గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఆగస్టు 2015, గురువారం

తార్నాకలో శ్రీమాన్ జెజ్జెల కృష్ణ మోహనరావుగారిఉపన్యాసం అద్భుతం.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! తే.01-08-2015 న సాయంత్రం 4 గంటలనుండి 6 గంటల వరకు తార్నాకలోని మీ సేవ ప్రక్కనున్న ప్లెడ్డింగ్ లైట్స్ సంస్థలో మన ప్రియ మిత్రులు అమెరికా వాస్తవ్యులు సుప్రసిద్ధ ఛందశ్శాస్త్రార్ణవసదృశులు అయిన శ్రీమాన్ జెజ్జెల కృష్ణ మోహన్ గారు ఛందశ్శాస్త్రంపై అద్భుతమైన వివరణాత్మక ఉపన్యాసం ఇచ్చారు. ఆ సభకు అనేకులు ఛందశ్శాస్త్రాభిలాషులు వచ్చారు.
వారి ఉపన్యాసం శ్రోతలలో నూతనోత్సాహం పుట్టించి ఛందశ్శాస్త్రాభిరుచి పెంచింది.
వారి ఉపన్యాసానికి ప్రతిస్పందిస్తూ నేను వారినుద్దేశించి కంద గీత గర్భ చంపకమాలను అప్పటికప్పుడు వ్రాసి సభాముఖంగా వారికి వినిపించి నా ఆనందాన్ని తెలియజేశాను. వారు ఎంతగానో సంతోషించారు.
కంద గీత గర్భ చంపకమాల
గుణ గణ పద్ధత్తుల్ కలుగు గుంభన ఛందము, గాన రీతి, భా
వన నియతుల్, మదిన్ నిలిపి వర్ధిలఁ జేసిరి నేర్పు తోడ. స
ద్గుణ గణ ధీరుఁడా! ప్రబల కల్పన మీదగు ప్రాభవంబులన్
కననగునేమహా కవిగ గాంచెద మిమ్ముల గణ్య మూర్తిరో!
చంపక గర్భస్థ కందము
గణ పద్ధత్తుల్, కలుగు గుం
భన ఛందము, గాన రీతి, భావన నియతుల్,
గణ ధీరుఁడా! ప్రబల క
ల్పన. మీదగు ప్రాభవంబులన్కననగునే.
చంపక గర్భస్థ గీతము.
కలుగు గుంభన ఛందము,గాన రీతి,
నిలిపి వర్ధిలఁ జేసిరి నేర్పు తోడ.
ప్రబల కల్పన మీదగు ప్రాభవంబు.
కవిగ గాంచెద మిమ్ముల గణ్య మూర్తి
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ జె.కె. మొహన్ రవుగారి ఛందస్సు పై ఉపన్యాసమును వినగలిగిన అదృష్ట వంతులకు వేవేల అభినందనలు .నాకు వారి రగడలు
హిమము కురిసెడి ఋతువు ఇప్పుడు
సుమము విరియగ చూడమిప్పుడు
ద్యుమణి వేడికి దూరమిప్పుడు
ద్రుమములకు పెడ రూపమిప్పుడు
చాలా ఇష్టము .ఇలా చాలా చదివగల అదృష్టం లభించింది
వారిపై సోదరులు చిరంజీవి చింతా వారి గర్భ గీతములు అత్యద్భుతములు .మాకందించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.