గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, అక్టోబర్ 2012, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 123. నాలుక తెచ్చిపెట్టే మంచి చెడ్డలు.


జైశ్రీరామ్.

శ్లో:-
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః జిహ్వాగ్రే మిత్రబాంధవః
జిహ్వాగ్రే బంధన ప్రాప్తిః జిహ్వాగ్రే మరణం ధ్రువం.
క:-
నాలుక మూలము లక్ష్మికి. 
నాలుక సద్బంధు మిత్ర నవనాదులకున్
మూలము. బంధన ప్రాప్తికి
నాలుక మూలము. మరణము నాలుక తెచ్చున్.
భావము:-
లక్ష్మీ ప్రాప్తికి నాలుకయే మూలము.  మిత్రులు, బంధువులు కలుగుటకు కూడా నాలుకయే కారణము. బంధనాదులు ప్రాప్తించుటయు నాలుక వల్లనే జరుగును. తుదకు మరణ హేతువు కూడా నాలుకయే అనుటలో ఏమాత్రమూ సందేహము లేదు. 
అనగా మనము పొందే ప్రతీ ఫలితమునకు మూలము మనము మాటాడే మాటయే. మనము మాటాడడానికి ముఖ్యమైన ఆధనము నాలుకయే.  కావున ఆన్నిటికీ మూలము నాలుకయే  అగునని ఎఱుంగ వలయును. మనము పొందికగా అందముగా వినువారికి సంతోషము కలిగించునట్టులుగా మాటాడవలెనని గ్రహింప వలెను.
జైహింద్.
Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

మిత్రులారా! రసనేంద్రియము (నాలుక) యొక్క వ్యవహారములు 2 విధములుగా మానవునకు మేలు గూర్చుచు నుండును.

రసనమ్మే వరమై ష
డ్రసముల నందించి గూర్చు ప్రమదము, నటులే
రసనమ్మే వాఙ్మహిమము
ప్రసరింపగ జేసి ప్రతిభ రాజిల చేయున్

స్వస్తి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నాలుక మూలము మనిషికి
ఏలికలకు జగతి నంత నేలెడి విధమున్ !
లాలించగ పసి వారిని
పాలించగ పరమ ప్రీతి పండిత వరులన్ !

నమస్కారములు చాలా ముఖ్య మైన ఇంద్రియములను గురించి వివరించారు ధన్య వాదములు

తమ్ముడూ ! సరదాగా వ్రాసాను తప్పులు ఉంటే ఏ ముందీ ? చెరి పెయ్యడమె !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.