గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, నవంబర్ 2012, శుక్రవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 128.

జైశ్రీరామ్.
శ్లో:-
అభ్యాసానుసారీ విద్యా  -  బుద్ధిః కర్మానుసారిణీ.
ఉద్యోగానుసారిణీ లక్ష్మీః  -  ఫలం భాగ్యానుసారిణీ.
గీ:-
ఎంత అభ్యాసమును చేయ నంతె విద్య
కర్మకొద్దియె బుద్ధియు కలుగు నిజము.
లక్ష్మి ఉద్యోగమును బట్టి లభ్యమగును.
భాగ్యమును బట్టి కలుగును ఫలము కనుఁడు.
భావము:-
చేసిన అభ్యాసముకొద్దీ విద్య ప్రాప్తించును. బుద్ధి యనునది మన కర్మననుసరించి ప్రవర్తించును. చేయుచున్న ఉద్యోగము కొద్దీ ధనము ప్రాప్తించును. మనము పొందే ఫలితాలు మన భాగ్యముననుసరించియే యుండును.
జరామరణములు లేని వానివలె విద్యను ధనమును సంపాదించవలెనని చెప్పుకొన్న దానికి తగినట్టుగా నిరంతర అకుంఠిత సాధనతో విద్యనభ్యసించ వలెనే గాని, అలసత్వము పనికి రాదు. అప్పుడే కోరుకొన్న విద్యను పరిజ్ఞానమును పొందగలుగుదుము.
ఎవరెన్ని విధములుగ చెప్పినను మన ప్రవర్తన మన బుద్ధిననుసరించియే యుండును అట్టి బుద్ధికి మూలము మన నుదుట వ్రాయబడిన కర్మయే కాని వేరు కాదుకదా!
మనము చేసెడి ఉద్యోగమును బట్టియే ఆదాయము కూడా ఉండును. చిన్న ఉద్యోగమునే మనము చేయ దలంచినచో చిన్న ఆదాయమునే మనము పొందుట జరుగును. పెద్ద ఉద్యోగము చేయ గడంగితిమేని ఆదాయము కూడా పెద్దగనే ఉండును కదా!
మనమెంత కష్టించి పనిచేసినను దాని వలన వచ్చెడి ఫలితము మన యోగముపై ఆధారపడి యుండును. మనకెంత భాగ్యము చేరవలెనని వ్రాసి యున్నదో అంత ఫలమే మనకు చేరును. ఇందునిమిత్తము విచారించినను ప్రయోజనముండగు కదా! కర్మణ్యేవాధికారస్తే  -  మా ఫలేషు కదాచన. అన్నడు కృష్ణుఁడు భగవద్ గీతలో . అది మనము మరువరాదు కదా!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
" బుద్ధి కర్మానుసారిణి అన్న మాట అక్షర సత్యం . " ఇక పాత్ర ఎంతో ప్రాప్త మంతే " అన్నట్టు లభించిన దానికి తృప్తి చెందాలే తప్ప దురాశకు పోకూడదు కదా ? చాలా మంచి విషయాలను తెలియ జెప్పారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.