గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మే 2009, మంగళవారం

శ్రీ షిరిడీశ దేవ శతకము { 61 నుండి 65 }

ఉ:-
శ్రీకర! సాయినాధ! తమ సేవల నిన్ బరితృప్తుఁ జేసి, నీ
రాకకు వేచియుండి, తమ రక్షణఁ జేతు వటంచు నమ్మి, పల్
భీకరమైన బాధలను ప్రేమను సైతురు స్త్రీలు. వారిపై
నీకిక జాలి కల్గదొకొ? నిత్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 61

చ:-
వనితల నేల చేసితివి?  వారికి రక్షణ నీయవేల? నీ
పనితన మంతఁ జూపగనొ? వారిజ నేత్రలు సద్గుణాలయల్.
వనిత వసంత శోభ. బలవన్మరణంబులు పొందు చుండె. నీ
సునిశిత దృష్టిఁ గావుమయ! సుందర! శ్రీ షిరిడీశ దేవరా! 62

ఉ:-
అన్నయ! తమ్ముడా! యనుచు హాయిగఁ బిల్తు రనంత భావ సం
పన్నలు భారతీ మణులు భ్రాంతిగ సోదర భారతీయులన్.
మన్నికఁ గొల్పఁ జేసితివొ! మాన్యుల, సద్గుణ శీల భామలన్.
గన్నులఁ బెట్టి కావుమయ! కాంతల. శ్రీ షిరిడీశ దేవరా! 63

ఉ:-
సున్నిత మైన దేహమున సూదులు గ్రుచ్చు నొకండు. దుష్ట సం
పన్నుడొకండు దౌష్ట్యములు పల్కుచు గాయము సేయు గుండెలో.
నెన్నని యోర్చుకో గలరు? ఎవ్వరి కేమని చెప్పు కొంద్రు? నీ
కన్నులఁ గావుమయ్య! కుల కాంతల. శ్రీ షిరిడీశ దేవరా! 64

చ:-
పురుషులు, స్త్రీలు, తాము తమ పూర్వ ఫలంబునఁ బుట్టుచుంద్రు. సు
స్థిరముగ నన్ని జన్మలను తీరుగ నట్టులె పుట్ట లేరు. సత్
పురుషుడ వీ వొకండవెగ! పుట్టిన వారిక స్త్రీలె యౌదు, రా
సురుచిర కృష్ణ భక్తి యిదె చూపును. శ్రీ షిరిడీశ దేవరా! 65

జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.