గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, నవంబర్ 2012, గురువారం

మేలిమి బంగారం మన సంస్కృతి 127.

జైశ్రీరామ్.
శ్లో:-
లాలనాత్ బహవో దోషాః  -  తాడనాత్ బహవో గుణాః.
తస్మాత్ పుత్రంచ శిష్యంచ  -  తాడయేత్ నతు లాలయేత్.
గీ:-
గారమును చేయ పెరుగును నేర వృత్తి.
తాడనముచేత పెరుగును ధర్మ వృత్తి.
కాన పుత్రుల, శిష్యులఁ ఘనులఁ జేయ
తాడనము చేత మలచుడు.ధన్యులగుడు.
భావము:-
పిల్లలను లాలించుట వలన అనేక దోషములు కలుగును. దండించుట వలన అనేక గుణములు కలుగును. కావున పిల్లలను శిక్షించ వలెనే కాని లాలించరాదు.
ఈనాడు మనము చూస్తున్నాము. పిల్లలను తల్లిదండ్రులు అతిగా ప్రేమిస్తున్నారు. అది తప్పక వాంఛనీయమే ఐతే ఆప్రేమ మితిమీరి అతిగా గారాబం చేస్తుండడంతో ఆ పిపిల్లల దౌష్టములను కూడా మంచిగానే భావిస్తున్నారు పాపం.
నిజంగా పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు చక్కని క్రమ శిక్షణలో పెరిగే మార్గాన్నే అనుసరించాలి. వారిని క్రమ శిక్షణలో పెట్టుట కొఱకు  అవసరమైన పాళ్ళలో సామ - దాన - భేద - దండోపాయాలను ప్రయోగించాలి వారి మీద.
గారము చెయ్యాలి. తప్పేమీ కాదు. ఐతే అతిగా గారాబము చేయుట చేటు కలిగిస్తుందని మాత్రం మరచిపో కూడదు.యువత సమాజంలో ఈ నాడు  సమస్యాత్మకంగా తయారవడానికి కారణము వాళ్ళ తల్లిదండ్రుల పెంపకములోని లోపమేనని గ్రహించాలి.కావున పెద్దలారా! చెప్పండి బుద్ధి మీ పిల్లలకి. తల్లిదండ్రులారా! పెంచండి మీ పిల్లలను చక్కని క్రమశిక్షణనేర్పుతూ.
జైహింద్.

Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

మిత్రులారా!
ఈ శ్లోకము భావము బాగుగనే యున్నవి. అవి పూర్వ సిద్ధాంతాలు. ప్రస్తుతము వానిని ఎవ్వరునూ సమర్థించుట లేదు. ప్రస్తుత పరిస్థితులను నేటి చట్టములను మనము పరిగణనలోనికి తీసుకొనవలెను కదా. స్వస్తి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రస్తుత పరిస్తితులలొ శ్రీ చింతా వారు చెప్పీన విధముగా కొంత వయసు వరకు పిల్లలను తల్లి దండ్రులు క్రమ శిక్షణ లొ ఉంచ గలరు .కానీ పెరిగే కొలది ఈ నాడు బయటి ఆకర్షణలు పెడ దారులు పట్టిస్తున్నాయన్నది నిజ మైన నిజం. గనుక పిల్లలే తమకి తాముగా ఆలోచనా పరిధిని పెంచుకుని మంచి మార్గాన్ని ఎన్నుకో గలిగితే ముదావహం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.