గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 41వ శ్లోకం. 313 - 316. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోబిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా

దశవాయుజయాకారా కలాషోడశసంయుతా 41  

313. ఓం *బిన్దునాదకలాతీతా*యై నమః

నామ వివరణ.

బిందుస్థానమునకు, నాదమునకు, కళలకు అతీతమయిన తల్లి మన అమ్మ.

తే.గీ.   కనెద *బిన్దుకలాతీత! * కాంచనిమ్ము

నీదు సద్రూప సంస్కృతుల్ సందడిగను,

కనిన సత్కల్పనాశక్తి కవితకబ్బు

వందనంబులు చేసెద నందుకొనుము.

314.  ఓం *బిన్దునాదకలాత్మికా*యై నమః

నామ వివరణ.

బిందువు, నాదము, కళలకు ఆత్మ అమ్మయే.

తే.గీ.  *బిన్దునాదకలాత్మికా! * విన్దుఁ గొలుపు

మెందునున్నను కనులకు సుందరమగు

నాదమైయొప్పి చెవులకు మోదమునను

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *బిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా* యై నమః.

నామ వివరణ.

బిందుస్థానమునకు, నాదమునకు, కళలకు అతీతమయిన తల్లి మన అమ్మ.

బిందువు, నాదము, కళలకు ఆత్మ అమ్మయే.

స్వయం కల్పిత బిందునాద కళావృత్తము.

గణములు          ….యతి 9 అక్షరము. ప్రాస కలదు.

*బిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా !*

మందగించెడి నా బుద్ధిన్ మాత! నీ కృప కాచునే,

సుందరంబగు నీరూపున్ చూచినంస్పృహ కల్గెడున్

బిందునాదకలన్నాకున్ విందుచేయుము శాంభవీ!

315. ఓం *దశవాయుజయా(జయోం)కారా*యై నమః.

నామ వివరణ.

పంచ వాయువులు

1. ప్రాణము హృదయముననుండియు నాసికముండియు వెలువడును

2. అపానము పొత్తికడుపునకు దిగువనుండి మలమూత్రాదుల వెడలింపజేయును

3. వ్యానము శరీరము నందంతటను వ్యాపించి యుండును

4. ఉదానము కంఠమునుండి మాటలాడ వీలుగలుగ చేయును

5. సమానము అన్నాశయమున జఠరాగ్నికి సమీపమున యుండును

పంచ ఉపవాయువులు

1. నాగము వాక్కు నందుండునది

2. కూర్మము కంటిరెప్ప లందుండునది

3. కృకరము నేత్రము లందుండునది

4. దేవదత్తము కంఠద్వారమున నుండునది

5. ధనంజయము హృదయముననుండునది..

దశ వాయువులను జయించిన ఓంకార స్వరూపిణి మన అమ్మ.

కం*దశవాయుజయా( యోం)కారా! *

నిశితముగా నిన్నెఱింగి నీ కృపఁ గొనగా

సశరీరులు యత్నింతురు,

దశమార్చుదువంచు నిన్ను, ధన్యులు వారల్.

316. ఓం *కలాషోడశసంయుతా*యై నమః.

నామ వివరణ.

పదునారు కలలతో పూర్తిగా నిండియున్న తల్లి మన అమ్మ

పదునారు కళలతో కూడియున్న జనని.

వీడని భక్తితత్వమును విస్తృతిగా మది గొల్పు మో *కలా

షోడశ సంయుతా!* మహిత శోభన సద్వర భాసమానవై

నీడగ నిల్చి నాకు వరణీయ మహత్వ కవిత్వ తత్వమున్

తోడనె నేర్పుమమ్మ, వినుతుల్, జననీ! గణియించి మ్రొక్కెదన్.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.