గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మే 2009, ఆదివారం

శ్రీ షిరిడీశ దేవ శతకము { 11 నుండి 15 }

శ్రీ సాహితీ మిత్రులారా! నాచే రచింపఁబడిన " శ్రీ షిరిడీశ దేవ శతకము " న 11 వ పద్యము నుండి 15 వ పద్యము వరకు పరిశీలనార్థము మీ ముందించుచుంటిని. సదసద్వివేకజ్ఞులగు మీరు నిశితముగా పరిశీలించి గుణ దోష విచారణ చేసి నాకు తెలియఁజేయఁ గోరు చున్నాను. దోషములున్న సవరించు ఒన గలనని సవినయముగా మనవి చేసుకొను చున్నాను.దయతో ఇక పరిశీలించండి.

చ:-
పదిలము తోడ నా షిరిడి వాసముఁ జేయుచు నుండకుండ, మా
మదులను దేవళమ్ములుగ మన్ననఁ జేయుచు నుంటివీవు. నీ
హృదయము మా పయిన్ నిలిపి, ప్రీతిగ నిత్యము రక్ష సేయ గో
రెదవుగ! మమ్ము. నీ కృప గరీయము. శ్రీ షిరిడీశ దేవరా!11

ఉ:-
మానవ మూర్తిగా వెలసి మమ్ముల బ్రోచెడు కన్న తండ్రి! నీ
జ్ఞానము వేద సారమయ! జాగృతమై నినుఁ గాంచఁ జేయ, న
జ్ఞానము రూపు మాప, విలసన్నుత చేష్టలు మాకుఁ జూపి, నీ
జాణ తనంబుఁ జూపెదవు చక్కగ. శ్రీ షిరిడీశ దేవరా!12

చ:-
అఖిల జగంబులోన పరమాప్తుడ వీవని గాంచ లేక, నే
సఖులుగ నెంచి నాడ విలసన్నుత మూర్తుల, సన్నుతాత్ములన్.
నిఖిలము నీవె కాగ మరి నీవని, వారని భేద మేమి? నీ
వఖిలమునై రహింపఁ గల వాత్మల. శ్రీ షిరిడీశ దేవరా!13

ఉ:-
ప్రాణము లుండు దాక మము వర్ధిలఁ జేయుచు బ్రోతువయ్య! మా
ప్రాణము పోవు నాడు మము పాప ఫలంబులు వెంట నంటు. నీ
ప్రాణ ప్రయాణ వేళ నినుఁ బాయక చిత్తము లోనఁ జేర్చు సు
జ్ఞాన పథంబుఁ జేర్చుమయ! సన్నుత! శ్రీ షిరిడీశ దేవరా!14

ఉ:-
భోగము, భాగ్యమున్ గొలిపి, పొందగ జేసిన నాడు నిన్ను నా
యోగము నీవె యంచు, కడు యోగ్యుడ వంచు, నుతింతునయ్య! దు
ర్యోగము వెంబడింపఁగఁ నయోగ్యుడ వీవని నింద సేతు. స
ద్యోగ మొసంగి గొల్పుమయ యోగ్యత! శ్రీ షిరిడీశ దేవరా!15


చూచారు కదండీ! మీఅపురూపమైన సూచనలకై ఎదురు చూస్తుంటాను.
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.