గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జూన్ 2012, శుక్రవారం

పాఠ్య పుస్తకాలలో వందేమాతరం గీతం భావి భారత పౌరుల్ని పాడు చేస్తుందా???

జైశ్రీరామ్. 
హరి సేవ బ్లాగులో
ముందు వీళ్ళకు నేర్పాలి మనదైన చదువును. అనేశీర్షికతో
దుర్గేశ్వర రావు గారు వ్యక్తం చేసిన ఆవేదన చూడండి.
ఈరోజు రాజీవ్ విద్యామిషన్ తరపున  ఉపాధ్యాయులకిస్తున్న వృత్యంతరశిక్షణలో   నేను మాట్లాడవలసి వచ్చినది . మారిన    పాఠ్య పుస్తకాలలో  వందేమాతర గీతం   తొలగించినా  ఎవరికీ   చీమ కుట్టినట్లు లేదు . ఇక  అన్నం పెడుతున్న  ప్రభుత్వ పాఠశాలలను బ్రతింకించుకోవాలంటే  తెలుగు భాషను బ్రతికించుకోవాలనే విషయాన్ని గూర్చి గట్టిగా వాదనలు లేవు.
 ఇక మూడవతరగతి తెలుగువాచకంలో ఇతిహాసకథలలో భీముడు రాణివాసంలో పుట్టినట్లుగా పెరిగినట్లుగా వ్రాసారు.  కోట్లరూపాయలు వెచ్చిస్తున్న పాఠ్యపుస్తక నిర్మాణంలో ప్రమాణాలు ఎలా తగలబడుతున్నాయో ఇదొక ఉదాహరణ. కనీసం భారతంగూర్చి అవగాహన కూడా లేదా వీల్లకు అనే అనుమానం కలుగుతుంది .  మొదటి పాఠంలో ఉన్న పాటలో పదాలు ప్రాసకోసం కూర్చినట్లుందిగాని  ప్రామాణికంగా లేదు. సఎ మూడొతరగతికే కదా అనుకున్నా వ్రాసిన పంతులుగారికి భాషపై ఉన్న  అవగహన  ఇంతేనా అనిపిస్తుంది తెలిసినవారికి.
ఇవన్నీ ఎక్కడ పట్టించుకుంటాం ఎండకు మాడిపోతూ రావటం పోవటమే  పెద్ద శిక్ష[ణ]గాఉంది అని వాపోతున్న పంతుల్లశాతం ఎక్కువ. 
 ఇక కుర్రకారు పంతుళ్ళసంగతి  చెప్పనక్కరలేదు .మన సంస్కృతీ సాంప్రదాయాల పట్ల  సరైన అవగాహనా ,అభిమానం ఉన్నట్లనిపిమ్చటం లేదు .  వీళ్ళలో ఎక్కువమందికి  ఇంగ్లీషు చదువులు ,మార్కుల పరిక్షల విధానంలోనే చదువులు సాగాయనిపిస్తున్నది . 
ఇప్పుడే  ఓ ఆలోచనచేస్తున్నాను . మానవీయ విలువలు బోధించే భారతభాగవత రామాయణా దులను విరిచే వచనభాగంగానైనా చదివిమ్పచేయాలి . అందుకోసం ముందుగా వచన రామాయణాన్ని సాధ్యమైనంత మందికి అందించాలి . వీరిచే  చదివించాలి 
జైశ్రీరాం.
ఇది చదివి బాధతో స్పందించని హిందువు ఉండడంటే అది అతిశయోక్తి కానేరదు.
వందేమాతర గీతం   తొలగించిన అంశం చదివిన శ్రీ రాజ శేఖరుని విజయ శర్మ గారి స్పందన చూడండి.   
నిన్న దుర్గేశ్వర్ గారినుండి వచ్చిన మెయిల్ చదివాను. అందులో పాఠ్యపుస్తకాలనుండి " వందేమాతర గీతం" తొలగించారన్న విషయం చదివి చాలా బాధ కలిగింది. దీనిని వ్యతిరేకిస్తూ ఏదైనా కార్యక్రమం వంటిది రూపొందిస్తే బాగుంటుంది. ఎన్ని జరుగుతున్నా చూస్తూ కూచుంటే త్వరలో మన దేశంలో రామా అనడం కూడా నేరమౌతుంది. ఏదో ఒక కదలిక రావాలి. ఏమిచేద్దామనేది సూచించండి. నేను సిద్ధం.    
