గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మే 2009, శుక్రవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 15

శ్రీ విశ్వనాధవారి రామాయణ కల్ప వృక్షమున నిబిడీ కృతమైన భావుకతను కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు వివరించిన అంశము నుండి మరి యొక పద్యమును మీ ముందుంచే భాగ్యానికి ఆనందంగా వుంది. ఇక పరికిద్దామా!

చ:-
మఱి తెలి రేకు లెఱ్ఱ తొడిమల్ నును మల్లెల కంటె యందముల్
పరువములై కనంబడని స్వర్గము నందలి యూహ సౌఖ్య సుం
దరమయి నట్టు లీ పువుల తావియు నూహ కొలంది స్వాదు సుం
దరమున కృత్రిమంబయిన నాస ప్రధాన గుణంబు చుట్టమై. { వి. రా. క. వృ. కి.కాం. నూపుర. 15 }

శ్రీ రాముడు పారిజాతములను వర్ణించుట ప్రస్తుత కథా సందర్భము.
తెల్లని రేకులతో, ఎఱ్ఱని తొడిమలు గల యీ పారిజాతాలు మల్లె పూల కంటె అందంగా ఉన్నాయి. సంపూర్ణంగా వికసించిన ఈ పూలు స్వర్గ సౌఖ్యమును తలపించు చున్నవి. ఈ పూల పరిమళం సహజ సుందరంగా, అకృత్రిమంగా ఉంటూ ఘ్రాణ తర్పణము చేస్తున్నవి. ఇదీ భావము.

లోకంలో అన్ని అనుభవాలు అందరికీ ఒకే స్థాయిలో అనుభవమునకు రావు. అనుభవించుటలో స్థాయీ భేదాలుంటాయి. మల్లెలు అందరికీ ఆనందము కలిగించునా? కొందరికి అవి తల పోటు తెప్పించును. గొప్ప ఎండలో తిరిగి వచ్చి చెంచాడు చల్లని నీరు త్రాగిన వాడు ఆహా! ప్రాణములు వైకుంఠమునకు పోయినవి అని ఆనందించును. అలసిన వానికి చెట్టు నీడ స్వర్గ సౌఖ్యమును తలపింప చేయును. స్వర్గమునకు పోయిన వాడెవడైనా తిరిగి వచ్చి స్వర్గ మింత సుఖముగా నున్నదని చెప్పెనా? మరి మనిషికి స్వర్గ సుఖమెట్లు తెలిసినది?

స్వర్గము అనగా పుణ్యములచే సంప్రాప్తించిన లోకమని, అచట వేదనలు, కష్టములు లేవని, అది పుణ్య జీవుల నిలయమని, వేదములు చెప్పినవి. పురాణములు చెప్పినవి. పెద్దలు చెప్పిరి. మన అమ్మమ్మలు సైతము చెప్పిరి. భారతములో ధర్మరాజు స్వర్గ సందర్శనమున్నది. గొప్ప కథ. చదివిన వారికి తెలియును.
నన్నయ గారి శకుంతలోపాఖ్యానములో "ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్ర జ్యోత్స్నయున్ పుత్ర గాత్ర పరిష్వంగ సుఖంబునట్లు జీవులకు హృద్యంబే? కడున్ శీతమే?"-- ముత్యాల దండలు కర్పూర పరాగము, చందనము, వెన్నెల, యివన్నీ కుమారును కౌగిలించుకొన్నప్పటి సుఖము చల్లదనము కంటే గొప్పవి కావు అని అర్థము. ఈ అనుభవము అందరికీ కలుగుతుందా?

ఎవడు అచ్చమైన అకృత్రిమమైన సంస్కారముతో తన యింద్రియాలను ధర్మ మార్గానుగాములుగా వశ పరచుకొన్నాడో, లోక యాత్ర చేయుచున్నాడో, వాడు ఋషి వంటి వాడు. అట్టి వానికే సూక్ష్మాతి సూక్ష్మమైన అనుభవాలు కలుగును. కొన్ని రసాయనిక కర్మాగారాలలో పని చేయువారికి సూక్ష్మ వాసనలు గ్రహించు శక్తి నశించునట. ముక్కు వలెనే చర్మము, చెవులు మొదలగునవి కూడా.

పవిత్ర జీవనం పావన దాంపత్యం, నెలపిన సీతా రాముల జీవితమునందలి అనుభవముల గాఢత ఉన్నత స్థాయిలో ఉండును. శ్రీ రామునకు సీత హృదయము లోని ప్రేమ పారిజాతములతో పెనవేసికొనిపోయినది. అందుకే పరమ సుకుమారమైన పారిజాతముల నిట్లు వర్ణించి శ్రీ రాముడు పులకరించిపోయినాడు.

ఊహ కొలది ఊహించిన కొలది సీతా ప్రణయ మాధుర్యము అకృత్రిమము, సహజ సుందరముగా శ్రీరామునకు భాసించు చున్నది. అన్నట్లు వాల్మీకి రామాయణమున యీ పారిజాతముల ప్రసక్తియే లేదు. ఇది కేవలము విశ్వ నాధ స్వోపజ్ఞ. తెలుగు నేలలోని పారిజాతమునకు ధన్యత చేకూరినది.

చూచాం కదండీ కవి వతంసుని ఉపన్యాస నైపుణ్యము. మనం కూడా మనకు తెలిసిన ప్రత్య్యేక సాహిత్యాంశాలున్నట్లైతే ఆంధ్రామృతం ద్వారా అందరికీ పంచి, ఆనందాన్ని అందరం పంచుకొంటే బాగుంటుంది కదా! మరి మీరి కామెంట్ ద్వారా పంపే ప్రయత్నం చేస్తారని నే నాశిస్తూ ఎదురు చూడనా!

జైహింద్. Print this post

1 comments:

కామేశ్వరరావు చెప్పారు...

"నాస ప్రధాన గుణంబు చుట్టమై" - ఇదీ విశ్వనాథ శైలిలోని వైచిత్రి!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.