గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మే 2009, బుధవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 12

ఆంధ్రామృతాన్ని మనసారా గ్రోలే మనకు విశ్వనాథ కల్ప వృక్షం లోని భావుకతను తన భావన పటిమ ద్వారా అందిస్తున్న కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు ఉపన్యాసంనుండి 12వ బాగాని ఇప్పుడు మనం అందుకొనే ప్రయత్నం చేద్దాం. ఆలస్యమెందుకు? ఇక చదువుదాం.

సాహిత్యం ఆలోచనామృతం అన్నారు పెద్దలు. కవిత్వం చదివేక సహృదయుని మనస్సులో ఊహలికి రెక్కలు వచ్చి ఆకాశానికి ఎగిరిపో వచ్చు. గంభీరమై మంద్రంగా మహానుభుతి ఒక సంద్రంగా మారిపోయిపాఠకుణ్ణి మూగివాణ్ణి చేయ వచ్చు. అనిర్వకానియమైన తాదాత్మ్యంలో అనేకానేక ఆలోచనలు చెదరినతేనెటీగల్లా మనస్సులో ప్రళయం సృష్టించ వచ్చు. ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కొన్ని పద్యాలు చదివి వ్యాఖ్యానం చేసుకోవడం కంటే భావ గత ప్రకంపనల్ని అనుభవించడమే మేలు అనిపిస్తుంది. " విచిత్ర ప్రకారోయం ధ్వనిః " అని ఆలంకారికులు చెప్పడంలో ఉద్దేశ్యం ఇదేనేమో!

శ్రీ రాముడు పంపా సరోవర అరణ్య భుముల్లోసంచరిస్తూ ఉన్న ఘట్టంలో విశ్వనాథ ఆనుషంగికంగా రాముడు చూసిన ప్రకృతినివర్ణిస్తున్న సందర్భంలో మనం ఉన్నాం.

గీ:-
గగనమున యందు పూచె జూకాల మల్లి.
తొడిమ పట్టింత లేని కూతుండ్ర తల్లి
నేల రాలిన పూలలో నిలిచి తేంట్లు
విరవిరల తేనె గ్రహియించు వెక్కసించు. { శ్రీమద్ రా.క.వృ. కిష్కింధ. నూపుర ఖండము. 1 - 12 . }

సన్నని కాలి బాట ప్రక్కన ఒత్తుగా చిక్కగా రాలిపడియున్న జూకా మల్లి పూల పై పడినది శ్రీరాముని చూపు. ఎంత అందమైన పూలు! ఎంతో ఎత్తున చెట్లపై అల్లుకొని, పూచిన తీగలనుండి రాలి పోయిన పూల తీగ , తొడిమ పట్టు లేక పూలను నేల రాల్చినది పాపం! అందమైన కూతుళ్ళను గని వారిని క్రమ శిక్షణలో పెట్టుకోలేని అమాయకపు తల్లి వంటిది ఆ జూకా మల్లితీగ. నేల పాలైన సౌందర్యం కల ఆ జూకా మల్లెపూలలో పలుచభడి చిందర వందరైన మకరంద బిందువుల్ని త్రాగుట మానలేక - త్రాగలేక వెక్కస పడుతున్నవట తుమ్మెదలు.

కొన్ని కొన్ని విశ్వనాథ పద్యాలకు ఊహా మాత్రంగానైనా దీనికి " ఆధారం ఇది" అని చెప్ప లేము. అతి లోకమైన పూర్వ మహా కవుల చేత అచుంచితమైన అనగా అపూర్వమైన భావాలు విశ్వనాథ సాహిత్యంలో మనకు తారస పడతాయి. అటువంటి గొప్పభావుకత కల పద్యాలలో ఇది ఒకటి.

అయోనిజయైన జనక రాజర్షి కుమార్తెయై యవతరించిన మహా ప్రతిష్ట గల సీత తుచ్ఛుడైన రావణాసురుని చేతిలో పడడం శ్రీ రాముని ఎంతగా బాధిస్తున్నదో! ఆకాశమంత ఎత్తునుండి అంతే మహోన్నత చరిత ఎలా భ్రష్టమైనదో - ఆ నేల రాలిన పూలలోని మరంద మాధుర్యం తుమ్మెదలకు ఆశ్వాదనీయ - అనాశ్వాదనీయంగా వున్నదో పద్యం తెలుపుతూనే సీతా విషయకమైన శ్రీ రాముని ఆలోచనలు ఆయన ద్వైధీ భావ మనస్కత అపరిహార్యమైన సీతా స్మరణము ఇలా శ్రీ రాముని భిన్న భిన్న విచ్ఛిన్నావిచ్ఛిన్న భావ సంతులనతల్ని చెప్పుచున్నదీపద్యం.

