గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2012, శనివారం

చాతుర్మాస్య వ్రతము. రచన శ్రీ గోడా కన్నయ్య.

జైశ్రీరామ్.
జ్ఞాన సంపన్నులారా! నేటి నుండి భక్తులకు చాతుర్మాస దీక్ష ప్రారంభమౌతోంది. ఈ సందర్భంగా శ్రీ గోడా కన్నయ్య గారి వ్యాసం తిలకించండి.
చాతుర్మాస్య వ్రతము హరి భక్తీ విలాసము భవిష్య పురాణములలో చెప్పబడినది.  ఈ వ్రత ముఖ్య ఉద్దేశ్యము ప్రాణి కోటికి జీవ కోటికి అహింసయే. యీ వ్రతము ఆషాడ సుద్ద  ఏకాదశి నుండి కార్తీక శుద్ద ఏకాదశి  వరకు అనుష్టించ వలెను. ఈ సమయములో ఆహార నియమములు చాల ముఖ్యమైనది. ఒక్కొక్క మాసము ఒక్కొక్క ఆహార వర్జమును పాటించడము ఒక వ్రతముగా అనుష్టించ వలెను.  మొదటి మాసము శాక వ్రతము  అంటే అన్ని కూరలను వర్జించటం శ్రీధరుని అనుగ్రహమునకు. రెండవ మాసము దధి వ్రతము పెరుగు తదితర సంభితిత వస్తువుల వర్జము హృషీకేస ప్రీతికోరకు.మూడవ మాసము క్షీర వ్రతము పాలు తదితర సంబంధిత వస్తువుల వర్జము పద్మనాభ ప్రీతి కొరకు. నాల్గవ మాసమందు ద్వివిద బహుబీజ గింజల వర్జము దామోదర ప్రీతి కొరకు. దీనితో కూడా ముఖ్యమైనది నేలపై పరుండడం. ఈ నాలుగు మాసములు విష్ణు పురాణము భగవద్ గీత, రామాయణం మహాభారతము భాగవత పురాణము వంటి గ్రంథ పారాయణము చేయడము సదా భగవంతుని స్మరణ తో  గడపడం చాల ముక్యమైనది.
చాతుర్మాస్య వ్రతము ఒక్క సన్యాస ఆశ్రమ వాసులకే కాదు గృహస్తులు కూడా పాటించ వలసినదే. ఈ సమయమున మహా విష్ణు యోగ నిద్రలో ఉండటము వాళ్ళ శుభా కార్యములు అంటే వివాహము, ఉపనయనము, నూతన గృహప్రవేశము, దేవాలయ ప్రతిష్ట లాంటివి చేయ కూడదు. కార్తీక శుద  ఏకాదశి అనంతరమే చేయవలెను. 
చాతుర్మాస్య వ్రతము గృహస్తులకు ఉపాకర్మ వ్రతము వలెనే సన్యాస ఆశ్రమంలో  వ్యాస పూజ చేసి మరియు తనకు ఆత్మ గ్యానము కలిగించిన గురువులకు కూడా పూజ చేసి వ్రత ఆరంభము చేసెదరు. సన్యాసికి ముఖ్యమైనది జీవ హింస చేయకుండా ఉండడము సర్వ ప్రాణి కోటి యందు ఒకే మాదిరి సంచరిస్తూ భేద అబెధములు ద్వేష ద్వేషములు లేకుండా ఎల్లప్పుడు సదా నారాయణ స్మరణతోనే గడపవలసి యుంటుంది. అందుకే సన్యాసి ఒకే చోటిలో మకాం పెట్టుకోకుండా సదా సంచారములోనే ఉండవలెను. లేకుంటే లౌకికమైన వ్యవాహరములలో సంబడితుడు కావలసి వుంటుంది. సన్యాసి ఎప్పుడు వండుకోకూడదు గృహస్తు వద్ద భిక్షతోనే జీవించాలి. దీని ఉద్దేశము వంట చేసేటప్పుడు ఎన్నో సుక్ష్మ క్రిముల సంహరణము చేయకుండా  ఉండటమే. అయితే సన్యాసులకు ఈ చాతుర్మాస్య వ్రత కాలమందు ఒకే చోటిలో ఉండుటకు శాస్త్రము ధర్మమూ నిర్దేసించి చెప్పింది కారణము జీవ హింస చేయకూడదని.  వర్షా కాలములో ఎన్నో పురుగులు సుక్ష్మ జీవులు బయట  ఆహారము కొరకై సంచరిస్తుంటుంది మనము  నడిచే టప్పుడు మన పాదములకింద నలిగి పోయే అవకాశములు ఎక్కువ కాబట్టి సన్యాసులకు ప్రయాణము వర్జించ బడెను.
