గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఏప్రిల్ 2020, ఆదివారం

తే.26 - 4 - 2020నిశ్రీ బండికాడ అంజయ్యావధాని అంతర్జాల వాట్సప్ అవధానం అవధానసుధాసింధు సమూహంలో జరుగుచుండగా నేనూ ప్రయత్నిస్తూ చేసిన పూరణలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఇప్పుడు అనగా తే.26 - 4 - 2020నిశ్రీ బండికాడ అంజయ్యావధాని అంతర్జాల వాట్సప్ అవధానం అవధానసుధాసింధు సమూహంలో జరుగుచుండగా నేనూ ప్రయత్నిస్తూ చేసిన పూరణలు.
ఓం
నిషిద్ధాక్షరి.
నృసింహ వర్ణన.

శ్రీనాథా నీ రూపే
జ్ఞానాక్షిన్గొల్పునృహరి! కానంగనినున్.
నే నీదర్శనభాగ్యం
బీనాడే పొందితినయ హేభక్త నుతా!

సమస్యా పూరణ.
మన్నన చేసి భక్తులిట మాన్యుని నన్ను గ్రహించి రండిటన్
క్రన్నన మీకు మేలుగతి కల్పన చేసెడి కృష్ణుఁడన్ గనన్
వెన్ననుగ్రోలి మిము మది ప్రీతిని గాంచి శుభాళినీయ కం
దున్నను గొల్చినన్ దొలగు దోషములన్ని లభించు పుణ్యముల్.

దత్త పది.కరోన.
ఇలలో సుజనులు నిను గని
కలవరపడుచుండిరహహ కాంచుము కృపతో
తలక్రిందుల చేయకుమా
వలదిక పొమ్మీవు కృపను పాడు కరోనా

న్యస్తాక్షరి. సరస్వతి వర్ణన.
జ్ఞానమదే పరమార్తము.(౧/౫.ప).
వాణిన్ గాపాడుమనువు వచ్చిరి భక్తుల్.(౨/౩గా)
మౌనీశులమొర వినుమా౩/౪ల..
వాణీ! జ్ఞానంబు నిచ్చి వర్ధిల గనుమా.(౪/౧ వా)

ఆశువు,
అంతర్జాల అవధానము.
అంతర్జాలమునందున
శాంతంబుగ సద్వధాన సాధన ఘనమౌన్
వింతగ నుండగ నోపును.
వింగ కరోన గొల్పిను ప్రీతిని దీనిన్.

చిత్రానికి పద్యం.
తిరుపతి వేంకటేశ్వరులు దివ్య వధాన విధాన బ్రహ్మలే.
తిరిగిరి దేశ దేశములు దీప్తి గడించిరి పద్యవిద్యచే
సరసవచోవిలాసులయి చక్కగ పద్యములల్లు నైపుణిన్
గురువులు గావెలింగిరిల. కోమలి! మీకిది చెప్పనేటికిన్.

వర్ణనాంశము.
కరోనా చేస్తున్నమృత్యు విన్యాసాన్ని శార్దూలములో.
ప్రాణాపాయము లోకమంత కలిగెన్ పాపీ కరోనా! ప్రజల్
జ్ఞానోద్భాసులు సత్యసంధులు గతిన్ కానంగ మార్గంబికన్
లేనే లేదనిపించుచుండె కనుమా లేశంబు జాలైన లే
దా? నీ మార్గము వీడుమింక దయతో తాల్మిన్ మమున్ బ్రోవుమా.

చిత్రానికి పద్యం ౨.
అరటిని సృష్టి చేసె విధి. హాయిగ వండి నివేదనంబునే
హరికిలఁ జేసి ధన్యులుగ హాయిగ మానవులుండఁ జేయగన్.
నిరతము దీని సత్ ఫలము నిర్మల చిత్తముతో భుజించినన్
హరి సుఖ సంపదల్ గొలుపు. హాయిగ మీరు భుజించుడెన్నుచున్.

ఆశువు ౨. సూర్య వర్ణన.
అరయన్ స్వస్థత గొల్పు దేవ! నిను నే నానందమొప్పారఁగా
పరమాత్మా మది నెంచి గొల్తును మహద్భాగ్యంబు నిన్ గొల్చుటన్
వరమై కల్గును సూర్య దేవ! కరుణన్ వర్ధిల్ల జేయన్ బ్రజన్
కురిపింపన్ గృప మాపయిన్ కొలిచెదన్ కూర్మిన్ గనన్ గోరెదన్.


అవధాని శ్రీ బండికాడ అంజయ్యగారికి అభినందనలు
శ్రీనాథుండు కృపామృతమ్ము నిడి యీ శ్రీ బండి కాడాన్వయున్
జ్ఞానోద్భాసితుగానొనర్చి శుభముల్ కల్గించనష్టావధా
నానూనాక్షర విద్య విద్య భువిపైనానందమున్ బంచగా
దీనోద్ధారకుఁడై యొనర్చె. శుభముల్ దీపించిమీ కెల్లెడన్.

అభినందనలతో

చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.