గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, మే 2009, శనివారం

శ్రీ షిరిడీశ దేవ శతకము { 31 నుండి 40 }

చ:-
వెలయగఁ జేసినావు భువి వేలకు వేలుగ జీవ కోటి . కో
వెలగ మనంబులన్ గొలిపి ప్రీతిగ మానవులందె నీవు, నీ
తలపులె రూపు కాగ కడు తాల్మి వసింతు వదెంత భాగ్యమో!
తలపుల వీఁడఁ జేయకుమ! దక్షుడ! శ్రీ షిరిడీశ దేవరా! 31

చ:-
వర గుణ ధామ! యో పరమ పావన! భక్త శరణ్య! నీ కృపన్
వరముగ నొందినట్టి గుణ వర్యులు ధన్యులు.. పాప కర్మముల్
దరి కిక చేర రావు. వర దాయివి. శ్రీ షిరిడీ నివాస! మ
మ్మరయుచు నుండుమయ్య! పరమాద్భుత! శ్రీ షిరిడీశ దేవరా! 32

ఉ:-
బాల్యమునందు సద్గురుని ప్రాపు లభింప నమోఘమైన సౌ
శీల్య సుధా ఫలంబు ప్రవచింతురు. నిక్కము. నేటి బాలకుల్
బాల్యము నుండి బాధలను, పాపపు కర్మములన్ గ్రహింతు రీ
బాల్యము నందు నీవె గన బాగగు! శ్రీ షిరిడీశ దేవరా! 33

ఉ:-
శీల మహత్వమున్ దెలిపి క్షేమముఁ గూర్చెడి సద్గుణాన్వితుల్
మూలము, లార్య సంస్కృతి సమూలముగా వివరించి నేర్పు. దు
శ్శీలు రదెట్లు నేర్పు? శుభ శీలము, జీవము, నీవె కాదె? సత్
శీల సమృద్ధి నిచ్చి , దరి చేర్చుమ! శ్రీ షిరిడీశ దేవరా! 34

చ:-
ధనముఁ గడింప వచ్చు. పర తత్వ ధనంబు గడింప లేము. సా
ధనమున సాధ్యమౌను. వర దాయివి నిన్ను స్మరించు నాడు ని
ర్ధనుడు ధనుండు.. నీ స్మరణ తప్పిన నాడగు నిర్ధనుండు. మా
ధనమది నీదు సత్ కృప. యథార్థము. శ్రీ షిరిడీశ దేవరా! 35

ఉ:-
మానవ జన్మ మెత్తి, యసమాన సుదుర్లభ శక్తి యుక్తులన్
జ్ఞాన సమృద్ధి, భక్తి, పరికల్పిత దైవ బలంబుఁ గల్గి, య
జ్ఞానపు చీకటుల్ తనను క్రమ్మగ నేమియుఁ జేయ లేక, నిన్
దీనత రక్ష వేడు. కను దీనుల. శ్రీ షిరిడీశ దేవరా! 36

చ:-
శుభ కర సత్ స్వరూపమును చూడగ నెంచి, రచించినావు నీ
విభవముతో శుభాన్వితపు విశ్వము. సర్వము నీవ. కాని, దుష్
ప్రభమ మెలర్చె. దౌష్ట్యములు రాజిలె. దౌష్ట్యము నుండి కావుమా.
ఉభయులకున్ శుభంబది. సముజ్వల! శ్రీ షిరిడీశ దేవరా! 37

ఉ:-
భార వహుండు సాయి యని భావనఁ జేయుచు నెల్ల వేళ మా
భారము సాయి నాధునిది, పన్నుగఁ గాచు నటంచు, నమ్మినన్
కోరక మున్నె తీర్తువట కోర్కెలు.నీ పద పంకజంబులన్
తీరుగ మా మదిన్ నిలిపి, తేల్చుమ! శ్రీ షిరిడీశ దేవరా! 38

చ:-
సుఖము సుఖమ్ము లంచు మనుజుల్ దరిఁ గానక స్రుక్కు.నీదు స
మ్ముఖమున నిల్చి, నిన్ను వరముల్ కరుణించి యొసంగుమండ్రు. యే
మఖములఁ జేయ నేల? నిను మా మది నిల్పినఁ జాలదొక్కొ? యీ
నిఖిలము నందు సౌఖ్యమయ నీ కృప! శ్రీ షిరిడీశ దేవరా! 39

ఉ:-
జ్ఞాన మొసంగి మాకు కరుణాది గుణంబుల నిచ్చినాడవే!
మానము మంటలో కలుపు మాయని దుర్గుణ మేల యిచ్చితో!
ప్రాణము లుండు దాక నినుఁ బాయని భక్తి ప్రపత్తులిమ్ము. య
జ్ఞాన విరుద్ధ మార్గ మిడి కావుమ! శ్రీ షిరిడీశ దేవరా! 40

జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.