మహా ధ్వని విశేషాలకు ఆకారమైనదీ పద్యం. గొప్ప గొప్ప వ్యక్తీకరణ చేస్తున్నామనుకొంటున్న నేటి అత్యాధునిక వచన కవులు కూడా అందుకో లేని స్తాయి విశ్వనాథ భావ తీవ్రత. కల్ప వృక్షంలో ఇలాంటి పద్యాలు లెక్కకు మించి ఉన్నాయి.

చదివాంకదా మనం. విశ్వనాథ రచన ఒకెత్తైతే శ్రీ బులుసు వారి భావనా గరిమ ఒకెత్తు. అట్టి బులుసు వేంకటేశ్వర్లు గారితో స్వయంగా మాటాడాలనుకునే వారి కందుబాటులో ఉండడం కొరకు వారి సెల్ నెంబర్ వ్రాస్తున్నాను.
సెల్ నెం. 9949175899.
మీరు కుడా మీ భావనలను వెలువరిస్తూ రచనలు చేసి ఆంధ్రామృతానికి పంప గలిగితే పరిశీలించి ప్రచురించడంద్వారా మీ భావనా గరిమను పాఠక వర్గానికి అందించ గలనని సవినయంగా మనవి చేస్తూ సాదరంగా ఆహ్వానిస్తున్నాను.నాతో నేరుగా సంప్రదించ దలచుకున్నవారు సెల్ . 9247272960 ద్వారా సంప్రదించ గలందులకు మనవి.
జైహింద్. Print this post

8 comments:

భావకుడన్ చెప్పారు...

రామకృష్ణ గారు,

మంచి మంచి పద్యాలను పరిచయం చేస్తున్న మీకూ, బులుసు గారికీ కృతజ్ఞతాభివందనాలు.

ఇక్కడ ఒక చిన్న అనుమానం.....ప్రత్యేకించి విశ్వనాథ వారిపై మాత్రమె కాదు..అందరు కవుల గూర్చిన ప్రశ్న ఇది.

మీరిక్కడ అన్వయించినట్టు ఆ పద్యాన్ని....అనుక్షణము సీతా తలంపునే మదినుంచెడి శ్రీరామ వ్యక్తిత్వ సూచికగా ........రచయిత వ్రాయలేదేమో? ......నిజంగా ప్రకృతి వర్ణననేమో అది?.......

మన అన్వయానుగతమున మనకు స్ఫురించిన అర్థాన్ని, మనకు/పాఠకునికి రచయిత పైగల అభిమానంతో, ఇలా పద్యాల్లో గూడత అనుకొని, ఆ గూడతను పద్యానికి/రచయితకు ఆపాదిస్తున్నామేమో?.....

ఒక కవి రచనల్లో నిగూడార్థం ఉందన్న విషయాన్ని ఎలా అర్థం చేసుకోవటం?........కొంచం వివరించగలరా?

రాఘవ చెప్పారు...

విశ్వనాథవారిలోని కవిని చక్కగా దర్శింపఁజేస్తున్నారు.

@భావకుడన్:

నాకు అర్థమైనంతలో, కవి చెప్పే కొన్ని విషయాలకి ఆ చెప్పిన కవే అబ్బురపడుతూంటాడు. అలా చెప్పించేది ఆ క్షణంలో కవిలో ఆవేశించిన ఋష్యంశ కనుక. కొన్ని గూఢార్థాలు కవి గమనించకుండానే కావ్యంలో ఇమడవచ్చు... ఆ ఋష్యంశయొక్క విభూతి వలన. కవి చెప్పినదానిలో పైకి అగుపించేదే కాక నిగూఢమైనవి కూడా స్ఫురించడం పాండిత్యం. ప్రస్తుత ప్రసంగంలో విశ్వనాథవారు కవి, బులుసువారు పండితుడు.

నేను కేవలం శ్రోతని ;)

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

భావుకుడా! కృతజ్ఞతలు.. మీ సందేహం సముచితమే.
ఉ:-
భావకుడన్న మాటలను భావనఁ జేసితి. నిక్కమౌను. సద్
భావన కల్గి సత్కవులు ప్రస్ఫుటమౌనటు పద్యకావ్యముల్
చేవను చూపి వ్రాసి మన చేతికొసంగె. గ్రహించు వారు సద్
భావన శక్తియుక్తముగ పల్కుట కద్దు. గ్రహించు టొప్పగున్.

