జైశ్రీరామ్.
అకుంఠిత దీక్షాతత్పర నిరాడంబర గాంధీ.
సోదర భారతీయులారా! ఈ రోజు అక్టోబరు 2వతేదీ. మోహన్దాస్ కరంచంద్ గాంధీ జయంతి.
తే.02 - 10 - 1869.ని గుజరాత్ రాష్ట్రం పోర్బందర్ లో పుతలీబాయి కరంచంద్ గాంధీలకు జన్మంచి, తల్లి చెప్పే కథలకు ఉత్తేజితుఁడై పరిపూర్ణమైన వ్యక్తిత్వమును సంతరించుకొని, పాశ్చాత్యులచేతిలో బందీయైన మాతృభారతిని శృంఖలా విముక్తురాలిని చేయుటకొఱకు అకుంఠిత దీక్షా తత్పరుడై తన ఆలోచనకు పదును పెట్టి అహింసాయుత కార్య సాధనకు నడుంబిగించి, సత్యాగ్రహము అనే ఆయుధమును కనుగొని, తద్వారా కృతకృత్యుఁడయ్యాఁడు.
తే.30 - 01 - 1948. ని సైద్ధాంతిక విభేదాల కారణంగా నారాయణ ఆప్టే సహకారంతో నాథూరాం గాడ్సే తుపాకీతో కాల్చాఁడంతో గాధీ స్వర్గస్తుఁడయ్యాడు.
భారత జాతిపిత గా, మహత్మగా, బాపూజీగా కీర్తింపఁబడిన గాంధీ సిద్ధాంతాలను వల్లెవేస్తూ మేం గాంధీవాదులం గాంధేయులం అంటూసమాజంలో మనకు అనేకమంది కనిపిస్తూ ఉంటారు.
పైన నిరాడంబరుఁడైన గాంధీజీని ఫొటోలో చూడండి. ఎంత నిరాడంబరుఁడో!
తన భజముపై ఒక కండువాతో ఉండే గాంధీకి ఒకచోట ఆచ్ఛాదనకు వస్త్రం లేక సిగ్గుతో కుంచించుకుపోతున్న ఒక మహిళ కనిపించింది. గాంధీ ఆమె దుస్థితికి చలించిపోయి తన భుజముపై ఉన్న కండువాను ఆమెపైకి విసిరేసాఁడు. భారత దేశములో గల ప్రజలందరూ సమానంగా వస్త్రాలు వేసుకుంటే ఒక్కొక్కరికి వేసుకోవడానికి అంగ వస్త్రం మాత్రమే లభిస్తుంది అని గాంధీ భావించి, ఆనాటి నుండి అంగవస్త్రం మాత్రమే ధరించేవాఁడు.అంతటి నిరాడంబరునియొక్క, అంతటి ఆదర్శజీవి యొక్క జీవితం నుండి గ్రహించవలసిన సల్లక్షణాలకు అంతేది? వాటిని గ్రహించి ఆచరించగలిగే సాహసమేది మనలో? ఈ గాంధేయులలో.
ఆ మహాత్ముని సిద్ధాంతాలలో మంచి ఉన్నది అనుకుంటే గ్రహించి ఆచరించే ప్రయత్నం చేయటం మన కర్తవ్యం. అతనికి ఒక పూలమాలవేయటంతోనో, ఘన నివాళులర్పించటంతోనో మన బాధ్యత తీరిపోయింది అనుకుంటే ఆపని మాత్రం ఎందుకు చేయాలి? వద్దు. లోకాన్ని మభ్యపెట్ట వద్దు. చేస్తే మనస్ఫూర్తిగా గాంధీ ఆదర్శాలను ఆదరించి, అనుసరించి ఆచరించ గలగాలి. అదే సరైన నివాళి గాంధీజీకి.
జై హింద్.
1 comments:
జేజేలు:
జేజే గాంధి మహాత్మ! సత్యనిరతా జేజే అహింసావ్రతా!
జేజే భారత మాతృ శృంఖల హరా! జేజే పవిత్రాశయా!
జేజే నాయక శేఖరా! శుభకరా! జేజే నిరాడంబరా!
జేజే యంచు ఘటింతు నంజలినిదే స్నిగ్ధాంతరంగమ్మునన్
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.