గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, నవంబర్ 2012, ఆదివారం

మనయేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః.

జైశ్రీరామ్.
విషయ వాంఛ అనే మొసలి మనస్సు  అనే ఏనుగును ఎలా లాగుతున్నాదో చూడండి.
శ్లో:-
మనయేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః.
బంధాయ విషయా సంగీ. ముక్త్యైనిర్విషయం స్మృతమ్.
ఆ:-మనసు కారణంబు మహనీయ ముక్తికిం
బంధ కారణంబు మనసె యగును.
బంధమొసగు విషయ వర్తిత చిత్తము
ముక్తబంధ యైన ముక్తినొసగు.
భావము:-
ఐహిక బంధములకైనా, ఐహికాతీత మోక్షమునకైనా మనస్సే కారణము. మనస్సు విషయాసక్తి కలిగి యున్నచో బంధనములు దానితోపాటు పెఱుగును. అదే మనస్సు నిర్విషయాసక్తమైనచో ముక్తిని పొందును.
మనము ఐహిక స్పృహ కలిగి ఉండవలెనే కాని అదే శాశ్వితమనే భ్రమకు దూరముగా నుండ వలెనని గుర్తుంచుకొన వలెను. సత్య స్వరూపమును, శాశ్విత స్వరూపమును తెలుసుకొని ఆముష్మికము వైపు మనసును మరలించ గలిగితిమేని దుఃఖాతీతులమై విషయ దూరులమై చిత్త శాంతితో ప్రశాంతముగ జీవింప సాధ్యమగును కదా!
జైహింద్. 
Print this post

1 comments:

Pandita Nemani చెప్పారు...

మనమే కారణమగు జీ
వుని బంధమ్ములకునేని ముక్తికినేనిన్
మనమను నక్రమె జీవుం
డను కరికిన్ వ్యథలు కూర్చు ననవరతంబున్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.