మనకు సంప్రాప్తమైన ఏ కవి కావ్యమునందలి అంశములేవైనా సరే మనం భావనా పటిమతో గ్రహించ గలిగినంత గ్రహించ కలుగుతాము. చెప్పాలంటే మనం విశదపరచే ఆభావనా బలం ప్రయత్న పూర్వకంగా కవి చొప్పించాడో లేదో చెప్పడం అసాధ్యం. ఐతే రస భంగం కాకుండా చెప్పాడా లేదా అన్నది మాత్రమే పైకి మనకు ప్రస్ఫుటమౌతుంది
మహా కవులు వ్యర్థ పదాలతో పేలవంగా వ్రాయరనే సత్యం గ్రహించిన మనం మన భావనా బలంతో కవి హృదయాన్ని విశ్లేషిస్తుంటాం.
మీరన్నట్లుగా ఒక కవి రచనలో నిగూఢార్థం ఉందన్న విషయం కాదనలేము. భావుకతను గ్రహించి వివరించి భావకులు చెప్ప గలిగిననాడు అది సముచిముగా తోచిననాడూ కాదనలేము కదా!
వ్యాసుడు చెప్పే భారతాన్ని వినాయకుడు వ్రాయాలంటే తాను వ్రాసినంత వేగంగా చెప్పాలని అన్న వినాయకునితో నేను చెప్పిన విషయం భావం పూర్తిగా గ్రహించి వ్రాయి, తప్పక నీవు వ్రాసినంత వేగంగా చెప్తానన్నాడు వ్యాసుడు. అవిధంగా భారతం వినాయకుడు వ్యాసుడు చెప్పినంత తాపీగా వ్రాయవలసి వచ్చింది. అంటే ఎంత తాను భావించినా ఇంకెంతో కొంత తన భావన కందలేదనే అనిపించిందికాబోలు వినాయకునికి కూడా. ఇంక మనసంగతి మనం ఊహించుకోవచ్చు.
ఏది ఏమైనా చక్కని స్పందనతో మీరు వేసిన ప్రశ్నకు నాకు చాలా ఆనందం కలిగింది. మీకు నా ధన్యవాదములతో పాటు అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

భావకుడడిగిన ప్రశ్నకు
ధీవరుడగు రాఘవుండు తెలిపెను. నేనున్
కావలసిన వివరణమును
ధీవరులకు తెలిపియుంటి తెల్లము కాగన్.

JD చెప్పారు...

Ramakrishna Rao garu,

It would be nice if you can label/tag all the posts of Bulusu Venkateswarulu garu so that it would be easier to search his posts on your blog.

Thanks,
Jaya

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అమ్మా! జయా!
చాలా సంతోషం. మంచి సూచన చేశావు. ఐతే నేను లేబుల్ చేయుటను గాని, టేగ్ చేయుటను గాని ఎలాగో తెలియనివాడిని. దయతో అది చేసే విధానాన్ని నాకు తెలియఁ జేయ గలిగితే తప్పక చేయగలను. నా సెల్ నెంబరు:- 09247272960. ఈ విషయంలో నాకు పరిజ్ఞానం కలుగ జేయఁబోవుచున్న నీకు నేను ముందుగా కృతజ్ఞతలు తెలియఁజేసుకొంటన్నానమ్మా! నీకు తీరిక కుదిరినప్పుడు తెలియఁజేయగలందులకు మనవి.
శుభాశీశ్శులు.
చింతా రామ కృష్ణా రావు.

భావకుడన్ చెప్పారు...

రామకృష్ణ గారు, రాఘవ గారు,

నెనర్లండి వివరించినందుకు. నిజమే.....ఆ గూఢార్థాలు కవి చొప్పించాడొ లేదొ చెప్పటం ఎంత కష్టమో, సముచితంగా అనిపించిన అన్వయాలను కాదనటం కూడా అంత అనుచితమే. మరియు ఈ అన్వయాదులు పాఠకుల పఠిమాధారితాలు కూడా కదా.

Bolloju Baba చెప్పారు...

భావకుడు గారడిగిన ప్రశ్న ఎంతో కాలంనుంచీ నా మదినికూడా తొలుస్తూ ఉండింది.
అన్వయం చేస్తున్నారు. నిజంగా అవన్నీ కవి ముందుగా ఊహించినవా కాదా అని.

దీనికి ఒక ఉదా: (దయచేసి స్వంత డబ్బా అనుకోరాదు- ఇక్కడ జరిగిన చర్చకు ఒక సజీవ ఉదాహరణ చెపుతున్నాను. ఇది నాబోటి సామాన్యు కవులకు సంబంధించింది. ఇక విశ్వనాధలాంటి మహానుభావులవంటివారల నోటినుండి వెలువడే శబ్ధం వెంబడి అర్ధం పరిగెట్టుకొంటూ వస్తుంది. అది అనితరసాధ్యం.)

నే వ్రాసిన ఒక కవితకు కోడూరి ఆత్రేయగారు చక్కటి వాఖ్యానం చేసారు. అది గొప్ప ఊహ. నిజానికి నేను నా కవితలో అంత గొప్ప్ అర్ధాన్ని ఊహించలేదు.
నేను సామాన్యంగా వ్రాసిన విషయమది.
అలాంటి అన్వయం నాకు ఆశ్చర్యం వేసింది. కొన్ని సందేహాలను రేకెత్తించింది.

వాటన్నింటికీ, రాఘవగారి, మీయొక్క సమాధానాలలో మంచి నెమ్మది లభించింది.

నే పైన చెప్పిన ఉదంతం ఈ క్రింది లింకులో

http://sahitheeyanam.blogspot.com/2008/12/blog-post_29.html

భవదీయుడు
బొల్లోజు బాబా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.