గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జనవరి 2020, శనివారం

సాధన....శ్రీ రంగావజ్ఞల మురళీధరరావు.

జైశ్రీరామ్.
సాధన.... శ్రీ రంగావజ్ఝల మురళీధరరావు.
              "శివోఽహమ్" ఉపదేశం లేని మంత్రం. ఉపాసన‌. జపం. తపం. తపస్సు తాపత్రయాదులను ఉపసంహరింపజేస్తుంది. అపుడు దుఃఖాలు ఉండవు. అదే నిర్వాణము. అపుడు అంతఃకరణం శూన్యం అవుతుంది.నిష్క్రియం అవుతుంది.
     మానవుని దృష్టి నవరత్నాలమాలపై  పడియుంటుంటుంది. దానిలో ఒక్కొక్క రత్న వైభవాన్ని చూస్తుంటాడు. ఆ నవరత్నమాలయే నవరంధ్రదేహం. దానిని చూసి మానవుడు మురిసిపోతుంటాడు. భౌతికానందంతో తల్లీనమవుతుంటాడు. దానికి ఉన్నవన్నీ కన్నాలే. అని గ్రహించడంలేదు. కానీ మెరిసేదంతా బంగారం కాదు. మనసు బయట విషయాలతో రమిస్తుంటుంది. వేంటనే దానిని విరమింపచేయాలి. రోజూ మనకు తెలియకుండానే 21,600 సార్లు "సోహమ్" జపిస్తున్నాం. అది అజపాగాయత్రి. శంకరులే మనగురువుగా భావించాలి. "సోహమ్" అదెక్కడిదా!
" ఓమ్" కారమే. అది శబ్దబ్రహ్మ. సృష్టికి మూలం. పరమాత్మ రూపం. సచ్చిదానందం.
 " సోహమ్"-"సః+అహమ్= సోహమ్" అదే "శివోహమ్".

         ఇపుడు నిర్వాణషట్కము చదువుతున్నాంకదా! ఆత్మయే,"చిదానందరూపః శివోహమ్ శివోహమ్" అని 21600 సార్లు నిరంతరం జపించాలి. అది హృదయం లో నిరంతరం వెలిగే శాశ్వత జ్యోతి.
         "జ్యోతిషామపి తద్జ్యోతిః తమసః పరముచ్యతే
          జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య తిష్ఠతి"
 జ్యోతులనే ప్రకాశింపఁజేసే ఆ జ్యోతి అజ్ఞానాంథకారానికి అతీతం. జ్ఞానస్వరూపం.
దానిపై దృష్టి ఉంచి, జపిస్తూ ఉండాలి. దేహం పడిపోయినా పవిత్రంగా ఉంచుతుంది. "అదీ జప మహిమ" అని చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామివారి సందేశం.
     1.ఆ శ్వాస అప్రయత్నం. దానికి ప్రయత్నించి, మనసును తోడు చేయాలి.
     2.బుద్ధి ఏదో ఆలోచిస్తుంది. దానిని కూడా నిరంతరం శివమయం చేయాలి.     
     3. అహం జ్వలిస్తే " శివోహమ్" జపించాలి. "శివోహమ్" అనుకోవాలి. దానిని కూడా నిరంతరం శివమయం చేయాలి.
     4.చిత్తం జ్ఞాపకాల పుట్ట. జ్ఞాపకాలలో శివుని నింపుకోవాలి.
         ఇదీ సాధన. అపుడు ఇంద్రియార్థాలపై ఉన్న మనసుకు శబ్దం వినిపించినా మనసు స్పందించదు. బుద్ధి స్పందించదు. లోపల మనుజుని నడిపే అంతఃకరణమనే ఇంద్రియాలు బయటకు చూస్తున్నా అంతఃకరణం"శివోహమ్" అంటుంది. నేను శివుడను. ఆత్మ స్వరూపుడను అని అంతఃకరణాదులు బయటకు చూస్తున్నా వాటిలో రమించవు. శివ రూప ఆత్మలింగంలో రమిస్తాయి. క్రియలు ఆచరిస్తున్నా భగవాన్ రమణులవలె విదేహస్థితిలో ఉండగలుగుతాం.
    "యస్తు అవిజ్ఞావాన్ భవతి, అమనస్కః సదా - శుచిః. న స తత్ పదమాప్నోతి సంసారంచాధిగచ్ఛతి" ఎవరు బుద్ధిమంతుడో, పవిత్రుడో, అనన్యమనస్కుడో అతడు పరమపదాన్ని పొందుతాడు.
  1.అపుడు "శబ్ద,స్పర్శ,రూప,రస,గంధాలు" బయట ఆకర్షిస్తున్నా శూన్యంగా, నిశ్శబ్దంగా, నిర్మలంగా ఉన్న మనసాదులపై ప్రభావం ఉండదు. వినిపించినా, కనిపించినా మనసులో స్పందన ఉండదు. నిర్వికారస్పందన ఏర్పడుతుంది.
       
