సీతాన్వేషణ చేస్తూ ఉన్న శ్రీరాముడు వసంతం వెల్లి విరుస్తున్న పంపా అరణ్యంలో సంచారం చేస్తూ మన్మధ భావోద్దీపిత మనస్కుడై ఉన్నాడు. మన్మధుడు పూర్వం వలె కాదనీ అతడు అయోధ మార్గుడైనాడని, చెప్పిన శ్రీరాముడు ఇప్పుడు ఒక మామిడి చెట్టును చూసి లక్ష్మణునితో ఈ విధంగా పలుకుతున్నాడు.
ఆ:-
ఇంత పెద్ద వృక్ష మీపూత చుక్కలు
పొడిచి నట్లు సాగు బోరసాలి
తేంట్లు కామ మార్గ ధృష్టముల్ కాలెందు
మోపు నెపుడు రసము పొందు నెందు. {వి. రా. క. వృ. కి. నూపుర- 17 }
ఎంతో పెద్ద వృక్షమైన ఈ మామిడి చెట్టునకు చుక్కలు పొడిచినట్లు ఈ చిన్న పూవులేమిటి? ఈ తుమ్మెదలు కామ మార్గ ధృష్టములు. ఇంత చిన్న చిన్న మావి పూతపై తుమ్మెదలు కాలు ఎక్కడ మోపుతాయి? రసము ఎలా పొందుతాయి?
రాముడు కొంత సేపటి క్రింద జూకా మల్లె పూలలో నిలిచి మకరంద పానము చేస్తున్న తుమ్మెదలను చూసాడు. ఇప్పుడు మళ్ళీ వసంత ఋతువున పూత పూసిన మామిడి వృక్షముపై తుమ్మెదలను చూసి పై విధంగా లక్ష్మణునితో పలుకుతున్నాడు.
మన కవుల వాక్యాల్లోని శబ్దార్థాలు నవనవోన్మేషమైన వ్యంగ్య స్ఫోరకాలై విలసిల్లుతుంటాయి. ప్రస్తుతము నిర్వహింప బడుతున్నది విప్రలంభ శృంగారము. నాయికా నాయికా నాయకులు వియోగములో నున్నపుడు వారి యందు జరుగు మనో వ్యాపార రూపమైన విరహ భావనయే విప్రలంభ శృంగారము.
ప్రస్తుతం శ్రీరాముడు విప్రలంభ శృంగార నాయకుడు. లక్ష్మణుడు ఆయనకు పరిచర్యా మూర్తి యైన సఖుడు. లక్ష్మణునితో పలుకు చున్న యీ శ్రీరాముని మాటలు ఆయన సీతా విరహ వ్యథా అసహిష్ణుతను తెలుపుతున్నది.
రావణాసురుడు ఒక అల్పమైన మానవ కాంతను వలచి, బలవంతముగా కొని పోవుట మిక్కిలి అసంగతంగా వుందనీ, అతను కామ మార్గ ధృష్టుడని ధ్వని. పద్యంలో ధృష్ట పద ప్రయోగం విశ్వ నాధ వారి పద ప్రయోగ కౌశలానికి పరాకాష్ఠ.
శృంగార నాయకులు నలుగురు. 1. దక్షిణుడు. ( భార్య లందరి యందును సమాన ప్రేమ కల వాడు. ) 2.అనుకూలుడు. ( పెక్కు మంది భార్య లున్నను ఒక్కతె యందే అనురాగము కలవాడు. ) ౩. ధ్రష్టుడు ( తన తప్పు బయలు పడినను భయ పడని వాడు. ) 4. శఠుడు. ( ఇతరులు కాక తన ప్రియురాలు మాత్రమే ఎఱుగునట్లు తప్పు చేయు వాడు. )
ఇక్కడ తుమ్మెదలు అనేక పూవులపై వాలుతూ తత్తత్ కుసుమ కింజల్కములు రెక్కలపై అంటుకొనగా నిర్లజ్జగా మరొక పూవుపై వాలుచుండుట వలన అవి కామ మార్గ ధృష్టము లైనవి.
నరస భూపాలీయమున యీ నలు తెఱగుల స్వభావాలు కల శృంగార నాయకులకు చక్కని ఉదహరణలు కలవు.
ఈ ఘట్టములో వాల్మీకి రామాయణము నందలి శ్లోకాలను చదివి, అనంతరము కల్ప వృక్ష పద్యములు పఠించిన వారికి విశ్వనాధ ఈ ఘట్టమును తీర్చి దిద్దిన విధానము హృదయాహ్లాదముగ దర్శన మిస్తుంది. అంతే కాదు. సత్కవిత్వమునందు ధ్వని యే విధంగా సాధింప వచ్చునో తెలుస్తుంది. కవి పడిన శ్రమ తెలుస్తుంది.
కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు ఉపన్యాసం నుండి విశ్వనాధ భావుకత కొంత ఇప్పుడు తెలుసుకొన్నాం కదండీ. మరొక పర్యాయం మరొక పద్యం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
జైహింద్.
Print this post
తెలుగు భాష ఎలా పుట్టింది?
-
తెలుగు భాష ఎలా పుట్టింది?
సంస్కృత త్రిలింగ శబ్దభవమైన ప్రాక్రుత తిరిలింగ నుండి లేదా సంస్కృత త్రికళింగ
శబ్దభవమైన తి-అలింగ (ప్రాక్రుతం) పదం నుండిగానీ లేదా...
10 గంటల క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.