గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, నవంబర్ 2012, శుక్రవారం

సాహిత్యాభివృద్ధికి పద్యం ఉపయోగపడిందా?లేదా? పద్య కవిత పోటీలో మన సోమార్క గారికి ప్రథమ బహుమతి

జైశ్రీరామ్.
సాహితీ పిపాసులారా! సుమనర్నమస్సులు.
ఇప్పుడు  రాష్ట్ర స్థాయి పద్య రచన పోటీలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకొనిన శ్రీ అర్క సోమయాజిగారిని గూర్చి తియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. వారిని మనము హృదయ పూర్వకంగ అభినందిద్దాము. వారికి ఈ బహుమతి కైవసమైన వార్తను వారి మాటలలోనే చూద్దాము.
అయ్యా! నమస్కారాలు!
ఇటీవల సాహిత్యాభివృద్ధికి పద్యం ఉపయోగపడిందా?లేదా?అని ప్రశ్నిస్తూ,ఒక సంస్ఠ పద్య పోటీ నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని నా సమాధానాన్ని "పద్య శైలూషి "అనే పద్య ఖండికను పద్య కవిత రూపంలో పంపించాను.దానికి రాష్ట్ర స్తాయి పద్య కవితలపోటిలో ప్రధమ బహుమతి లభించినట్లు తెలిపారు.ఆ కార్యక్రమం "ఒంగోలు"లో ఏర్పాటు చేశారు.24/11/2012నబహుమతి అందుకోవడానికి మరియు అదే రోజు కవి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనడానికి రేపు రాత్రి బయలుదేరుతున్నాను.మీ ఆశీర్వాదములు కోరుతున్నాను.
ఆ పద్యాలను ఇక్కడ మన అంతర్జాల వీక్షలకు కూడా అందజేస్తున్నాను. ఇట్లు మీ సోమార్క
తేనియలూటలూరు,తియ తియ్యని దేశిపదాల సౌరు,స
ద్గాన గుణమ్ము,తెల్గు నుడికారగణమ్ములనొప్పు,వాక్యవి
న్నాణములున్,మనోజ్ఞ కవనమ్ముకు పెట్టని సొమ్ములౌనుగా,
జానుతెనుంగుపద్యముల జాతికి సాటికవిత్వమున్నదే?
పదముల్ పేర్చి,బిగించికూర్చి,రసవద్భావమ్ములన్ పేర్చి,సొం
పొదవన్, శైలియు,వృత్తి,రీతి,రసవత్పాకాది,మేలౌ గుణా
భ్యుదయోల్లాస, కవిత్వ రూప నిగమ ప్రోక్తార్ష విజ్ఞాన సం
పదయై భాసిలు,తెల్గు భాషకు,మహద్భాగ్యంబు!పద్యంబెగా! 
నన్నయనాటి నుండి,యధునాతన రీతులు నేర్చుకొంచు,నె
న్నెన్నొ కవిత్వ ప్రక్రియలనింపగు,రూపుల దిద్దుకొంచు,న
భ్యున్నతిగొంచు,కావ్యవిభవోజ్వలమౌచును,తెల్గుసాహితిన్
యెన్నగ!హృద్య పద్యమది!యింపగు!తెల్గు సమృద్ధినందగన్.
పద్యము ప్రాతవడ్డదని,భావన సేయుటయేమొ గాని?!త
ద్విద్య సహస్ర రూపిణిగ,విస్తృత రూపము దాల్చియొప్పె,న
య్యద్యతనాంధ్రసత్కవులు,యాధునికత్వ,కవిత్వరూపమౌ,
హృద్య కవిత్వ రీతులకు,నింపగు మూలము!గాదనందురే?
సరస పద ప్రహేళికల జల్లిన భావరజమ్ముతో,నలం
కరణలనొప్పు వర్ణనల గప్పిన,యక్షర రధ్యపైని,మా
సరస కవీశు లందముగ,చక్కని పద్య రధమ్ము గూర్చిరా
దరమున,త్రిప్పినారలు!వధాన విధాన పధాన నెల్లెడన్.
నన్నయ సంస్కృతాంధ్ర సుగుణమ్ములనొద్దికదిద్దితీర్చి,వి
ద్వన్నుతుడయ్యె;నూతన విధానము నేర్పెను సోమయాజి,రూ
పోన్నతిజేసె,దేశికవితోద్యమసారధి;సోముడున్ పదా
ర్వన్నెల శొభగూర్పగను!పద్యము జానగు శోభ నొప్పెడిన్.
చింతింపంబనిలేదు!పద్యకవు లక్షీణ ప్రభావోన్నతిన్,
గొంతుల్విప్పుడు!పూర్వ వైభవము సంకోచమ్ముగా బొంద,మీ
వంతున్ సత్కృషిసల్ప,మేటి రసవత్పద్యమ్మనావద్యమై,
భ్రాంతుల్ దీర,రసజ్ఞశ్రోతృ జలధిన్ పర్వించు పద్యాపగల్.
డా.చంద్రశేఖరావధాని చేస్తున్న అష్టావధానంలో నిషిద్ధాక్షరి పృచ్ఛకులుగా శ్రీ సోమార్క..
చూచాము కదండి! ఈ సాహితీ ప్రయాణంలో శ్రీ సోమార్కగారు మరిన్ని విజయ బావుటాలెగరవేయాలని కోరుతూ వారిని ఆంధ్రామృతం ద్వారా మరొక్క పర్యాయము అభినందిస్తున్నాను. ఇక 
ఈ అంశముపై మీరూ మీ భావలకు పద్య రూపాన్ని కల్పించి ఆంధ్రామృత్ం ద్వారాపాఠకులకు అందజేయ గలరని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జైహింద్.
Print this post

13 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మైథిలీరామ్ ఇలాగన్నారు.
రాష్ట్రస్థాయి పద్య పోటీలలలో ప్రధమ బహుమతిని కైవసం చేసుకున్న ఆత్మీయ మిత్రులు సోమార్క గారికి హృదయపూర్వక శుభాభినందనలు.