భారతీయుల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించి, ప్రజల గుండెల్లో అఖండ స్వేచ్ఛా జ్యోతిని వెలిగించిన గీతం వందేమాతరం. ఈ గీతం 7 నవంబర్ 2011 తో 134 ఏళ్లు పూర్తి చేసుకుంది. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ 1877 నవంబర్‌ ఏడో తేదీన బెంగాలీ నవల 'ఆనంద్‌ మఠ్‌'లో భాగంగా దేశాన్ని కీర్తిస్తూ రాసిన పధ్య ప్రబంధమే వందేమాతరం.
ఈ వందేమాతరం... సుమారు అర్థ శతాబ్దం పాటు దేశ స్వాతంత్రోద్యమ స్పూర్తి గీతమై, కోట్లాది మంది భారతీయుల హృదయాలు, రక్తంలో జీర్ణించుకుపోయింది. అలాగే.. అనంతర కాలంలోనే కాలంతో పాటు.. కుంచించుకుపోయింది. ఛటర్జీ రాసిన వందేమాతరం ఆరు చరణాలతో, అనంత రాగ ఐక్యతా సుగంధమై భాసిల్లిన ఈ గీతాన్ని 1896 కాంగ్రెస్‌ సమావేశంలో తొలిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. 1905 బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంతో ఈ గీతం ఊపందుకుంది.
భారత స్వాతంత్ర్య తారక మంత్రంగా మారింది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత వందేమాతరానికి ప్రధమ ప్రాధాన్యమివ్వాలని పెద్దలు ఆలోచించినా వందేమాతరం వివాదాల సుడిలో చిక్కుకోవడం ఇష్టం లేక ఆ ప్రయత్నాన్ని మన పాలకులు విమరించుకున్నారు. అయినా అడపాదడపా వందేమాతరంపై వివాదాలు మాత్రం ఇప్పటికీ చెలరేగుతూనే ఉన్నాయి.
గత 2006, ఆగస్టు 22న దేశంలోని ఉభయ సభలలో విస్తృత చర్చ జరిపి పాఠశాలలో వందేమాతరం తప్పనిసరి కాదని తేల్చాయి. అంతేకాకుండా.. భారత మాతను కీర్తిస్తూ సాగే ఈ గీతాన్ని ముస్లీంలు వ్యతిరేకించడంతో, 1935లో జరిగిన సమావేశంలో వందేమాతరాన్ని రెండు చరణాలకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం మనం పాడుకుంటున్న వందేమాతర గీతం కుదించబడినది.
ప్రస్తుత వందేమాతర గీతం:-
వందేమాతరం! వందేమాతరం!
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం !
శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్ !
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం !
వందేమాతరం! వందేమాతరం!
పూర్తి వందేమాతర గీతం (సంస్కృతం):-
వందేమాతరం వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
షష్ఠీకోటి-కణ్ఠ-కల-కల-నినాద-కరాలే
ద్విషష్ఠికోటి-భుజై ధ్రుత-ఖరకరవాలే
అబలా కైనో మా ఐతో బోలే
బహుబల-ధరిణీం నమామి తారిణీం
రిపుదల-వారిణీం మాతరం ||
తుమి విద్యా తుమి ధర్మ్
తుమి హ్రుది తుమి మర్మ్ త్వాం హి ప్రాణాహ్ శరీరే ||
బాహుతే తుమి మా శక్తి
హ్రుదయే తుమి మా భక్తి
తోమారయి ప్రతిమా జడి మందిరే ||
త్వాం హి దుర్గా దశప్రహరణ ధరిణీం
కమలా కమల-దళ-విహారిణీం
వాణీ విద్యాదాయినీ నమామి త్వాం
నమామి కమలాం అమలాం అతులాం
సుజలాం సుఫలాం మాతరం
వందే మాతరం |
శ్యామలాం, సరళాం, సుస్మితాం, భూషితాం,
ధరణీం భరణీం మాతరం ||
వందే మాతరమ్. వందే మాతరమ్||
చూచారు కదా! ఇటువంటి పునీత హృదయులకు అంద్సరూ అండ దండగా ఉండి న్యాయాన్ని, ధర్మాన్ని నిలపెట్ట వలసిన బాధ్యత ప్రతీ భారతీయుఁడు మీదా ఉంది. 

