గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, డిసెంబర్ 2022, బుధవారం

ఈశావాస్యోపనిషత్ వ్యాఖ్య : ఆచార్య చిలుకూరి.

 జైశ్రీరామ్.

ఈశావాస్యోపనిషత్
వ్యాఖ్య : ఆచార్య చిలుకూరి.
~*~
శాంతి పాఠం.
ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే|
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||
ఓం శాంతి: శాంతి: శాంతి: ||
ప్రతిపదార్థము ||
ఓం = పరమాత్మా.
అద: పూర్ణం = అది పూర్ణమై ఉన్నది.
ఇదం పూర్ణం = ఇది పూర్ణమైనది.
పూర్ణాత్ = పూర్ణమునుండి.
పూర్ణం = పూర్ణమే.
ఉదచ్యతే = ఉద్భవిస్తుంది.
పూర్ణస్య = పూర్ణమైన దాని నుండి.
పూర్ణం = పూర్ణము.
ఆదాయ = తీసివేసినచో.
పూర్ణం ఏవ = పూర్ణము మాత్రమే.
అవశిష్యతే = మిగులుతుంది.
తా|| అది అనగా బ్రహ్మము, పరమాత్మ. అది పూర్ణమైనది. ఇది అనగా ఈ జగత్తు,ప్రపంచం. ఇదియును పూర్ణమైనది. పూర్ణమైన పరమాత్మ నుండి పూర్ణమైన జగత్తే ఉద్భవిస్తుంది. పూర్ణమైన దానినుండి పూర్ణం తీసివేసినప్పటికి పూర్ణమే మిగిలి ఉంటుంది. ఓం మనయొక్క అధి దైవిక, ఆధ్యాత్మిక అధిభౌతిక తాపములు శాంతించు గాక !
*నీ యందలి జ్ఞానాన్ని నీవు ఎంత పంచినా నీ జ్ఞానానికి ఏ లోటూ లేనట్లు, భగవంతుడు నిత్యుడు పరిపూర్ణుడు, బ్రహ్మానందమయుడు, శాశ్వతైశ్వర్యసంపన్నుడు, ఏకొరతా లేని వాడు.ఆయన నుండి ఏది ఎంత పంచుకున్నా ఆయనకేమీ లోటు లేదు. కనుక మనం పొందవలసినది పరమాత్మనే. ఈ జగత్తు పూర్ణమైనదే కాని ఇది మనకు పూర్ణమైన శాశ్వతమైన ఆనందాన్ని అందించుటలేదు. మృత్యువుతోను దు:ఖముతోను కూడియున్నది. అధి దైవిక ఆధ్యాత్మిక అధి భౌతిక తాపములను కలుగ జేస్తున్నది. ఇది మన ఎదుటనే ఉంది కాబట్టి బ్రతికి యున్నంతవరకూ దీనిలో పొందవలసిన క్షణికమైన సుఖ దు:ఖాలన్ని ఎప్పటకప్పుడు పొందుతూనే ఉన్నాము కాబట్టి ఇందులో కొత్తగా పొందవలసినదేమీ లేదు. ఇక పోతే మనకు కనిపించని వాడు పరమాత్మ.అతని యందు మృత్యువులేదని శాశ్వతమైన ఆనందము ఆ భగవంతుని లోనే ఉందని శృతులు చెబుతున్నాయి కనుక మనం అతడినే పొందవలెను. అందుకు దారి ఏమిటి? ఈ ఉపనిషత్తు ఎలాంటి మార్గం చూపుతున్నదో తెలుసుకుందాము.
మం|| ఓం ఈశావాస్యమిదం సర్వం యత్ కించ జగత్యాంజగత్ |
తేన త్యక్తేన భుంజీథా మా గృధ: కస్య స్విద్ ధనమ్ || -1
ప్రతిపదార్థం :
జగత్యాం = ప్రపంచం లో,
జగత్ = కదులుతున్నటువంటి,
యత్ కించ = ఎంత చిన్నదైనా,
ఇదం సర్వం = ఈ సర్వమూ,
ఈశ = పరమేశ్వరుని చేత,
అవాస్యం = ఆవరింపబడి యున్నది.
తేన = అందువలన,
త్యక్తేన = త్యజించుట ద్వారా,
భుంజీధా = భుజించుము (అనుభవించుము),
కస్య స్విత్ = ఎవరి యొక్క ,
ధనం = ధనాన్ని కూడా,
మా గృధ: = ఆశించ వద్దు.
తా|| ఈ ప్రపంచం లో కదులు తున్న ప్రతిదీ అది ఎంత చిన్నదయినా సరే - ఈ మొత్తం పరమాత్మ చేతనే ఆవరింప బడి యున్నది. కనుక ఇది నీది కాదు ఆ పరమాత్మదే నని త్యజించి, త్యాగం చేసి అనుభవించుము. ఇతరుల ధనాన్ని ఆశించవద్దు.
వ్యాఖ్య- ఈ మంత్రం లో పరమాత్మను అందుకోవటానికి బుద్ధిలో ఎలాంటి జ్ఞానం ఉండాలి, మనసులో ఎలాంటి భావన ఉండాలి అనేది చెప్పటం జరిగింది. ఈ ప్రపంచం లో అంతటా ఉన్నది పరమాత్మే తప్ప మరేదీకాదు - అనేదే ఉత్తమ జ్ఞానం. అటువంటి జ్ఞానం మనలో స్థిరం గా ఉన్నట్లయితే మన మనసులో కలిగే భావనలు కూడ తదనుగుణం గానే ఉంటాయి. ఈ ప్రపంచం ఇందులో ఉన్న అన్ని వస్తువులు, నేల, నీరు , గాలి, ఈ ప్రకృతి సంపద అంతా మన అందరి కోసం భగవంతుడు ప్రసాదించినది. ఇది ఎవరి స్వంతమూ కాదు. దీన్ని అనుభవించే హక్కు . జీవులందరికీ ఉన్నది. ఈ ప్రకృతి నాస్వంతం దీన్ని నేను మాత్రమే అనుభ వించాలి అనుకోవటం దుర్మార్గం, రాక్షసత్వం కూడా. అలా కాక జీవులందరూ ఆ భగవంతుని స్వరూపమే అనుకుంటే దీన్ని త్యాగబుద్ధితొ సమానంగా పంచుకొని తినాలి. నీ కష్టార్జితం వలన నీకు లభించేది ఏమిటో దాన్నే భగవత్ ప్రసాదం గా భావించి స్వీకరించటం నేర్చుకోవాలి. దానిని కూడా ఇతరులతో పంచుకున్నపుడు నీకు ఆనందము లభిస్తుంది.అంతే కాని ఇతరుల ధనాన్ని, ఇతరుల కష్టార్జితాన్ని కాని నీవు ఆశించ వద్దు. అలా ఆశించావు అంటే పరమాత్మ నీకు నూరు జన్మలెత్తినా లభ్యం కాడు. ముందుగా అంతటా భగవంతుడున్నడని గ్రహించు, త్యాగ బుద్ధి అలవరచుకో! తరువాత "మమాత్మా సర్వభూతాంతరాత్మా" అని తెలుసుకుంటేనే పరమాత్మ తత్వం బోధపడుతుంది. లేకుంటే నీకు మోక్షం లేదు అని ఈ ఉపనిషత్తులోని ప్రథమ మంత్రమే చెబుతున్నది.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.