గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఏప్రిల్ 2020, ఆదివారం

ఆన్లైన్ వాట్సప్ అష్టావధానము.....శంకరయ్యావధానితో పాటు నేను చేసిన....నాపూరణలు

జైశ్రీరామ్.
నిన్నను శంకరయ్యగారి అవధానం సమయంలో నేనూ ప్రయత్నించి వ్రాసినవి.
నరేంద్రమోడీ వర్ణన.నిషిద్ధాక్షరి.

న్యాయంబై భాసిల్లన్
జ్ఞేయమ్మై జాతికంద జేయగ మోదీ
శ్రేయంబౌ సంస్కరణలు
చేయించుచు సాగుచుండె జేజే మోడీ!

సమస్యాపూరణ.
పాములు చూసి భీతిలి యపాంపతి కన్నులు మూసెనక్కటా


నా పూరణ.
శ్రీమహిమంబునెంచి గళ సీమను తాకెనతాకెను హైమ. కంఠమున్
హేమవిభూషణావళులనెన్నుచు, తాకుచు రత్నహారముల్
లేమ కనంగబోవ నట లేవవి, బుస్సని లేచుచున్న యా
పాములు చూసి భీతిలి, యపాంపతి! కన్నులు మూసెనక్కటా.

*వర్ణనాంశం:*
దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం చేసిన విషయం తెలుసుకుని కోపోద్రిక్తుడైన *శివుని* గుఱించిన వర్ణన *శార్దూలంలో*

దక్షయజ్ఞంలో శివుని కోపం
నాపూరణ.

దక్షుండవ్విధినాసభన్ శివ సతిన్ దర్పంబుతో తూలగా
చక్షుల్విచ్చి జనాళి చూడ సతియే చయ్యన్ హతంబాయె తా
శిక్షించన్ హరుడుగ్రుడైయట సభన్ ఛిద్రంబు గావించ తత్
పక్షంబందున భద్రునిన్నిలిపెగా భస్మంబు చేయన్ సభన్.

దత్తపదులు
*సైకిలు*
*బైకు*
*ఆటొ*
*లారి*
పై నాలుగు పదాలను ఉపయోగిస్తూ
*పద్య ప్రాశస్త్యాన్ని*
తెల్పుతూ
 స్వేచ్ఛ ఛందములో వర్ణించండి

పద్య ప్రాశస్త్యము.
నా పూరణ.

సైకిలునుత్రొక్కు తీరున సహజ కవిత
(మధ్యలో అప్రస్తుతానికి సమాధానం...కష్టాలు తెలుస్తాయని)
బైకు పై పోవువేగాన వరలు కవిత
వరల ఆటోను నడిపెడి భవ్య కవిత
కవిత లారీలకొద్దియు కవులు వ్రాయు.

అంశం: ఆశువు
పృచ్ఛకుడు:మొగలిమాల

1)భారతమ్మ ఇంట్లో  బూజుతో సమానం చైనావైరస్ కరోనను సమర్థించండి.

నా పూరణ.
భారత దేశ సంస్కృతికి పశ్చిమదేశ జనాళి పొంగుచున్
స్మేరముఖాబ్జముల్ గలిగి చక్కగ సంస్కృతి నేర్చుచుండిరే.
యీ రకమౌ కరోన మనకివ్విధి చూచినబూజు పోలికన్
దూరముగా విడన్ గదగు శోభిలు దేశము భారతాంబయే.

అంత్యాక్షరి.
చివరి అక్షరం నా
నేటి కవులగురించి చెప్పండి

నయమును తప్పకుమెప్పుడు.
ప్రియమున ఖనుమయ్య ప్రజను విజజ్ఞతతోడన్.
భయమును వీడుచు మేలుగ
నియమముతో మెలగుమయ్య నేర్పును గనుమా.

చిత్రానికి పద్యం. 1.
నా పూరణ.
శ్రీహరీ గను బంగారు జింక నచట
దానినే తెమ్ము నామది తనియునటుల
సీతమాటలనాలించి శ్రీధరుండు
జింకకై వీడ సీతను. చేటు కలిగె

చిత్రానికి పద్యం. 2.
నా పూరణ.
సహజ సౌందర్య రాశితో చందమామ
గగనమందున వెలుగుచు గనగ భువికి
దిగినయట్లుండెకద చూడ? సొగసుగాను.
ప్రకృతి సౌందర్యమును చూచి పరవశించు.

న్యస్తాక్షరి.
శ్రీరామ రక్ష అంశము.
రామదాసు..లు ఆద్యక్షరాలుగా.

నా పూరణ.
రాక్షసాంతక రామయా రమ్ము కావ,
మమ్ము మన్నించి కాచి క్షేమమ్మునిమ్ము.
దాసులము నీకు కాపాడి దారి చూపు.
సుజన రక్షక శ్రీరామ శుభద! రమ్ము.
స్వస్తి.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.