గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జూన్ 2012, బుధవారం

చంచల నేత్రా! సాంబ శివా! నన్నుంచుము నీదరి సదా శివా!

ఓం శంభో మహా దేవా!
శ్రీపార్వతీశా! మహా పాప నాశా!  ప్రభాపూర్ణ  విశ్వేశ! దివ్య ప్రకాశా!  నినుంగూర్చి యాలించి, మమ్ముం గృపం బ్రోచు నీ రూపమే చూచి, నీ పూజలన్ జూచి, నీ కోసమే వేచి,  నీ దివ్య రూపంబు చిత్తంబునం జేర్చి, నీ పాద పద్మాల సంసేవలం జేయు భక్తుండు యోగ్యుండు.నీ దివ్య ధామంబునందుండి, నిన్నుం సదా చూచు భాగ్యుండు.సుజ్ఞాన తేజుండు, దివ్య ప్రభావుండు, శశ్వన్ మహా జ్ఞాన దేదీప్యమానుండు, దివ్య ప్రకాశుండు, భక్తాగ్రగణ్యుండు కాడే!
మహా భక్తుడౌ వాని శ్రీ పాద పద్మాల ధూళిన్ శిరంబందు దాల్చేటి భాగ్యంబు పుణ్యంబుచేఁ గల్గు, నీ వెల్గులం గాంచు గల్గున్ మనో నేత్ర భాగ్యుల్, ప్రభా పూర్ణ  యోగ్యుల్, నినుం గాంచు యోగుల్, లసత్ పుణ్య భాగుల్, సు నిష్కామ భోగుల్, భవానిన్ సదా గొల్చు భక్తాళి భక్తిన్ త్వదీయాంఘ్రి సంసేవనా చిత్తులై, భక్తినున్మత్తులై, ప్రభా పూర్ణ చిత్తంబుతో నీ మహత్వంబునే యెంచుచున్ భక్తితోగొల్చుచున్, లోక సంచారులై  భక్తి మైకంబు నిండార శంభో మహాదేవ! భక్తాళినే కావ నీకన్న దిక్కెవ్వరంచున్ నివేదించు చుండున్గదా! దేవ! రక్షింప రావా! మముంగావ లేవా! మంబుం బ్రోవ గారాదొకో? దేవ దేవా! నమో చంచలాక్షా! నమో ఫాల నేత్రా! నమో భస్మ తేజా!   నమో చంద్ర మౌళీ! 
నమో పాప నాశా! నినున్ భక్తితోఁ గొల్చు నాంధ్రామృతానంత పాన ప్రబుద్ధ ప్రభా దివ్య తేజుల్ మదిన్ నిల్పి నిన్నున్. త్వదీయాంఘ్రి సంసేవనాసక్త భక్తాళినే బ్రోచి, కాపాడుమా దేవ! అనంత ప్రభావా! 
నమస్తే.నమస్తే. నమస్తే నమః .
జైహింద్.
Print this post

7 comments:

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

వారం రోజుల క్రితం సాయంసంధ్యలో నేను బస్సులో ప్రయానిస్తున్నప్పుడు వర్షపుజల్లులు కురిసినవి. దూరపు కొండలపై వర్షముపడుతున్నవిధానము నాకు ధారాపాత్రనుండీ శివలింగముపై పడుతున్న జలధారలా అగుపించినది. ఆ ఊహతో ఒక పద్యము కుదిరినది.ఇందులోని తప్పులను గురువర్యులు సవరించ ప్రార్థన.

ఆహా వర్షపు జల్లులే కురిసె నాహ్లాదంబు కల్గించగా
నూహాలోకములందు గాంచితిని సద్యోజాతునిన్ శంకరున్
దేహంబెల్ల విభూతిరేఖలును దేదీప్యంబుగా వెల్గెడిన్
స్వాహావల్లభునేత్రుడై నిలచె విశ్వంబెల్లనావేళలోన్

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

చంచల నేత్రా! సాంబ శివా! నన్నుంచుము నీదరి సదా శివా!

గురువుగారూ పరమశివుని చిత్రపటము ఆకర్షనీయముగా చాలాబాగున్నది. దండకము మనోహరముగా నున్నది. ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

భక్తి పారవశ్యము కలిగించు శివుని దివ్య మంగళ రూపము , దేవ దేవుని స్తుతించ గల అష్టకము , [ అష్టకమే అనుకుంటున్నాను ] చాలా బాగున్నాయి అందించిన చింతా వారు అభినందనీయులు .

Pandita Nemani చెప్పారు...

శ్రీమన్మహాదేవదేవా! కృపాభావ! గౌరీప్రియా! శంకరా! భక్తితో గొల్చుచున్ వ్రాసె నీ దండకంబున్ కవీంద్రుండు చింతాన్వయోద్భూతుడౌ రామకృష్ణుండు మీ ప్రేమపాత్రుండు భాస్వచ్చరిత్రుండు మీ దివ్య తత్త్వంబు వర్ణించుచున్ లీలలన్ చక్కగా దెల్పుచున్ స్తోత్రముల్ చేయుచున్ నీలకంఠా! జగద్గీత కీర్తీ! సదానంద మూర్తీ! నమస్తే నమస్తే నమః

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! శ్రీపతి శాస్త్రి గారూ! మీరు ధన్య జీవులు. ఎక్కడో దూరంగా పోయి పరమాత్మ కోసం ధ్యానం చేసేవాఁడు నిజమైన యోగి కానేరఁడు.
ఎవరయితే ప్రకృతిలో పరమాత్మను చూడఁ గలుగుతాఁడో అతఁడే నిజమైన యోగి. ఇందేమాత్రమూ సందేహము లేదు. ప్రకృతిలో పరమేశ్వరునే దర్శించ గలిగిన మీ జన్మ చరితార్థమైందండి. చాలా సంతోషం.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కయ్య గారికీ, గురువులు శ్రీ నేమానిపండితులవారికీ ధన్యవాదములు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

గురువుగారూ ధన్యవాదములు. శ్రీ రామకృష్ణపరమహంస చెప్పిన ఒక కథలో సత్పురుషుల సాంగత్యము సత్ఫలితములనిస్తుందని తెలియజేసినట్లుగా శ్రీకంది శంకరయ్యగురువర్యుల దయవలన శ్రీ పండిత నేమాని గురువర్యులు, మీరు, యితర మహమహులైన సత్పురుషుల సాంగత్యం నాకు లభించినది. ఈ సత్పురుషుల ఆశీస్సులే ఆ తత్పురుషుని ఆశీస్సులుగా నన్ను సదా సన్మార్గములో నడిపించునని నమ్ముచున్నాను.

శ్రీ శంకరయ్యగారికి మీ బ్లాగు ద్వారా నా నమస్సులను తెలియజేయుచున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.