గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, అక్టోబర్ 2012, మంగళవారం

శ్రీ దేవీ నవరాత్రులు సందర్భముగా పాఠకాళికి శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
వందే లోక మాతరమ్.
ఆదిపరాత్పరాకృతి, మహాద్భుత మూలవిరూప శక్తి, సం
పాదిత సర్వసృష్టి యుత సత్వ రజస్తమపూర్ణ తత్వ, సం
వేదిత భక్తగణ్య పరివేష్టిత సన్ముని, లోక రక్ష, స
మ్మోదము తోడ మిమ్ములను ముద్దుగ చూచుత దేవి యెల్లెడన్.
జైహింద్.
Print this post

4 comments:

Pandita Nemani చెప్పారు...

ఓ దేవీ! పరమేశ్వరీ! భగవతీ! ఓ వ్యాఘ్రరాడ్వాహనా!
ఓ దేవేంద్ర ముఖార్చితా! మునినుతా! ఓ శంభు ప్రాణేశ్వరీ!
ఓ దీనావన! దైత్యనాశిని! ఉమా! ఓ సర్వ యోగప్రదా!
ఓ దుర్గా! జననీ! నినున్ గొలుతు నో ఓంకార నాదాత్మికా!

Pandita Nemani చెప్పారు...

శ్రీసదాశివ మనః శృంగార సుమవన
....సీమలో విహరించు భామ యెవరు?
సర్వలోకమ్ములో సర్వశోభాకర
....పురములో నివసించు తరుణి యెవరు?
వివిధ బ్రహ్మాండాల వెలుపల లోపల
....రాజిల్లు చైతన్య రాశి యెవరు?
అఖిల భూతమ్ముల కంతరంగములలో
....జ్యోతియై వెలుగొందు మాత యెవరు?
సర్వ శక్తి స్వరూపిణి సరసహృదయ
సర్వలోక విధాయిని శాంతరూప
రాజరాజేశ్వరీదేవి ప్రణవమయిని
ధ్యానమొనరించి భక్తితో నంజలింతు

Pandita Nemani చెప్పారు...

శ్రీ భారతీ! వేదవేదాంత తత్త్వార్థ తేజోవతీ! సర్వ భాషా విశేషాది రత్నాఢ్య సౌవర్ణ భూషాన్వితా! రమ్య సంగీత సాహిత్య ముఖ్యాద్భుతోద్యాన వాటీ విహార ప్రియా! వారిజాతాసనాస్యస్థితా! సుస్థితా! కఛ్ఛపీ దివ్య నిక్వాణ నాదాంచిత వ్యాప్త సర్వాగమా! దేవతానీక సంస్తుత్య భావోన్నతా! భక్త లోకార్థితాశేష విద్యాప్రదా! శారదా!

కీరపాణీ! లసద్వేణి! కళ్యాణి! బ్రహ్మాణి! గీర్వాణి, వాణీ! విరాజద్గుణ శ్రేణి! విద్వన్మణివ్రాత సంపూజితాంఘ్రి ద్వయీ! చిన్మయీ! భక్తితో నీదు తత్త్వంబు ధ్యానించెదన్ నీ మహత్త్వంబు కీర్తించెదన్, నీ పదాబ్జాలు పూజించెదన్ జ్ఞాన వైరాగ్య సంపద్విశేషంబు నిమ్మా, సదా మమ్ము కాపాడు మమ్మా! నమస్తే నమస్తే నమః

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

విజయ దశమి సందర్భముగా ఆ దేవి కటాక్ష వీక్షనణములను మాపై ప్రసరింప జేసిన సోదరులు శ్రీ చింతావారు ధన్యులు వారికి ధన్య వాదములు + శుభాభి నందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.