గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, అక్టోబర్ 2012, మంగళవారం

ఘనంగా జరిగిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనము 1.

జైశ్రీరామ్.
విజయనగరము మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల విశ్రాంత అధ్యక్షులు శ్రీ మానాప్రగడశేషశాయి గారి అపురూపమైన ఉపన్యాసము.
ప్రియ సహృదయ మిత్రులారా! 
తే.07-10-2012న విజయ నగరంలోఁ గల సుమారు 150 సంవత్సరాల అతి ప్రాచీన మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థులమైన మా అందరి అపూర్వ అపురూప  సమ్మేళనము  అత్యంత వైభవముగా జరిగిందని తెలియ జేయుటకు చాలా ఆనందంగా ఉంది.
అతి తక్కువ వ్యవధిలో నిర్వహించిన యీ కార్యక్రమానికి పాతికమందో ఏభైమందో వస్తారని ఊహించాము. ఐతే సుమారు మూడువందలమంది హాజరు కావడంతో అత్యంత ఉత్సాహ భరితంగా  అనూహ్యమైన రీతిలో ఆనంద సంభరితమయింది.
అలనాటి నుండి నేటి వరకు అచ్చట బోధకులైన ఉపన్యాసకులు అనేక మంది మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మేము చేసిన సన్మానాన్ని సహృదయంతో గ్రహించి, తమకు మాపై గల అపారమైన ప్రేమామృతం మాపై కురిపిస్తూ వారి అమృత వాక్కులతో మమ్ములనాశీర్వదించారంటే అది మాకు  శారదాంబ అనుగ్రహం వలన లభించిన అపూర్వమైన అవకాశంగా మేము భావిస్తున్నాము.
శ్రీ మానాప్రగడ శేషశాయి గురువుగారు, డా. ఏ. గోపాలరావు గురువుగారు, శ్రీ రామరాజు గురువు గారు శ్రీ గోవిందాచార్యులు గురువు గారు, ఆ సంస్కృత కళాశాల ప్రస్తుత అధ్యక్షులు శ్రీమతి డా.పెన్నేటి స్వప్నహైందవి గారు, వేద పండితులు, ఇంకా కొందరు గురువులు తమ అమూల్యమైన ఆశీస్సులందజేసారు మాకు.
ఈ సంస్కృత కళాశాల ప్రస్తుత అధ్యక్షులు శ్రీమతి డా.పెన్నేటి స్వప్నహైందవి గారు మాకు చక్కని జ్ఞాపికగా ఫైళ్ళను అందజేసారు. ఆమెకు మా ధన్యవాదములు.
శ్రీ మానాప్రగడశేషశాయిగారి అమృత వాక్కులను మనము పైనగల వీడియో ద్వారా చూస్తూ వినవచ్చును.
ఈ అసాధారణమైన అపురూపమైన ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనము మాహా కవిసమ్మేళనంగా పరిఢవిల్లింది.
మా గురుదేవులు శ్రీ ఏ. గోపాలరావుగారు కూడా ఒక పూర్వ విద్యర్థే అయిన కారణముగాను, మాతో మమైకమయే సహృదయులైన కారణంగాను ఆద్యంతము మాకు మార్గదర్శకులై ఈ కార్యక్రమం  నిర్వహింప జేసారు.
మా ఆనందానికి అవధులే లేవంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. 
తొలినాటి రాత్రికే మేమంతా ఒకచోట చేరటంతో ఆరాత్రంతా మాకు మహాశివరాత్రే అయిందంటేనమ్మండి. ఎన్ని మాటలాడుకున్నా తరగవు మా మాటలు. అలనాటి తీపిగురుతులను నెమఱు వేసుకొంటూ ఒకరి యోగక్షేమాలను మరొకరు తెలుసుకొంటూ, మధ్య మధ్య ఆశుకవితా లతలనల్లజేస్తూ, చెణుకులు విసురుకొంటూ, వయసులు మరచి అన్ని బాధలను ఏమరచి అనంద రస వాహినిలో ఓలలాడామంటే ఇది అపురూపమైన దివ్యావకాశం, మాటలతో చెప్ప నలవి కాని దివ్య మధురానుభూతి. 
విజయ నగరంలో ప్రాంతీయంగా ఉన్న పూర్వ విద్యార్థుల శ్రమ ఫలితంగానే సుదూరంలో ఉన్న వారికి, హైదరాబాదులో నివసిస్తున్న నాకు  యీ సదవకాశం లభించింది.
శ్రీ యుతులు పంతుల జోగారావు, P.V.B.శ్రీరామ మూర్తి, మంగిపూడి వేంకటరమణమూర్తి భాగవతార్, రాళ్ళపల్లి రామ సుబ్బారావు, సోమేశ్వర రావు, రాయప్రోలు సత్యప్రసాద్, KSR మూర్తి, Sista రామకృష్ణ, ప్రాత రాజేశ్వర రావు, అయ్యగారు సుబ్రహ్మణ్యమ్,  R.M.S.శాస్త్రి, మున్నగువారు ప్రణాళికా బద్ధంగా యీ కార్యక్రమానికి రూప కల్పన చేసి నడిపించి కృతకృత్యులయారు. కొందరి పేర్లు నాకు సరిగా తెలియక చెప్ప లేకపోతున్నాను కాని ఇంకా అనేకమంది యీ కార్యక్రమంలో భాగస్వాములై వారి జన్మలు చరితార్థం చేసుకున్నారు. 
వారందరికీ నా హృదయ పూర్వక అభినందనలు.
ఆద్యంతమూ కార్య నిర్వహణలో లొపమన్నదే లేకుండా యీ యజ్ఞాన్ని నిర్వహించ గలుగుట యీ నిర్వాహకుల శక్తియుక్తులకు తార్కాణము.
మరొక ముఖ్యమైన విషయం వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. అదేమిటంటే
ఆంధ్రామృతం ద్వారా మా అపురూపమైన సమ్మేళన వార్తను చదివి స్పందిస్తూ, మన సాహితీ బంధువు పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గారు నాకు ఫోన్ చేసి, చూడడానికి నేను రావచ్చా అని అడిగారు. లబ్ధప్రతిష్టులైన వారి రాక మాకు అవాంఛనీయమెలాగౌతుంది.
అయ్యో ఎంత మాట? తప్పక రండి. అవకాశముంటే మీరు విరచించిన అధ్యాత్మ రామాయణ ప్రతులు మా పూర్వ విద్యార్తులకు అందచేయడం ద్వారా అది చదివే భాగ్యాన్ని కలిగించండి అని కోరాను.  అంతే వారు విశాఖపట్టణం నుండి కారు కట్టించుకొని మా సమావేశానికి రావటంతో మాలో ఆనందించనివారంటూ లేరు.
సుమారు 100 ప్రతులను ఆసక్తులైనవారిలో కొందరికి మాత్రమే అందజేయగలిగారు. పాపం ఎన్ని ప్రతులను తేగలరు. సరే ఈ ప్రతులు అందనివారు తన సెల్ కు ఫోన్ చేస్తే వారి చిఱునామా తెలుసుకొనిరామాయణ ప్రతిని  తప్పక పంపగలనని చెప్పారు. అత్యద్భుతమైన ఈ రామాయణం ఒక ఉద్గ్రంథము.భక్తిని మాత్రమే మూల్యంగా చెల్లించ గలిగిన వారీ ప్రతులు గ్రహింపనర్హులు అంటూ వారన్న మాటలకు సంతోషించనివారంటూ లేరు.
ఇంతటి నిర్మలాంతఃకరణులైన శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు గురువులకు పాదభివందనములు తెలియ జేయమన్నారు వారి సహృదయతనుగ్రహించిన నా మిత్రులంతా.
వారికి మాపై గల అవ్యాజానురాగానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఛాయా చిత్రములను ఈ క్రింది సంకేతంపై క్లిక్ చెయ్యటం ద్వారా చూడ వచ్చును.
సహృదయులైన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను.
జైహింద్.
Print this post

