గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జనవరి 2020, ఆదివారం

ఆత్మచెప్పిన కథ....శ్రీ రంగావజ్ఝల మురళీధరరావు.

జైశ్రీరామ్.
ఆత్మకథ. శ్రీ రంగావజ్ఝల మురళీధరరావు.
          దేహం నేను కాకపోతే "నేను ఎవరు?" అంటే ఆత్మ చెప్పిన కథ విందాం అందరం.
           నీ కథ - నా కథ - మన కథ
 నీవు అచంచలాత్ముడవు. నిత్యుడవు. సత్యమిదే. నీలో ఉన్న సత్యమిది. నీ యథార్థస్థితి ఇది. ఈ శాశ్వతత్త్వం నీలో ఉంది. అవినాభావంగా ఉంది. అంటుకోకుండ ఉండి, నిన్ను, నడిపిస్తున్న చైతన్యమే నీవు. నీవు లేని మేను ఉండదు. నీవు ఉంటే మేను ఉంటుంది. మేనును నమ్మకండి. దానిపై అహంకార, మమకారాలు పెంచుకోకండి. మేను అశాశ్వతం. అశాశ్వతాన్ని వదలండి. బయట మేను. లోపల నీవు. లోపలకు చూడండి. మనసు ఆలోచనలన్నింటినీ ఆత్మపై ఉంచండి. నిర్మలం, నిశ్శబ్దంగా మీ లోని ఆత్మను చూడండి.
           "లోకంబులు లోకేశులు
             లోకస్థులుఁ దెగిన తుది నలోకంబగు పెం
             జీకటి కవ్వల నెవ్వం
             డేకాకృతి వెలుంగు నతని నే సేవింతున్" అని భాగవతం చెప్పింది. లోకాలు మూడు..మెళకువ, కల, నిద్ర..లోకేశులు..దేవతలు. వాటికి ఆధారమైన చైతన్య పరిధులు మూడు..విశ్వుడు, తైజసుడు , ప్రాజ్ఞుడు.. లోకస్థులు..మూడు లోకాలను అనుభవించేవి=ఇంద్రియాలు అంతఃకరణము , అహంకారం మొదలగునవి . తెగిన తుది అనగా నశించాక. అంటే ఇవేవీ అందుకోలేని .. అలోకంబగు పెన్జీకటికవ్వల..శూన్యావస్థను కూడా మించి ఎవ్వండు..ఎవడైతే ఉన్నాడో.. ఏకాకృతి వెలుగు..అంటే..నిర్వికల్ప నిశ్చల స్థితిలో, ఈ మూడు లోకాలను కూడా అంతర్యామి యై వ్యాపించిన ఏకాకృతిలో.. వెలుగు.. అంటే.. జ్యోతిగా కనిపిస్తాడో .. అంతర్ముఖులై ..వెదకి చూచిన..కనిపిస్తాడు. అటువంటి పరమాత్ముడైన శ్రీమహా విష్ణు మూర్తి నే.. సేవింతున్. .ప్రార్ధిస్తాను ! అని గజేంద్రుడు మొరపెట్టుకుంటాడు. అలా  అందరూ, అంతా నశించాక, గాఢాంథకారానికి , విశ్వానికి అవతల అఖండంగా, ఏకంగా వెలుగుతున్న పరమాత్మ
 వెలుగును చూడండి.  అదే ఆత్మ జ్యోతి. అదే నీవు. అదే నేను. "తత్త్వమసి - అహంబ్రహ్మాస్మి" అదే. "అయమాత్మా బ్రహ్మ" అదే. "సర్వంఖల్విదం బ్రహ్మ " అదే. చంద్రునిలో చల్లదనం, ఆహ్లాదం నీవే.. సూర్యునిలో తేజస్సు నీవే. అగ్నిలో వేడివి నీవే. ఈ విశ్వాన్నే నడిపే చైతన్యమే నీవే. నీవో చైతన్యం. చైతన్యమంటే ఆత్మయే. నీలో ఉంది. నాలో ఉంది. మనలో అందరిలో ఎంత దగ్గరలో ఉందో! కదా! "చంకలో పిల్లను పెట్టుకొని, ఊరంతా వెతికినట్లు వెదుకకండి."  శాశ్వతమైన ఆత్మను చూడండి.  ఆత్మ చెప్పే మాటలు నమ్మండి. శాశ్వతులు కండి.  శాశ్వతుడను. నీలోని ఆత్మను. ఇది నీ కథ. నాకథ. మనకథ. మనలోని ఆత్మ కథ. ఆరు శ్లోకాలలో  ఆత్మలమైన  మన కథ. ఆరు శ్లోకాలలో విడమరచి, చెప్పాను. నిన్ను అంశాలవారిగా నీవు దేహానివికాదు. అని సుస్పష్టంగా వివరించాను. నేను ఆత్మను. నీవూ ఆత్మవే. ఆరులో నేనూ, నీవూ ఉన్నాం. ఆరు గుణాలతో భాసించే ఆత్మను. పరమాత్మను. ఆరు వికారాలూ లేని ఆత్మషట్క కథ. తాపత్రయాదిదుఃఖాలు అంటని నిర్వాణ షట్క గాథ ఇది. మోక్షకథ. అని ఆత్మ, అహంపొర కమ్మిన దేహానికి చెప్పిన కమ్మని కథ. మేను ఎవరో! నేను ఎవరో! నీవు ఎవరో! అద్దె ఇంటిని అందంగా, భద్రంగా చూస్తారో! సొంత ఇల్లనే మణిద్వీపాన్ని చూసుకుంటారో! ఇది మన కథ. నాకథ. నీకథ, మన కథ అంతా ఉపనిషద్విజ్ఞానమే.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.