గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఏప్రిల్ 2020, సోమవారం

ఆత్మావలోకనా పూర్వక ద్వాదశాత్మక రత్న మాలిక. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
ఆత్మావలోకనా పూర్వక ద్వాదశాత్మక రత్న మాలిక.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                              

1,కం:-సత్యము పల్కుట కొదువయె!
నిత్యము తమ పొట్ట నింపు నిచ్ఛను తప్పుల్
రత్యభిరామత నొప్పిరి
స్తుత్యము మానిరి పరముని!శోధన సేయన్!

2,కం:-ఉపకారికి నపకారము.
తప ఫలముగ నెంచునట్టి ధన్యులు గల యీ
రిపుగణ పరివేష్టిత భువి
జప తపములు లెక్క యౌనె?ఛాందసు లారా!

3.కం:-కలిమిని గని మిడియకుమా!
కలకాలము నిల్వదొకని కడ నిత్యంబున్!
తలపగ వలె సరివారల
నెలవగు దానంబు భవిత!నిర్మల మొప్పున్!

4.కం:-మితిమీరి ఖర్చు చేయకు
గతి మాలిన పనుల గడగకు మెల్లన్!
జత గూడు మంచి వారిని
స్థిత ప్రజ్ఞత నందు మయ్య!జీవిత మందున్!

5.కం:-పాపుల గని మెచ్చు కొనకు
శాపంబగు జీవనాడి చదలను చేరున్!
కోపము దరి రానీయకు
పాపము చేయించు నదియె!పట్టును మాపున్!
చదలు=ఆకాశము.

6.కం:-శుచి వీడి తిరుగ బోకుమి
వచితంబును మీర బోకు!వాచాలుడవై!
కు చరిత నంటు. జగతిని
వచసా ధర్మాను సారి వగుమా!ప్రగతిన్!

7.కం:-నిజ మది నిలకడ దేలును.
నిజమే!పరమార్థ భావ నిర్మల మదియే!
నిజ భక్తా గ్రేసరుడా
నిజ దూరుడ గాకు మోయి!నేమము మీరన్!

8.కం:-నా కర్మ బాగు లేదని
కాకము వలె ఘోషిలంగ కాయునె దైవమ్!
నీకర్మ చెడును నడుపగ!
నీకర్మకు కర్త వీవె!నిందింప కొరున్!

9.కం:-చెడు రోగము విర జిమ్మియు
పడ జేసెను రుగ్మకతను!పైశాచికతన్!
విడు వడునో?లేదో!"-భువి"-
వడి రమ్మా!గావ జగతి!వాగీశ!హరా!

10,కం:-తప్పులు మానవ సహజము!
తప్పుల కిటు శిక్ష వేయ తగునా!దేవా!
ఒప్పగు తండ్రివి జగతికి!
చప్పున గావంగ రమ్ము!శశిథర!శంభో!

11.కం:-సుతరుల గావగ నేరని
పితరులు మీరనెడు మాట!వెడలక మున్నే!
పతితుల గావగ రండిక
తతి మారణ హోమ మాపి!ధర రక్షింపన్!
తతి=సమూహము(మానవ సమూహము).

12.కం:-శివ వశితము లోకము గద!
శివ శివ యనెడు జనుల యార్తి శీఘ్రము గని,మా
భవముల హరియించి వడిని
శివమవ తరుమ వలె క్రిమిని"-జీవుల గావన్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.