గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మే 2009, ఆదివారం

శ్రీ షిరిడీశ దేవ శతకము { 16 నుండి 20 }

శ్రీ సాహితీ మిత్రులారా! నాచే రచింపఁబడిన " శ్రీ షిరిడీశ దేవ శతకము " న 16 వ పద్యము నుండి 20 వ పద్యము వరకు పరిశీలనార్థము మీ ముందించుచుంటిని. సదసద్వివేకజ్ఞులగు మీరు నిశితముగా పరిశీలించి గుణ దోష విచారణ చేసి నాకు తెలియఁజేయఁ గోరు చున్నాను. దోషములున్న సవరించు ఒన గలనని సవినయముగా మనవి చేసుకొను చున్నాను.దయతో ఇక పరిశీలించండి.

చ:-
వరములనిచ్చుటందు నల బ్రహ్మకు, భక్తుల కల్ప వల్లి యా
హరునకు సాటి లేరనుచు నందురు కొందరు. నిన్నుఁ గూర్చి వా
రెరగుడు చేసి, కాంచి, కలరీయిల సాయి, నిజంబు, కోరినన్
వరముల నిచ్చు నండ్రు. తమ భక్తులు. శ్రీ షిరిడీశ దేవరా!16

చ:-
కరుణ రసాల మంచు, వర కామిత సత్ ఫలదుండటంచు, నిన్
మరిమరి పల్కుచుండ మహి మాన్యుడ! నీ కృపఁ గన్న భక్తులా
హరియును, బ్రహ్మ, రుద్రుడు నయాచిత సత్ ఫల దాయి సాయిగా
స్థిరముగఁ బుట్టె నండ్రు కద. దివ్యుడ! శ్రీ షిరిడీశ దేవరా!17

ఉ:-
ఆదియు మధ్యయున్ మఱియు నంతము లెన్నగ లేవు నీకు, మే
మేదియు దారి లేక పరమేశ్వర! నిన్ మదిఁ గొల్చినంతనే
నీదగు చిత్ స్వరూపమును నీటుగ మా మది లోన నిల్పి, స
మ్మోదముఁ గూర్చు నట్టి గురు మూర్తివి. శ్రీ షిరిడీశ దేవరా!18

ఉ:-
అందరి దైవ మొక్కడని, యద్భుత బోధనఁ జేతు వీవు.నీ
కందువుగా గణించి, నను కన్నులలో నిడి, కాచు చుండి, నీ
సుందర చిత్ స్వరూపమును జూపుచు, దోష మడంచుచుండి, యా
నందపు వెల్లువై నిలుమ నాయెడ. శ్రీ షిరిడీశ దేవరా!19

చ:-
హృదయము నీపయిన్ నిలిపి, యీప్సిత మొప్పగ నుండ వాంఛ నా
మదిన వసింపఁ జేసి నిను. మాయలఁ గూర్చుచు దుష్ట చింతనల్
పదిలములౌచు నామదిని, పావను నిన్ మదిఁ వీడఁ జేయు. నా
మదిని వసించి, దౌష్ట్యములు మాపుము. శ్రీ షిరిడీశ దేవరా!20

చూచారు కదండీ! మీఅపురూపమైన సూచనలకై ఎదురు చూస్తుంటాను.

జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.