గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జూన్ 2012, సోమవారం

నమస్కార ప్రియో భానుః

 జైశ్రీరామ్.
జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహా ద్యుతిమ్, 
తమోఘ్నమ్, సర్వ పాపఘ్నం, ప్రణతోస్మి దివాకరమ్.
భారతీయ సహోదరులారా! 
ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అన్నారు పెద్దలు. అటువంటి ఆ భాస్కరుఁడయిన సూర్య భగవానుని మనము ప్రసన్నం చేసుకో కలిగితే ఆరోగ్యవంతులుగా మనం హాయిగా జీవిస్తాం. 
ఐతే ఆ సూరుఅ భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి మనకు 
నమస్కార ప్రియో భానుః అన్నారు కదండీ పెద్దలు. అందుకని మనము ఆ కర్మసాక్షిని మనసులో నిలిపి నమస్కార పూర్వ్కముగా ప్రార్థిస్తూ, ఈ క్రింది దండకం చదివితే ప్రయోజన బాహుళ్యముంటుందనడంలో సందేహం లేదు కదండీ! మరైతే ఇంకెందుకు ఆలస్యం? 
చూడండి ఈ క్రింది ప్రఖ్యాతమైన దండకాన్ని.
శ్రీ సూర్యనారాయణ దండకం.
శ్రీ సూర్యనారాయణా,వేదపారాయణా,లోక రక్షామణీ,దైవచూడామణీ,ఆత్మరక్షామణీ, 
నమ:పాప శిక్షా,నమో విశ్వకర్తా,నమో విశ్వభర్తా,నమో దేవతా చక్రవర్తీ,పరబ్రహ్మమూర్తీ, త్రిలోకైకనాధాథినాథా,మహాభూతభేదంబులున్నీవయై బ్రోచునెల్లప్పుడున్,భాస్కరా హస్కరా,పద్మినీవల్లభా, వల్లకీ గానలోలా,త్రిమూర్తిస్వరూపా,విరూపాక్షనేత్రా,మహదివ్యగాత్రా,అచింత్యావతారా,నిరాకారధీరా, పరాకయ్యయోయయ్య, తాపత్రయాభీలదావాగ్నిదుర్ధాంతనిర్దూత,నిస్సారగంభీర సంభావితానేక,నీరంబులన్‌దాకి ఏకాకినై చిక్కి ఏదిక్కులం గానగాలేకయున్నాడ నీవాడనో తండ్రీ,జేగీయమానాయ,కటాక్షంబులన్ నన్ను కృపాదృష్టి వీక్షించి రక్షించి వేగన్ కృపాదృష్టిచేతన్,మునీంద్రాదివంద్యా,జగన్నేత్రమూర్తీ,ప్రచండ స్వరూపుండవైయ్యుండి చండాంశు సారధ్యమున్,గుంటియశ్వంబు, దానొంటి చక్రంబుదాల్చి, మార్తాండరూపుండవై,చండవా రాక్షసాధీశులన్,గాంచి కర్మానుసారంబుగా దోషంబులన్ దృంచి, కీర్తిప్రతాపంబులన్ మించి,నీదాసులన్ గాంచి ఇష్టార్థముల్ కూర్తువో,దృష్టివేల్పా,మహాపాపకర్మాలకు న్నాలయంబైన ఈ దేహహభారంబు భారంబుగానీక,సూర్యోత్తమా,శ్రీ సహస్రాంశుడా పట్టి నీ గతిన్ కీర్తింపనే నేర్తునే,ద్వాదశాత్మా
దయాళుత్వమున్,దత్వమున్ జూపి నా యాత్మ ఖేదంబులన్ బాపి,పోషింప నీ వంతు,నిన్నున్ ప్రశంసింప నా వంతు,నిన్ను శేషభాషాధిపుల్ గానగాలేరు, నీ దివ్యరూపప్రభావంబు గానంగ నేనెంత నెల్లపుడున్,స్వల్పజీవుండనౌచున్,మహాకష్టుడన్,నిష్టయున్ లేదు,నీ పాదపద్మంబులే సాక్షి,దుశ్చిత్తమున్ బాపి నిశ్చింతగన్ చేయవే,కామితార్థప్రదా,ఈ మహిన్ నిన్ను కీర్తించి విన్ననే మహాజన్మాంతర వ్యాధి, దారిద్ర్యముల్ పోయి,కామ్యార్ధముల్ కొంగుబంగారు తంగేడు జున్నయి,ఫలించున్ గదా భాస్కరా...
శ్రీ సూర్యనారాయణా,మహాదేవదేవా,నమస్తే నమస్తే నమ:   
చదివారు కదండీ! మీరు గమనించారో లేదో ! ఈ దండకం అనే ప్రక్రియ పఠించే సమయంలో అందు ఇమిడియున్న ఛందస్సు కారణంగా అది పఠించే టప్పుడు మన శరీరంలీని నాడీమండలాన్ని ఉత్తేజ పరుస్తూ అప్రమత్తం చేస్తుందండి. తత్కారణంగాననుకొంటాను అనారోగ్యాన్ని సమర్థవంతాగ ఎదుర్కొన గలిగి ఆరోగ్యాన్ని కాపాడుకో గలుగుందనిపిస్తుంది. మీరూ గమనించండి.
నమస్తే.
జైహింద్.
Print this post

3 comments:

Kottapali చెప్పారు...

beautiful.
ఈ దండకము, ఆదిత్య హృదయము శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావుగారి కర్ణపేయమైన గాత్రంతో ఆకాశవాణి వారి సీడీ లభ్యమవుతున్నది.

Pandita Nemani చెప్పారు...

వందనము సూర్యదేవా!
వందనము సరోజమిత్ర! వందనమరుణా!
వందనము దివసనాథా!
వందనము గ్రహాధినాథ! వందనమర్కా!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మనకు ప్రత్యక్ష దైవ మైన సూర్య భగవానుని దండకం అందించి నందులకు శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.