ఈ చాతుర్మాస్య వ్రత విధానము ఒక సనాతన ధర్మ వాసులకే కాదు, బౌద్ధులు జైనులు కూడా దీనిని పాటిస్తారు. నారద మహర్షి తన పూర్వ జన్మలో తన తల్లితోకుడా చాతుర్మాస్య కాలములో సన్యాసులకు సహాయము చేస్తూ వారిచ్చిన గింజలను వాటిని తినడం వారితో కూడా భాగవత కదా శ్రావణము చేయడము వల్లనే తనకు జ్యానము కలిగిందని భాగవతం లో చెప్పి ఉన్నది.
గృహస్తులు ఈ చాతుర్మాస్య వ్రతము అనుష్టించేతప్పుడు కుమ్భములో వ్యాసాది మూర్తులను ప్రతిష్టించడం పరిపాటి కాని సన్యాసులకు నిమ్మ పండ్లయండు ఆవాహన చేసి పూజించ వలెను
వ్యాస పూజ యందు ఒక వ్యాస మహర్షినే కాక ఆరు వర్గములుగా ఆవాహన చేయడము పరిపాటి.
మొదటి వర్గమునందు శ్రీకృష్ణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్హ, సంకర్షనాదులు కృష్ణ పంచకముగా ఆవాహనము చేయవలెను.
రెండవ వర్గమందు వ్యాస, పైల, వైసంపాయన, జైమిని, సుమంతులు వ్యాస పంచకముగా ఆవాహనము చేయవలెను.
మూడవ వర్గమందు శంకరులు, పద్మ పాదులు, సురేస్వరులు, హస్తామలకులు, తోటకులు, భాగవత పంచకముగా ఆవాహనము చేయవలెను.
నాల్గవ వర్గమందు సనక, సనందన, సనత్కుమార, సనాతన, సనత్సుజాతాదులను సనక పంచకముగా ఆవాహనము చేయవలెను. 
ఐదవ వర్గమందు ద్రవిడాచార్య  గౌడపాదచార్య, గోవింద భాగవత్పాదాచార్య, సంక్షేపాచార్య, వివరానచార్యులను ద్రావిడ పంచకముగా ఆవాహనము చేయవలెను.
ఆరవ వర్గమందు, గురు, పరమ గురు, పరమేష్టి గురు, పరాపర గురువులను గురు పంచకముగా ఆవాహనము చేయవలెను.
వీరితో కూడా శుక, నారద, దుర్గ, గణపతి , క్షేత్రపాలక, సరస్వతి , ఇంద్ర, అగ్ని, యమ, నిర్రుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన, బ్రమ్హ, అనంతులను ఆవాహన చేయవలెను.
సుద్ధ చైతన్యమును సాలిగ్రామమందు ఆవాహన చేసి పూజించ వలెను.
సన్యాసుల కూటమి యందు  వయోపరిమితితో పెద్దగా గణింప బడరు.  ఆ సన్యాసి ఎన్ని చాతుర్మాస్య పూజలు చేస్తే అంత ప్రముఖుడు అంటే ముఖ్యత్వము కలుగును.
మనము దక్షినమునండు వ్య్యాస పౌర్ణమిగా అనుష్టిస్తే ఉత్తరమునందు గురు పౌర్ణమిగా పుజిస్తారు. స్మార్తులు చాతుర్మాస్యము వ్యాస పూజతో ఆరంభించి విశ్వరూప యాత్రతో ముగిస్తారు.
చూచారుకదండీ! మంచి విషయాలను తెలిపిన కన్నయ్య గారికి ధన్యవాదములు.
జైహింద్!
Print this post

4 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఎన్నో మంచి విషయాలు తెలిపారు. వినటమే కానీ ఈ చాతుర్మాస్య దీక్ష గురించి, వ్యాసపూర్ణిమ గురించి ఇన్ని వివరాలు తెలియవు. తెలిపినందుకు కన్నయ్య గారికి, మీకు ధన్యవాదములు.

Pandita Nemani చెప్పారు...

శాంతాకారు సురేశు న
నంతశయను విశ్వు పద్మనాభుని లక్ష్మీ
కాంతు కమలాక్షు సుజన
స్వాంతావాసుని దలంతు ప్రణతులు గూర్తున్

Pandita Nemani చెప్పారు...

శాంతాకారు సురేశు న
నంతశయను విశ్వు పద్మనాభుని లక్ష్మీ
కాంతు కమలాక్షు సుజన
స్వాంతావాసుని దలంతు ప్రణతులు గూర్తున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చాతుర్మాస్య వ్రతం గురించి విన్నాను గానీ ఇంత వివరం గా తెలియదు. చక్కగా చెప్పినందుకు శ్రీ చింతా వారికి శ్రీ కన్నయ్య గారికి , కృతజ్ఞతలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.