గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జూన్ 2012, శుక్రవారం

తేజోరాశి విభూష మోక్షణ కరీ భూతిస్సదా ధార్యతామ్.

విభూతి ధారి వశ్య వాక్కు శ్రీ ములుగు సిద్ధాంతి
జైశ్రీరామ్.
భగవద్భక్తి పునీయులైన పూజ్య పాదులారా! సుమనర్నమస్సులు.
మన హైందవ సంప్రదయంలో విభూతి ధారణ, తిలక ధారణాదులు గుర్తించ తగ్గ సల్లక్షణాలు.
మన  పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆచారాలేవీ కూడా నిరర్థకమైనవి కావనే విషయం అనుభవైకవేద్యం. 
ప్రతీ పనినీ చేసే విధానమూ, తత్ప్రయోజనము శ్లోకరూపంలోనో, మంత్ర రూపం లోనో మన సాహిత్యంలో నిక్షిప్తం చేసి యున్నారు.
అందు విభూతి ధారణ సమయంలో చక్కని శ్లోకం ఉంది. అటులనే తిలక ధారణ విషయంలో కూడా  చక్కని శ్లోకముంది.
ప్రస్తుతం నేను అను శ్రుతంగా గ్రహించిన విభూతి ధారణ శ్లోకాన్నిక్కడ తెలియఁజేస్తున్నాను.
భూతిర్భసిత భస్మనీ! శివకరీ! పాపౌఘ విధ్వంసినీ! 
సర్వోపద్రవ నాశినీ! ప్రియ కరీ! సర్వార్థ సంపత్కరీ! 
భూత ప్రేత పిశాచ రాక్షసగణాz రిష్టోపసంహారిణీ! 
తేజోరాశి విభూష మోక్షణ కరీ! భూతిస్సదా ధార్యతాం.
శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం
లోకే వశీకరం పుంసాం భస్మం త్రైలోక్యపావనం
ఇంతకీ ఈ విషయాన్ని "ఎవరికి తెలియనిదని ప్రత్యేకించి తెలియఁజేయటం?" అని మీరు నాపై కినుక చూపకండి. ఈ శ్లోకంలో దోషాలుంటే మీద్వారా తెలుసుకో వచ్చని మీముందీ విషయాన్నుంచాను. దీనితో పాటు తిలక ధారణాదులకు సంబంధించిన మంత్రాలను, శ్లోకాలను ప్రకాశింపఁ జేస్తారని నాప్రగాఢమైన ఆశ.
జైహింద్
Print this post

3 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

తెలియని అల్పులం ఎంతోమందిమి ఉన్నామండీ, పెద్దలు మీరు, మీకు తెలిసినవి చెప్పగా తెలుసుకోవలసిన వారము. మమ్ములను మన్నించి మంచి విషయాలు వీలును బట్టి తెలియజేస్తూ మమ్ములను ధన్యులఁ జేయగలరు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అమ్మా! ముఖే ముఖే సరస్వతీ. అన్నారు ఆర్యులు.
నేనూ మీలో ఒకడినే. అజ్ఞుఁడనే. మహాత్ములప్రవచనాలు వినినప్పుడూ, గ్రంథాలు చదువు తున్నప్పుడూ మదికి తోచే విశేషమైన అంశాలు అనిపించిన వాటిని వ్రాసే ప్రయత్నం మాత్రం చేస్తున్నానా పరమాత్మ చేయించడం చేత. మీకూ అనేక విషయ పరిజ్ఞానం ఉండకపోదు.
తెలిసిన విషయాలను తెలియ జెప్పడం ద్వారా పదిమందికీ పంచగలరు.
మీ మాటలలో మీ విధేయతను చూడ గలిగాను.
ధన్యవాదములమ్మా.
శుభమస్తు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అను నిత్యం ఆచ రించ వలసిన , విభూతి తిలక ధారణా గురించి , చక్కగా వివరించారు. మీ వీలు వెంబడి " రుద్రాక్షలు " గురించి తెలుప గలరు. శుభాభి నందనలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.