ఇప్పుడేమి చేతు నీశ్వరా యని, వృద్ధు - డేడ్చుచుండి కరము మోడ్చి కృష్ణ!,     3.
శా. మా యానందము కోరి మేము సుతులన్ మానుండి దూరంబుగా
శ్రేయంబిచ్చెడి పాఠశాలలనుచున్ చేర్పించ, వారచ్చటన్
మాయందున్ మమకారమున్ విడిచి సంభావించుటే మానిరే!
మా యీ దుస్థితి హేతువయ్యదె కనన్. మా కర్మ మా దోషమే.     4.
శా. ఈ వృద్ధాశ్రమ జీవితంబు కనఁగా హేయంబు. దౌర్భాగ్యమున్.
జీవంబుండగ పాతిపెట్టుటిది. చూచేవారికిన్ జాలియౌన్.
నావారైన సుతుల్, సుతల్ మనుమలున్ నా వారలున్ కానమిన్
జీవంబున్న శవంబులైతిమనుచున్ జీవింత్రు కృష్ణా! వ్యధన్.      5.

స్వస్తి.
జైహింద్.
Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా బాగుంది .అక్షర సత్యాలను చక్కగా వివరించారు. ధన్య వాదములు

bavaji yerramilli చెప్పారు...

సరస్వతీ కటాక్షం గురువర్యులకు నమోనమః !!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

బావాజీగారూ! ధన్యవాదాలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.