గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, అక్టోబర్ 2012, గురువారం

జై జగన్మాతా. జైజై జగన్మాతా!

జైశ్రీరామ్.
సహృదయ సామాజికులారా!
జగదంబధ్యానంలో తాదాత్మ్యత పొందుతూ భక్తి పారవశ్యంలో ఉఱ్ఱూతలూగిపోతూ ఆ జగన్మాతను కొలిచి, ఆతల్లి కృపను పొందిన మీఅందరి పాదములకు నా అభివందనములు.
యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్తితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై  నమోనమః
అంటూ కనిపించే ప్రతీ స్వరూపంలోను జగదంబనే కంటూ, భక్తి పారవశ్యంతో పూజించాము. నవరాత్రులు నిన్నటితో పూర్తి కావటంతో దీక్షను ముగించుకోవటం కూడా జరిగి పోయింది. ఇక ఇప్పుడు చేయదగిన పని ఏమిటై ఉంటుంది?
ప్రతీ స్త్రీ మూర్తినీ జగన్మాతగా  ఈ పది రోజులూ కన్న మన కళ్ళు మన భావన, మన మనో నేత్రము ఇటుపైన కూడా అదే సాధన చేస్తూ ప్రతీ అణువునందూ, ప్రతీ క్షణమునందూ సంచరిస్తూ ఉండే ఆ జగన్మాతను నిరంతరమూకొలుస్తూ ఉండాలి కదా! ఆ విధంగా చూచుట కొఱకే గడిచిన పది రోజులు చేసిన సాధన అని మనం గ్రహించాలి కదా? మరి అలా గ్రహించి అలా నడచుకోవాలి కదా? మనమల్లాగే నడచుకోలేకపోతామా?
ప్రతీ అణువునందూ, ప్రతీ స్త్రీ మూర్తులలో ఆబాల గోపాలమునందూ ఆజగన్మాతనే ప్రత్యక్షం చేసుకొంటూ, కదలాడే జగదంబ దర్శనంతో పులకరించిపోతూ నిజమైన జ్ఞాన పరిణతి పొందిన సిద్ధులమై ప్రవర్తించేలాగ చేయమని ఆజగన్మాతనే వేడుకొంటూ, ప్రతీ స్త్రీ మూర్తియెడల ఆ జగన్మాత యొక్క తేజో మూర్తినే కనుగొందుము గాక.
ఆ జగన్మాత శుభాశీస్సులనందుదుము గాక.
జై జగన్మాతా.
జైజై జగన్మాతా.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవును మంచి విషయాన్ని తెలియ జెప్పారు.పట్టుదలతో ఆచరిస్తే సాధించ లేనిది ఏమీ లేదు. మన మనసు మన చేతిలోనె ఉంది. మంచి నడవడికను అలవరచు కొంటే మనుషులు ఋషులౌతారు. ఆ దేవి కటాక్షం లభిం చాలని కోరుకొందాం ధన్య వాదములు

Pandita Nemani చెప్పారు...

సకల భూతమ్ముల జనని రూపమ్ముగా
....నే తల్లి సతము పోషించు చుండు
సకల భూతమ్ముల శక్తి రూపమ్ముగా
....నే తల్లి తగు బలమిచ్చు చుండు
సకల భూతములలో చైతన్య రాశిగా
....నే తల్లి సతము భాసించు చుండు
సకల భూతములలో జ్ఞానస్వరూపగా
....నే తల్లి సద్గతు లిచ్చు చుండు
నామె యఖిలాండకోటి బ్రహ్మాండ జనని
ఆది మధ్యాంత రహితయౌ యాదిశక్తి
ఆమె తత్త్వమున్ ధ్యానించి యాదరమున
పరవశించుచు గూర్తును ప్రణతి శతము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.