మంత్ర రత్నం రామానుజం గారి స్పందన చూడండి. 
వందేమాతరం గీతము వింటే నే ఒళ్ళు పులకరిస్తుంది. అటువంటి గీతమును తొలగించడము చాలా గర్హించ దగ్గ విషయము. తమరు ఎంతో శ్రమతో చాలా తెలియని విషయములు కుడా పంచినారు. చాలా బాధగా గుండెలు పిండినట్లు వుంది. ఈ రోజుల్లో ఎంత మంది దేశ భక్తి గీతములను ఇష్టపడుతున్నారు?  అసలు దేశమంటే భక్తి ఇంకా మిగిలి ఉందా?  ఈ ప్రశ్నలు నన్ను చాలా కాలంగా వేధిస్తూ ఉన్నాయి. ఈ నాటి పిల్లలు కాని వారి తల్లి తండ్రులు కాని సినిమా పాటల పై చూపే శ్రద్ధ దేశ భక్తీ గీతములపై చూపటం లేదన్నది జగమెఱిగిన సత్యము. 
         ఈ నాడు దేశ భక్తి గీతము కేవలము రెండు రోజులకే పరిమితమై పోయినదనిపిస్తూ ఉంది. ఒకటి ఆగష్టు 15 వ తారీఖున రెండవది జనవరి 26 వ తారీఖున మాత్రమే దూరదర్శను వారు, ఆకాశ వాణి వారు మొక్కుబడిగా కార్యక్రమములు నిర్వహించి మిగతా రోజులలో ఆ గీతములు ఏమిటో కుడా తెలియకుండా చేస్తున్నారు. పొరపాటున ఎవరైనా ఆ పాటలు మామూలు రోజుల్లో విన్నా కుడా వారిని అపహాస్యము చేయటము కుడా చూస్తూనే ఉన్నాము. 
       దేశ భక్తీ అంటే అది ఏదో సైనికులకు మాత్రమే పరిమితము అని అనుకునేవారు కుడా లేక పోలేదు. " దేశమంటే మట్టి కాదోయ్ , దేశమంటే మనుషులోయ్ " అన్న గురజాడ గారి పద్యము ఎంత మందికి గుర్తు ఉంది? దేశ ప్రజలను సంవత్సరపు పొడుగునా పీడించిన ప్రజా ప్రతినిధులు ఆ రెండు రోజుల్లో మాత్రము, గాంధీ గారి వారసులము, నెహ్రూ గారి వారసులము అని బట్టీ పట్టిన నాలుగు కబుర్లు చెప్పి తమ బాధ్యత అయిపోయింది అని చేతులు దులుపు కుంటున్నారు. ఇదేనా మన దేశ భక్తి? 
      మన జాతీయ సంపదను కొంత మంది మాత్రమే కొల్ల గొట్టుటా దేశ భక్తీ? అటువంటి వారిని ఉపేక్షించిన వారా మన దేశ భక్తులు?  పదవీ విరమణ చేసిన  దేశ సైనికునిగా నా ఆవేదన ఇది. సైన్యములో క్రమశిక్షణ కు అలవాటు పడ్డ నాకు అసలు ఈ దేశములో ఏమి జరుగుతోందో  అర్ధము కావట్లేదు. ఎక్కడ చుస్తే అక్కడ అవినీతి, అక్రమాలు తాండవిస్తున్నాయి. మానవతా విలువలు అంటే అవి ఏవో చిన్న పిల్లలికి మాత్రమే చెప్పే బుద్ధులు అని అనుకుంటున్నారు. అసలు ఈనాడు సత్యము, ధర్మమూ, శాంతి , అహింస మొదలైన విలువలకు అర్ధము ఎవరికైనా తెలుసునా అనిపిస్తుంది. 
  అబద్ధము చెప్పకూడదు, తోటి వారిని బాధ పెట్ట కూడదు, దొంగ తనము చేయకూడదు, పరాయి  ధనము, పరాయి స్త్రీలను ఆశించ కూడదు, మొదలయిన నీతి సూత్రాలను చెప్పే వారే కాని పాటించే వారు చాలా అరుదు అయిపొయినారు. ఇలా లెక్క కడితే ఎన్నో తప్పులు జరుగుతున్నాయి, అసలు ఇదంతా చూస్తూ ఉంటే విష్ణు పురాణములో వ్యాస భగవానులు చెప్పిన కలి లక్షణములు సంపూర్ణముగా కనబడుచున్నవి. 
