గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మే 2009, మంగళవారం

శ్రీ షిరిడీశ దేవ శతకము { 66 నుండి 70 }

చ:-
అతులిత శక్తి యుక్తులను హాయిగ నీ భువి నందఁ జేసి, సం
స్తుత మతులన్ సృజించితివి శోభిల. శాంతము తక్కు వౌట నా
గతులను విస్మరించి, చెడుఁ గాంచరు. దౌష్ట్యము లాచరింత్రు. దుర్
మతులను బాపి, బ్రోవుమయ మాన్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 66

ఉ:-
ఆపదఁ బాపు వాడ! పరమాప్తుడ! సద్ గురు సాయి నాథ! ని
న్నే పగిదిన్ భజింపఁ గల నిచ్ఛగ నా మది కోరకుండ? యే
పాపముఁ బుణ్యమున్ గనను. భక్తుల కీవ వరం బటంచు సం
స్థాపనఁ జేతు నిన్ మదిని చక్కగ. శ్రీ షిరిడీశ దేవరా! 67

ఉ:-
చేసెద సాయి పాద యుగ సేవలు సమ్మతి నంచు భక్తు, లా
యాస మనంబునన్ గలిగి, యన్యము వీడి, చరించు చుం డనా
యాసత నీతి బాధ సుమహార్ణవ మంతయు నీది యీది, తా
గాసిల కుండ దాటుదురు. కాంచితె? శ్రీ షిరిడీశ దేవరా! 68

ఉ:-
ఆశ్రిత పక్షపాతి వని, యాప్తుడ వీవని నిన్ను నమ్ము నా
డాశ్రయ మిచ్చు వాడి వని, యార్తులఁ బ్రోచెద వీవ యంచు యీ
యా"శ్రమ" జీవ కోటికి సహాయుడ వీవని చెప్పు కొందురే!
ఆశ్రిత కోటిఁ బ్రోవ గదె? హాయిగ. శ్రీ షిరిడీశ దేవరా! 69

ఉ:-
ఎందుకుఁ బుట్టఁ జేసితివొ? ఇంతటి బాధల నెందు కిచ్చితో?
కందె మనమ్ము నాకిట కకావికలై , నినుఁ గొల్వ నేర, దే
మందును? పాప తప్తుడ. మహాత్ముడ! బాపుము పాప తాపమున్,
డెందమునన్ వసించు షిరిడీ పుర శ్రీ షిరిడీశ దేవరా! 70

జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.