గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 45వ శ్లోకం. 340 - 347. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోమృతసఞ్జీవనీ మైత్రీ కామినీ కామవర్జితా

నిర్వాణమార్గదా దేవీ హమ్సినీ కాశికా క్షమా 45  

340. ఓం *మృతసఞ్జీవిన్యై* నమః.

నామ వివరణ.

మృత్యువునకు సంజీవిని అమ్మ.

తే.గీ.  అతులిత మృత సఞ్జీవినీ! యమరవినుత!

మృతియె భవమెన్న, గొలుతు నమృత పథంబు

నందు నన్ నిల్పుమా సతీ! సుందరముగ,

వందనంబులు చేసెద నందుకొనుము.

341. ఓం *మైత్ర్యై* నమః.

నామ వివరణ.

అమ్మ స్నేహ స్వరూపిణి.

కంనినుఁ గొలిచెద నో *మైత్రీ! *

ఘనముగ నీవున్న చాలు గౌరవమొప్పన్

మనమున, సంబరమొందుదు,

గుణపోషవు, కరుణఁ గనుమ, కూరిమి తోడన్.

342. ఓం *కామిన్యై* నమః.

నామ వివరణ.

కోరికల స్వరూపము అమ్మయే.

తే.గీ.  *కామినీ! * నీవు నాలోని కామములను

తుడిచి ముక్తిని గొలుపుమా తోయజాక్ష!

క్షేమమీవేను  కరుణించు కీర్తి సాంద్ర!

వందనంబులు చేసెద నందుకొనుము.

343. ఓం *కామవర్జితా*యై నమః.

నామ వివరణ.

కోరికలను విడనాడిన తల్లి అమ్మ.

తే.గీ.  *కామవర్జితా*!  ముక్తిపై కామమునిడి,

నిన్ను దర్శింపనిమ్మమ్మ, సన్నుతముగ,

సొమ్ములేలను నిలుమ నా నెమ్మనమున.

వందనంబులు చేసెద నందుకొనుము.

344.  ఓం *నిర్వాణ మార్గదా దేవ్యై* నమః.

నామ వివరణ.

మోక్షమార్గమును ప్రసాదించు తల్లి.

తే.గీ.  దివ్య! *నిర్వాణ మార్గదా దేవి! * నిన్ను

మదిని నిలిపిన నిర్వాణ మార్గమమరు,

నిన్ను మించిన దైవమున్ నేను గనను,

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *నిర్వాణమార్గదా*యై నమః.

తే.గీ.  వినుత *నిర్వాణ మార్గదా! * వేల్పువీవె

నన్ను రక్షింపనున్నట్టి నయనిధాన!

మహిత నిర్వాణ మార్గమును మహిమనొసగు

మమ్మరో నిల్చి మనమున నెమ్మితోడ.

ఓం *దేవ్యై* నమః.

తే.గీ.  దివ్య! నిర్వాణ మార్గదా! *దేవి! * నిన్ను

మదిని నిలిపిన నిర్వాణ మార్గమమరు,

నిన్ను మించిన దైవమున్ నేను గనను,

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *నిర్వాణమార్గదాదేవ్యై* నమః.

తే.గీ.  దివ్య *నిర్వాణ మార్గదాదేవి*! నీవె

నన్ను రక్షింపనున్నట్టి నయనిధాన!

మహిత నిర్వాణ మార్గమును మహిమనొసఁగు

మమ్మరో నిల్చి మనమున నెమ్మితోడ.

345. ఓం *హంసిన్యై* నమః .

నామ వివరణ.

ఆడ హంస స్థితిలోనుండు జనని.

తే.గీ.  *హంసినీ! * కన నాలోని హంసవీవె,

రాజహంసగ మది నిల్చి రక్షణనిడి

ముక్తి సన్మార్గమున్ గొల్పు పొలుపుగాను,

వందనంబులు చేసెదనందుకొనుము.

346. ఓం *కాశికా*యై నమః.

నామ వివరణ.

ప్రకాశించు తల్లి మన అమ్మ

తే.గీ.  జనని! *కాశికా! * నినుఁ గొల్వఁ జాలనమ్మ!

కాశికాపురి ప్రభ్విణీకరుణఁ గనుచు

మమ్ము రక్షించుచుంటివి మాననీయ!

వందనంబులు చేసెద నందుకొనుము.

347. ఓం *క్షమా*యై నమః.

నామ వివరణ.

అమ్మ సహన స్వరూపిణి.

తే.గీ.  *క్షమా! *  గుణోద్ధామ! నా రక్ష నీవె,

నాదు మదిలోన క్షమవయి యాదుకొనుము,

బాధలను బాపి లోకానఁ బరగనిమ్ము,

వందనంబులు చేసెద నందుకొనుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.