4 comments:

Pandita Nemani చెప్పారు...

శ్రీమహారాజ సంస్కృత కళాశాలలో
....పూర్వ విద్యార్థు లపూర్వ రీతి
సమ్మేళనమ్మును జరుపునుండిన వేళ
....విజయనగరమున వేడ్కమీర
చని యందు చూచితి సంబరముల బళా
....సాక్షాత్కరించెను శారదాంబ
శతరూప యను దివ్యసరణి ననేకులౌ
....పండిత కవుల రూపములు దాల్చి
అందజేసితి కొన్ని అధ్యాత్మ రామ
చరిత లచ్చటి వారికి సన్మనమున
హితుడు చింతాన్వయుడు రామకృష్ణ రావు
చేసె నుపకృతి నతని కాశీస్సులిడుదు

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి నమస్సులు. మీ విజయనగరపు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళన మద్భుతముగా నానందదాయకముగా జరుపుకున్నందులకు చాలా సంతోషము. ఆ సందర్భమున విచ్చేసిన మీ గురువర్యులను మాకు పరిచయము చెయ్యడమే గాక పూజ్యనీయులు సరస్వతీ పుత్రు లయిన శ్రీ మానాప్రగడ శేషసాయి వారల యమృత వాక్కుల నందించి నందులకు ధన్యవాదములు. మీ గురువర్యులు, మీ సహాధ్యాయులు కూడా మా యందఱికీ గురుతుల్యులు.అందుచే మీ యందఱికీ ,సభకు అభిమానముతో విచ్చేసిన మా యన్నగారు శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి నమోవాకములు!

గన్నవరపు నరసిం హ మూర్తి

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

అపురూపమైన విషయమండి.
మీకందరికీ అభినందనలు.

సత్య సాయి విస్సా చెప్పారు...

రసజ్ఞ శ్రేష్ఠలకు సంగీత సాహితీ స్రష్టలకు శతసహస్ర వందనాలు
అయ్యా శ్రీ మానాప్రగడ శేషశాయి గారి కవితలు, రచనలు, ప్రసంగాలు, దృశ్య, శ్రవ్య, రచనల రూపంలో ఎవరివద్దనైనా ఉంటే దయచేసి తెలుపగలరు. లేదా ఈ బ్లాగ్ ద్వారా పంచగలరు లేదా ఈ దిగువ విలాసానికి తెలియచెయ్యగలరు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.