మైథిలీరామ్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ మోహన్కిశోర్ శర్మ ఇలాగన్నారు.
నమస్తే శ్రీ సోమార్క గారు,

చాలా సంతోషం. శ్రీఅర్క సోమయాజి గారికి హృదయపూర్వక అభినందనలు. మీరు ఇలాగే తెలుగు సాహిత్యములో మరిన్ని విజయాలు సాధించి, బమ్మెర పోతనామాత్య వారిలా, శ్రీరామచంద్రప్రభువు యొక్క కృపకి పాత్రులై, భవిష్యత్తరాలకి మరికొన్ని మంచి తెలుగు పద్యాలు అందించాలని ఆశిస్తున్నాను.

మీ..
మోహన్ కిశోర్ శర్మ

Pandita Nemani చెప్పారు...

పద్య శైలూషి కి ఆ కవిత నల్లిన శ్రీ అర్క సోమయాజి గారికి శుభాభినందనలు. స్వస్తి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

వైద్యభూషణ శ్రీ లక్ష్మీనారాయణ సునీలు ఇలాగన్నారు.

శుభాకాంక్షలు అర్క సోమయాజి గారూ.
ధన్యవాదములు
వైద్యభూషణ లక్ష్మీనారాయణ సునీలు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

MJRశర్మగారు ఇలా వ్రాశారు.
నమస్కారం
కనుమరుగవుతున్న పద్య సాహిత్యానికి పట్టం కట్టినందుకు , ప్రతిభ చాటినందుకు శుభాభినందనలు

M.R .J. SARMA
marajosarma@gmail.com
9441318641. 8008551846

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Kకిరణ్ బాబు ఇలాగన్నారు.
పద్య పోటీలలలో ప్రధమ బహుమతిని కైవసం చేసుకున్న మిత్రులు సోమార్క గారికి హృదయపూర్వక శుభాభినందనలు.
Kiran Babu K

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పాలకొల్లు వంశీ ఇలాగన్నారు.
నమస్తే!
శ్రీ సోమార్క గారికి హృదయపూర్వక శుభాభినందనలు.
వంశీ కృష్ణ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాజశేఖరుని విజయ శర్మ ఇలాగన్నారు.
అభినందనలు సోమార్క గారు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీ సోమార్క గారికి హృదయపూర్వక అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

శ్రీ సోమార్క గారికి అభినందనలు.
ఈ పద్యాలను నా బ్లాగులో ప్రకటించడానికి అనుమతిని ఇవ్వ(ఇప్పించ)వలసిందిగా మనవి.
అన్నట్టు ఈనాటి మియాపూర్ కవిసమ్మేళనం విశేషాలను మీ బ్లాగులో ప్రకటిస్తున్నారు కదా!
ధన్యవాదాలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Arka Somayaji
ఇలా అన్నారు.
పిపీలికాన్ని గజంగా భూతద్దంలో చూపించి నా ఆనందాన్ని బ్లాగుమిత్రులందరికీ పంచిపెట్టిన విజయగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ,నాలో ఉన్న గోరంతని కొండంతలు చేస్తూ మునగ చెట్టెంకించి పడగొట్టే ప్రయత్నం చేస్తున్నా సర్వశ్రీ మైధిలీ రాం,మోహన కిషోర్,లక్ష్మీ నారాయన సునీల్ వైద్య,రామ జోగేశ్వర రావ్,వంశీ,వేద పండితులు రాజశేఖర్,ఇంకా ఎందరి గుండెల్లోనో గిరికీలు కొడుతున్న నేను వారందరికీ పేరు పేరునా శతసహస్ర నమోవాకాలతో వినమ్రతా కుసుమాంజలులు సమర్పించుకుంటున్నాను,ధన్యుణ్ణి.మరికొందరు మిత్రులు ఫోనులో అభినందనలను తెలియజాశారు.నిన్న కార్యక్రమ హడావిడి మరియు ప్రయాణంలో సరిగా సిగ్నల్ అందక కొందర్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే!మన్నించకోరుతూ,ముఖ్యంగా మా మంచి మనిషి గారికి నా క్షమాపణలు.ఫోనులో సరిగా మాట్లాడలేనందుకు.
ధన్యవాదాలతో,
నమస్సులతో,
ఎప్పటికీ మీవాడు,
Arka Somayaji

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Suresh Babuఇలాగన్నారు.

హరిః ఓం.

పద్యం పరా భాట్టరిక నైవేద్యం
సరసులకది మత్తెక్కించే మద్యం
పామరులకది కొనసాగే సేద్యం
సర్వులకది అనుభవైకవేద్యం

పద్యం పోటి విజేత సోమార్క గారికి అభినందన తెలుపడం హృద్యంగమం
Suresh Babu

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పద్యం కవిత పోటీ బహుమతి గ్రహీత శ్రీ సోమార్క గారికి అభినందన మందారాలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.