    ఇంక ఆ పరమాత్మ కల్కి అవతారము ధరించి రావలసిన సమయము ఆసన్నమయినదని నా పూర్తీ విశ్వాసము. మానవ మాత్రులకు సాధ్యము కాని రీతిలో ఈ సమాజములో కలుపు మొక్కలు పెరిగి పోయాయి. ఒక సైనికుడిని అయి ఉండి కుడా ఇలా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా? లేదు నేను కాని మా కుటుంబము కాని రణ రంగము వదలి పోలేదు, కాని క్రితము 15 సంవత్సరాలుగా ఈ వ్యవస్థ లోని అవినీతి పై పోరాటము జరుపుతూనే వున్నాము. కాని ఏమి న్యాయము జరుగలేదు. న్యాయ వాదులు న్యాయ మూర్తులు అందరు పాత్రధారులే. ఏమి చెప్పా మంటారు? ఆ సంగతులు చెప్పవలెనన్న చాలా ఉన్నవి .  మా ముత్తాతలు శ్రీ రాజ గోపాల స్వామీ వారి దేవస్థానమును 1860 లో కట్టించి కొన్నివేల ఎకరములను తమ ఈనాములో భాగమును పంచి ఇచ్చినారు. 1947 వరకు అన్ని సక్రమముగా మా తాత గారి నిర్వహణ లో జరిగినవి. ఆ తరువాత ఆయన కాలము చేసిన పిదప మా తండ్రి గారు పిన్న వయస్కులగుట చేత దేవాదాయ శాఖ వారు, కొంత మంది రాజకీయ నాయకులు, ఆ దేవాలయపు భూములను అనుభవిస్తున్న భూస్వాములు అందరు కలిసి మా కుటుంబమును ఆ ఊరిలో  ఉండ కుండా చేసి, వారికి ఇష్టము వచ్చిన వారికి దేవాలయమును అప్పగించినారు. 
భగవంతుని దయ వల్లా, 1987 నుండి 2000 సంవత్సరము మధ్యన వచ్చిన చట్టముల వల్ల తిరిగి దేవాలయమునకు మంచి రోజులు వచ్చాయని సంతోషించి అప్పటి నుండి తిరిగి మా న్యాయ పోరాటము మొదలు పెట్టాము. ఎన్నో నిరాశలకు ఎదురైనా మా తండ్రి గారు, మా తమ్ముడు (ఒక సాఫ్టవేరు ఇంజినీరు) పోరాటము కొనసాగించారు. 2009 సంవత్సరము నాటికి అన్ని ఆ ధారములతో ఎండోమెంటు  వారి తప్పిదములను, రెవెన్యు వారి తప్పిదములను, భూ ఆక్రమణ దారుల అన్యాయములను కుడా సాక్ష్యములతో సహా కోర్టు వారికి సమర్పించినా కూడా  ఈ నాటి వరకు వారిపై చర్య కాదు కదా జడ్జిమెంటు కుడా  ఇవ్వకుండా  కాలయాపన చేస్తున్నారు. జడ్జిమెంటు ఇచ్చారు అంటే అన్యాయము చేసిన వాళ్ళందరూ భూములను దేవాలయమునకు అప్పగించ వలసి వస్తుందని. అందులో రాజకీయ నాయకులు కుడా ఉండటము వలన న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితము చేస్తున్నారు. ఒక నియోజక వర్గపు ప్రజాప్రతినిధులే ఇంత అక్రమాలు చేయగలిగితే ఇంక రాష్ట్ర  మరియు కేంద్ర స్థాయిలో ఎంత అన్యాయము చేయ గలరో ఊహకు అందునా? 
అందుకే అంటున్నా , ఇది ఆ పరమాత్మ ఏదైనా అద్భుతము జరిపితే తప్ప  ఒక వ్యక్తి గాని కుటుంబము గాని మార్చ లేము అనిపిస్తుంది. ప్రతి వ్యక్తీ ప్రతి రోజు తాను చేస్తున్న పనులను కొంత సేపు తీరికగా కూర్చుని అవలోకనము చేసిన నాడు తప్పకుండా తాను చేసినది మంచా, చెడా అని అంతరాత్మ బోధిస్తుంది. ఆ బోధనలనువిని తన జీవితాన్ని సక్రమమైన మార్గములో ప్రతి వ్యక్తీ నడిపిన నాడు, ఆ మార్పు కలిగిన నాడు, సమాజములో పాపభీతి , దేశ భక్తి మరియు దైవ భక్తీ  తిరిగి నెలకొన బడతాయని నా విశ్వాసము. 
ఇది మా స్వానుభవము.  

