గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 44వ శ్లోకం. 333 - 339. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోఆదిలక్ష్మీర్గుణాధారా పంచబ్రహ్మాత్మికా పరా

శ్రుతిర్బ్రహ్మముఖావాసా సర్వసంపత్తిరూపిణీ 44  

333. ఓం *ఆదిలక్ష్మ్యై* నమః.

నామ వివరణ.

ప్రప్రథమ లక్ష్మీమాత మన అమ్మయే.

తే.గీ.  ఆదిలక్ష్మీమహాదేవి! యమర వినుత!

మోదమున నాదు మదిలోన పూజ్యముగను

నిలిచి, భాసింపఁ జేయుమా, నిర్వికల్ప,

వందనంబులు చేసెద నందుకొనుము.

334. ఓం *గుణాధారా*యై నమః.

నామ వివరణ.

సమస్త గుణములకూ ఆధారము మన అమ్మయే.

తే.గీ.  వర *గుణాధార! * భక్తి సంభరిత మతిని

నిన్ను సేవింపనుంటినో కన్నతల్లి!

నన్ను గృపఁ జూడుమోయమ్మ, మన్ననమున,

వందనంబులు చేసెద నందుకొనుము.

335. ఓం *పఞ్చబ్రహ్మాత్మికా*యై నమః .

నామ వివరణ.

బ్రహ్మ, విష్ణు, ఈశ్వర, సదాశివ, రుద్ర, అను పంచబ్రహ్మలను తనలో కలిగిన జ్నని.

కంశ్రీ *పఞ్చబ్రహ్మాత్మిక! *

దీపింపుము నాదు మదిని దీనశరణ్యా!

యే పాప ఫలమొ పుట్టితి

నే పాపిగ, కావుమమ్మ నీవే కృపతో.

336. ఓం *పరా*యై నమః.

నామ వివరణ.

అన్నిటికీ పైనుండు పరాదేవత మన అమ్మ.

తే.గీ.  *పరా! * శక్తి వీవమ్మ! నాపయి దయ

చూపి పరమును గొల్పుమా, సుగుణపోష

వగుచు నన్నేలుమ, శుభదవయిన జనని!

వందనంబులు చేసెద నందుకొనుము.

337. ఓం *శ్రుత*యే నమః.

నామ వివరణ.

వేదములు అమ్మయే.

తే.గీ.  *శ్రుతి! * మహోదార గుణపూర్ణ! శుభము నీకు,

గతివి నీవమ్మ నాకు సద్గతిని గొలిపి

బ్రతుకు పండించుమమ్మరో! భవ్యముగను,

వందనంబులు చేసెద నందుకొనుము.

338. ఓం *బ్రహ్మముఖావాసా*యై నమః.

నామ వివరణ.

బ్రహ్మ ముఖమునే ఆవాసముగా కలిగిన తల్లి.

తే.గీ.  వినుత *బ్రహ్మ ముఖావాస! * వినుము మొరలు,

పద్య ధారలలో నీవు వరలుమమ్మ

పద్యనైవేద్యమందుమా, భక్తసులభ!

వందనంబులు చేసెద నందుకొనుము.

339. ఓం *సర్వసమ్పత్తిరూపిణ్యై* నమః.

నామ వివరణ.

సమస్త,అయిన సంపదలూ స్వరూపముగా కలిగిన తల్లి.

తే.గీ.  *సర్వసమ్పత్తి రూపిణీ!* నిర్వికల్ప!

సర్వసంపదలన్ గొల్పి సదయ గనుమ

భూమిపైనున్న జనులను,మ్రొక్కుదు నిను,

వందనంబులందించెదనందుకొనుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.