గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఏప్రిల్ 2026, మంగళవారం

య.స్వీ.బీ.సీ చానల్ లో జరిగిన సంగీత నవావధాన చిత్రీకరణ సందర్భముగా. తే. 13 - 4 - 2026.

జైశ్రీరామ్.

సంచాలకుఁడు చింతా రామకృష్ణారావు.. సంగీతావధాని మీగడ రామలింగస్వామి. 

మరియు ప్రాశ్నికులు.


సీ.  శ్రీవేంకటేశ్వర చిద్రూప సద్భక్తి 
చానల్ కవీశుల ప్రాణమాయె,

రంగస్థలంబుల నింగినంటెడి కీర్తి 
నొందినవారి కానంద మాయె,

దేశీయ కళలలో తేజరిల్లినవారి 
తేజంబు పెంచెడి దీపమాయె,

అవధానవిద్యలో నసమాన ప్రతిభుల 
నాదరించెడి గొప్ప సాధనమ్మె,

గీ. చంద్రశేఖర్ భరద్వాజు సహృదయతను
మూల మూలల నుండెడి పూజ్య కవులు,
దివ్యనట సార్వభౌములు, దీప్తిఁ గనగ,
మహిత యస్వీబి. చానలు మహిత పెరిగె.

సీ.  బంగారు దాలయ్య లింగదేవరకు ఆ, 
అప్పలనరసమ్మ యమృత నిధికి,

బెంగఁ బాపగ రామ లింగఁడుగాఁ బుట్టి, 
నింగినంటెడి కీర్తి పొంగ వరలి,

రంగుగా నాటక రంగమందున రామ 
లింగఁడే ఘనుఁడనన్ బ్రీతి నెదిగి,

రాగరంజిత నవ రాగావధానమ్ము  
లసమాన ప్రతిభతో నన్ని దెసల,

గీ.  దేశదేశాలలో చేసి, దీప్తిని గని,
పెక్కు బంగారు నందుల నక్కజముగ,
తాను సాధించి, సత్కీర్తి తమ్మునకును
కలుగఁ జేయుచు, మురిసెనీ వెలుగుల గని.

ఉ.  మీగడ మల్లికార్జునుఁడు మిన్నును ముట్టిన కీర్తిమంతుఁడే,

రాగములాలపించుతరి రమ్యముగా నల హారుమోనియం

వేగమె వ్రేళ్ళతో నదిమి, వీనులవిందుగ మ్రోగఁ జేయుచున్,

సాగఁగఁ జేయు సుస్వర విశారద నాదరి నన్న రూపునన్.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.