పొరపాటు ఉంటే  
పెద్దలు 
క్షమించ గలరు. 


ధన్య వాదములతో,

మంత్ర రత్నం రామానుజం.

రామానుజంగారి ఆవేదన చూచారు కదా? మరి మీ స్పందన కూడా తెలియ జేయండి. 


నమస్తే.
జైహింద్.
Print this post

8 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

దేశమును తల్లిగా గౌరవించి ప్రేమించే సంస్కృతి అలవడటానికి ముఖ్యంగా ఇలాంటి స్ఫూర్తినిచ్చే గీతాలు ఎంతో అవసరం. పాఠశాల ప్రార్థనల్లో, కానీ బహిరంగ సభల్లో కానీ ఇలాంటి గీతాల ఆలాపన లేకుంటే జాతి ఐక్యత దెబ్బతినగలదు.
ప్రయోజనమాశించే ప్రవర్తన మెండుగా వృద్ధి పొందటానికి కారణం ఇలాంటి స్ఫూర్తికరమైన ప్రబోధాలు ఈ మధ్యలో లేకపోవడమే అన్నది నిజము.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అమ్మా! మీ అభిప్రాయం నూటికి నూరు పాళ్ళూ నిజం. మనం కోరుకునే సత్సంప్రదాయం పునరుద్ధరింప బడుతుందని ఆశిద్దాం.

శ్యామలీయం చెప్పారు...

ఈ రోజు పెద్దలకు, పిల్లలకు స్ఫూర్తినిచ్చే విషయాలు యేమంత గొప్పగా ఉన్నాయి?

ఈ దేశం గురించి, ఈ దేశసంస్కృతి గురించి, సాంప్రదాయికంగా వస్తున్న విలువల గురించి ఆలోచన మృగ్యంగా ఉంది. వాటి గురించి మాట్లాడితే సగటు భారతీయుని దృష్టిలో చాదస్తుడు.

అన్నిటికీ డబ్బు అనేది ముందో వెనుకో ఉండి నడిపిస్తున్నరోజులు మనవి.

రాజకీయనాయకుల చేతిలో సాంస్కృతికవిలువలకు విఘాతం కలుగుతోందని విలపించటం దేనికి? మనవాళ్ళు యేమీ ఆసక్తి చూపని వాటినే కదా వాళ్ళు దర్జాగా ధ్వంసం చేస్తున్నారు? అసలు వాళ్ళని మనమేగా ప్రతినిధులుగా యెన్నుకొన్నది?

