గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, అక్టోబర్ 2012, శుక్రవారం

ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాల, విజయనగరం, పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనము.

జైశ్రీరామ్.
సత్ సంప్రదాయ సాహితీ ప్రియ బంధువులారా!
నేను సన్మిత్రులతో కలిసి, సద్గురుదేవుల సుశిక్షణతో ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాలలో 1968 - 69  నుండి 1971-72 వరకు భాషా ప్రవీణ అభ్యసించి యుంటిని. ఆ విద్యాభ్యసన సత్ ఫలముగా ఉపాధ్యాయ ఆచార్య పదవులు చేఁబట్టి సుమారు35 సంవత్సరములు బోధనా వృత్తిలో మమైకమై జీవనము విద్యార్థులమధ్య సాగించితిని.2008 జూన్ మాసాంతమున పదవీ విరమణ చేసి యున్న నాకు హృదయంలో చదువుకొనిన నాటి గుర్తులు లీలగా ఊగులాడుతున్నాయి.
ఐతే విజయ నగర వాసులైయున్న మా సతీర్థులు, మిత్రులు కొందరు పూర్వ విద్యార్థుల సమ్మేళనము గురు పూజ అనే మహాద్భుతమైన కార్యక్రమమును తే.07 - 10 - 2012 న  చేయ తలపెట్టి నాకు ఆహ్వానము పంపినారు. ఈ కార్యక్రమము చేయుచున్నారన్నంతనే నామనసు ఎంతగానో పొంగిపోయింది. మాకు జ్ఞాన భిక్షను పెట్టిన అలనాటి గురుదేవులను సేవించుకొనే సద్భాగ్యం నాకూ కలిగినందుకు,  హృదయంలో హృదయంగా మెలిగిన అలనాటి మిత్రులందరినీ ఒకేచోట ఒక్క సారి కలుసుకొనే భాగ్యం కలిగినందులకూ నాకెంతో ఆనందంగా ఉంది.ఈ మహదానందాన్ని నాలో దాచుకోలేక మీకూ పంచుతున్నందుకు నన్ను అన్యధా భావించకండి.
ఏ జన్మాంతర సద్గుణాళి ఫలమో యీ జన్మలో కల్గెనే!
తేజోరాశిగ నిల్చిలట్టి గురులన్ దీపించు జ్ఞాన ద్యుతుల్
రాజా సంస్కృత బోధనాలయమునన్ బ్రఖ్యాతిగా లభ్యమై
మా జన్మల్ తరియింపఁ జేసెను కదా! మా భాగ్యమే భాగ్యమౌన్.
మేమీ ప్రాంగణమందు సంచరిలుచున్ మేలైన సద్భావికిన్
నీమంబొప్పగ విద్య నేర్చితిమి సన్మిత్రాళితో గూడి. మా
క్షేమంబెప్పుడు చూచినారు గురువుల్, శ్రీశేషశాయాదులున్.
మేమాస్దద్గురు పాదదర్శనమునన్ మేల్గాంచగా కోరుచున్----
సోమేశ్వరాది మిత్రులు  -  ప్రేమామృత మొలుక మరల విద్యాజననిన్
మేమెల్లఁ గలియఁ బిలిచిరి  -  క్షేమంబులు తెలియ, గురుల సేవింప నటన్.
ప్రభుత్వ మహా రాజా సంస్కృత కళాశాల ప్రాంగణము.
ప్రభుత్వ మహా రాజా సంస్కృత కళాశాల ముఖ ద్వారము.
విద్యార్థులకు అన్నార్తిని పోకార్చే శ్రీసింహాచలవరాహ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానముసత్రవు.
కళాశాలలో తీర్చి దిద్దఁబడిన కొందరు సాహితీ మూర్తులు
అలనాడచ్చట విద్య నేర్చితిమి.  స్నేహార్ద్రంపు చిత్తంబులన్
నిలిచెన్ బ్రేమ సుమాధురుల్. గతములన్ నేడిట్లు మేల్కొల్పుచున్
కలగా నిల్చిన నాటి గుర్తు లెదుటన్ కన్పించు నన్నంతనే
తులలేనట్టి ముదంబు తోడ నెదయే తూలెన్ మనోజ్ఞంబుగా.
ఎంతట తెల్లవారునని, ఎప్పుడు మిత్రులఁ జేరుదంచు క
వ్వింతలతోడ నామనసు వేగిరపెట్టుచు నుండె నద్దిరా!
ఇంతటి లౌల్యమా మదికి? ఏమని చెప్పుదు నాటి మిత్ర, స
ద్భ్రాంతిగ నిల్చినట్టి గురుపాద సుదర్శన భాగ్యమెన్నుచున్.
సరే ఇంత వయసొచ్చినా నా ఆరాటంమాత్రం అంతా యింతా కాకపోవటం నాకు వింతగా ఉన్నా ఇది మాత్రం యదార్థం. సరే ఎల్లుండి జరుగబోయే మాపూర్వ విద్యార్థుల సత్సమ్మేళనము గురుదర్శనానుభూతి మున్నగు విషయములను నేను ఈ కార్యక్రమానంతరం పంచగలను. విజయనగరం వెళ్ళి వస్తానండి మరి. నమస్తే.
జైహింద్.
Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

అయ్యా శ్రీ రామకృష్ణా రావు గారూ! శుభాశీస్సులు.
బ్లాగులో మీ ప్రకటన చూచేక మీరు విజయనగరమునకు వచ్చుచున్నారని తలచి సంతోషించేను. మిమ్ము, మిత్రులు శ్రీ పంతుల జోగారావు గారిని, మాన్యులు మానప్రగడ వారిని, ఎ. గోపాలరావు గారు మొదలైన వారిని కలుసుకొని ఆనందించేను. సుమారు 300 మంది పూర్వ విద్యార్థుల సమ్మేళనము - ఊహకు అందని జనము వచ్చేరు. కొన్ని ఇబ్బందుల వలన కార్యక్రమము ముగిసే వరకు ఉండలేకపోయేను. ఎక్కడి కక్కడే సంతోషము. స్వస్తి.

Kottapali చెప్పారు...

చాలా బావుంది మాస్టారు. పోయినేడు మీ యింటికి వచ్చే ముందు వరంగల్లో మా కాలేజి మా బేచి రజతోత్సవ వేడుకల్లో పాల్గొని వచ్చాను. మీ విశేషాలు కూడా వెళ్ళి వచ్చి చెప్పండి మరి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.