గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, నవంబర్ 2012, శుక్రవారం

అత్యద్భుతంగా తుని గ్రంథాలయంలో జరిగిన సాహితీ సభ.

జైశ్రీరామ్.
పండిత నేమాని వారు
సాహితీప్రియులారా!
14వ తేదీన ఆంధ్రామృతము ప్రకటించిన విధముగా
తే.15-11-2012ని తూర్పు గోదావరి జిల్లా తుని గ్రామంలో గల శాఖా గ్రంథాలయములో పండిత నేమాని రామజోగిసన్యాసిరావుగారి ఉపన్యాస కార్యక్రమము ఆనందముగా సాగినది. వారు 1 గం. 30 ని.లు మాటాడినారు.  శివానందలహరి ప్రాశస్త్యమును వర్ణించుచూ కొన్ని శ్లోకములకు విపులమైన వ్యాఖ్యను చేసినారు.
1.శ్రీమదాది శంకరులు శ్రీశైలములో రచించిన శివానందలహరి అను శతకమునుగూర్చి తెలియఁజేసినారు.  ఇందులోని 100 శ్లోకములు భక్తి మరియు జ్ఞానప్రబోధకములే తనియు,  దీని శైలి చాల సరళముగా నున్నదనియు,  అనేక విధములైన ఛందస్సులను సుగమనముతో సులభ గ్రాహ్యముగా రచించినారనియు,  ఇందు రూపక, ఉపమ, శ్లేష, ఉత్ప్రేక్ష మొదలైన అర్థాలంకారములు మరియు శబ్దాలంకారములు శోభిల్లుచుండుననియు వివరించినారు.
మరియు
2. తొలి శ్లోకములో శ్రీ శంకరులు ఆది దంపతులు, జగతికి తల్లిదండ్రులు, ఆది గురువులు అయిన పార్వతీ పరమేశ్వరుల తత్త్వమును వర్ణించుచూ వారికి ప్రార్థన చేసిన విధము అద్భుతమనియు,  2వ శ్లోకములో ఈ శివానందలహరీ ప్రవాహము యొక్క జననము, అది ప్రవహించుచున్న విధానము, దాని ఫలితమును వర్ణించినారనియు,  3వ శ్లోకములో శివతత్త్వమును సంగ్రహముగా చదువరులకు తెలియజేసినారనియు,భక్తి జ్ఞాన యోగములకు ఇదొక చక్కని కరదీపిక యనియు వివరించినారు.
ఈ సభను తుని సాహితీ సమితి వారు నిర్వహించిరి. సమితి అధ్యక్షులు అధ్యక్షత వహించిరి.
తుని ఛాంబర్ ఆఫ్ కామర్సు మాజీ కార్యదర్శి శ్రీ ఏలూరి శివకుమార్ గారు, మరియు శ్రీ ఈరంకి రామ సూర్యప్రకాష్ గారు గౌరవ అతిథులుగా పాల్గొనిరి.
శ్రీ ఈరంకి రామ సూర్య ప్రకాష్ గారు మరియు డా. ఎల్.ఎస్.యాజ్ఞవల్క్య శర్మ గారు శ్రీ నేమాని వారిని దుశ్శాలువతో సత్కరించిరి.
వందన సమర్పణతో సభ జయప్రదముగా ముగిసినది.
అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహక బృందానికి ఆంధ్రామృతం అభినందనలు తెలియజేస్తోంది.
జైహింద్.  
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ పండిత నేమాని వారి ప్రతిభ శ్లాఘ నీయం ,వారి రచనలు కొన్ని వారి స్వహస్త ముల మీదుగా పొంద గలగడం నా అదృష్టం .
సన్మాన సభలకు వచ్చి ఆనందించ గల అదృష్టం లేని నాలాంటి వారి , కళ్ళకు కట్టినట్టు వర్ణించిన శ్రీ చితా వారికి అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.