తెలుగు మాట్లడటం అనాగరికంగా తయారవుతున్న తెలుగుగడ్డను గురించి పాతతరం వాళ్ళము విచారిస్తూ ఉండవచ్చును. కాని ఇలా అవుతున్నదేమిటి అన్న స్పృహ ఈ తరం వాళ్ళకు లేదు! ఏ పరిణామాలపట్ల వాళ్ళకు ఆసక్తి లేదు. అందరకూ కావలసినవి ౧. డబ్బు యెలాగో అలా సంపాదించటం ౨. వినోదం పేరుతో ఇడియట్ బాక్స్ ముందు గంటల తరబడి కూలబడటం ౩. గుడుపూడి జంగాల సామెతలో లాగా ఊరికే పనిమాలి రాజకీయాలు చర్చించటం. మళ్ళా వాళ్ళనేమీ ఆనకండి. అన్నం పెట్టని తెలుగు యెందుకు నేర్చుకోవాలని అడుగుతే మీ దగ్గర జవాబు లేదు. మన తల్లిభాష మనం నిలబెట్టుకోవాలీ అని చాదస్తంగా చెప్పి నవ్వులపాలు కాదలుచుకుంటే బెష్ట్ అఫ్ లక్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! నమస్తే.
మీ అనుభవ సారం గ్రహింకుండా ఉండ లేము. నైతిక విలువలకు వలువలు ఊడతీస్తూ ఉంటే కళ్ళున్న కబోదిలా ఉండ లేకపోవడమే ఈ మా ఆవేదనకు కారణము.
మౌనేన కలహం నాస్తి అనుకుంటే సర్వం నాస్తి తదుత్తరే. అన్నది సత్యమౌతుందన్నది నగ్న సత్యమని భావిస్తే బాధకలగకుండా ఉండదు కదండీ!
ఆదైవేచ్ఛ. ఎలాగుందో/ వేచి చూడ వలసిందే!
నమస్తే.

శ్యామలీయం చెప్పారు...

రామకృష్ణా రావుగారు,
మన అందరి ఆవేదనా ఒకటే. కాని,బొత్తిగా కాని కాలం అయిపోయిందనే విచారం. నిరాసక్తంగా ఉండలేము. ఏమి చేయగలమో ఒక పట్టాన బోధపడేలా లేదు. అందరు పిల్లలూ బంగారు తండ్రులూ బంగారు తల్లులూను. వాళ్ళ తప్పు లేదు. కాని వాళ్ళు చదివే బళ్ళలో తెలుగుకు చోటు లేదు. అది అవసరం అని వాళ్ళ తలిదండ్రులు అనుకోవటం లేదు. తెలుగు మాట్లాడాతారే కాని చదవనూ వ్రాయనూ చేతకాని పిన్నలు నాకు తెలుసు. మీరు నొచ్చుకున్నా సరే ఒక మాట చెప్పక తీరదు, ఒకాయన నాతో "ఈ రోజుల్లో ఆ పోతన్నాలూ గీతన్నలనూ చదవటం వేష్టండీ" అన్నారు. ఇంక అలాంటి వారితో యేమి చెప్పి ఒప్పించాలి? మాయింట్లోనే రెందు రోజుల క్రిందట మా తమ్ముడే "ఇంగ్లీషు బాగా నేర్చుకోవాలి తెలుగెందుకు" అన్నాడు. మనకు అభిమానం ఉంది కాబట్టి, బాధపడదాం, తెలుగు చాలా ముఖ్యమని ప్రచారం చేద్దాం. వినే వాళ్ళు వింటారు. ఫరవలేదు.

అజ్ఞాత చెప్పారు...

ఈ దేశాన్ని బాగు చేయడం ఆ అమ్మ వల్ల కూడా కాదు... అమ్మంటే ఇటలీ మాత కాదు, భరత మాత. :(

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్యామలరావుగారూ! మీరన్నది నూటికి నూరుపాళ్ళూ నిజమండి.
ఐతే మీరు అన్నట్టుగా మన ప్రయత్నం మనం చేద్దాం.
ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ నాడు తెలుగు అంటే , పెద్ద చులకన భావం. అందుక్కారణం , విదేశ వ్యామోహం , డాలర్ల మోజు , నాగరికత ముసుగు . అందు వల్ల పిల్లలకి , ఇంగ్లీషు చదువులు , అంగ్ల సంస్కృతీ అలవాటు చేస్తున్నారు. ఈ చీకట్లు తొలగాలంటే , మార్పు రావాలంటే , ఇంట్లో తల్లుల దగ్గర్నుంచీ మొదలు కావాలి. అమ్మ మొదటి గురువు . అమ్మ మాట వేద వాక్కు . మన సంస్కృతీ సాంప్ర దాయాలు , అలవడి నడవాలంటే , పునాది అమ్మ. అల్లా ఇంటింటా ప్రతి ఇంటా చైతన్యం కలిగితే , భవిష్యత్తరానికి ,వెలుగు బాటలు పడతాయి. తెలుగు వెలుగులు విస్త రిస్తాయి . కాదంటారా ? నేను పొరబడి ఉంటే మన్నించ ప్రార్ధన .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.