     ఆత్మదర్శనం కోరే సాధకుడు  వాక్కును మనస్సులో ఏకీకృతం చేయాలి. వాక్కు అగ్ని. అగ్ని జ్ఞానానికి సంకేతం. మనసు"చంద్రమా మనసో జాతః" అని మనసు చంద్రుడు. మనసుకు సంకేతం. మనసు వాయువుకు సంకేతం.- కేనోపనిషత్. "అగ్నీ సోమాత్మకం ఇదమ్ జగత్" అని వేదం. అగ్ని, చంద్రుల కలయికయే జగత్తు. వాక్కును మనస్సులో ఏకీకృతం చేయాలి."యచ్ఛేత్ వాఙ్మనసీ ప్రాజ్ఞః……" కఠోపనిషత్….

                                    ఏకీకృతం చేయడం

     మనస్సు             బుద్ధి                చిత్తము                 అహంకారం
      చెవి                 నాలుక.             ముక్కు                     కన్ను

    మనసు > నాలుక.  బుద్ధి >చెవి   చిత్తము> కన్ను   అహంకారం>ముక్కు
ఇలా నాలుగంచెల సోపానంలో బ్రహ్మశ్రీ నేతి సూర్యనారాయణశర్మగారు పేర్కొన్నట్లు ఉపాసన" శివోహమ్" మంత్రజపం చేస్తుండాలి.
       ఇది పరస్పరము కుండలినీ సర్పాలు మెలివేసినట్లుగా సాధన భుజంగ గమనంలా సాగుతుంది.
       మనసుకంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ, ఆత్మ కంటే, అవ్యక్తం, అవ్యక్తం కన్నా పరమాత్మ బలీయాలు. పరమాత్మ అనగా శాంతస్థితి." అదే శివత్వం. " శేరతే యస్మిన్ స శివః - శామ్యతి పరమానందరూపత్వాత్ స శివః"
""యచ్ఛేత్ వాఙ్మనసీ ప్రాజ్ఞః తద్ యచ్ఛేత్ జ్ఞాన ఆత్మని ఆత్మానం మహతి నియచ్ఛేత్ తద్ యచ్ఛేత్ శాంత ఆత్మని" కనుక మనసును పట్టుకుంటే, ఆత్మదృష్టి, అంతర్ముఖ ప్రయాణం, "నేనుఎవరు" అని లోపలకు చూడడం సులభం.
 2. శబ్దస్పర్శాదుల అనగా పంచ తన్మాత్రలు, మౌనం వహిస్తాయి.
 3.  తన్మాత్రల వెంట అనుసరిస్తూ పంచభూతాలు మౌనం దాల్చుతాయి,
 4.పంచభూతాల నుండి సాత్వికాంశాలనుండి జనించిన జ్ఞానేంద్రియాల పీకులాట ఉండదు. 
 5.పంచభూతాల రాజసాంశాలనుండి పుట్టిన  కర్మేంద్రియాల ఊసు ఉండదు.
 6. స్థూల, సూక్ష్మ ఇంద్రియాలు ప్రభావంగల , శరీరాలు బాహ్యవిషయాలపై స్పందించవు. ఆత్మనే చూస్తూ, అంతఃకరణం చూస్తుంది, రమిస్తూ, తపస్తూ తాపత్రయాలు లేని నిర్వాణాన్ని జీవుడు అందుకుంటాడు .త్రిగుణాల మాలిన్యం అంతరిస్తుంది. తద్వారా మాయను జయించగలుగుతాం.
  అందుకే శంకరులు దేహాత్మలతో ముడిపడిన దేహం నేను కాదని, ఆత్మను దేహంకంటే భిన్నమయిన "నేను" ను జీవుడు సందర్శిస్తాడు. జ్ఞానభూమికయే  ఆత్మ. దేహం అనుకుంటారు. దేహం పొందే ఆనందాలకు మూలం ఆత్మయే.
"దేహబుద్ధ్యా భవద్దాసః, జీవబుద్ధ్యా త్వదంశకః
 ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, ఇతి మే నిశ్చితా మతిః"
 ఆంజనేయ స్వామి శ్రీ రామచంద్రునితో పలికిన మాటలివి.
"ఆత్మదృష్టి తో చూస్తే శ్రీ రాముడు, ఆంజనేయస్వామి ఇరువురూ ఒకటే. ఎపుడైతే దేహాన్ని వీడుతామో అపుడు జీవుడు శివుడే. అదే " శివోహమ్".
 కావున అందరూ దేహమే నేననే భావాన్ని విడనాడాలి. దివ్యాత్మను దర్శించాలి.
 "దేహానికి ప్రాణం, హృదయస్థానమైన అంతఃకరణాన్ని పట్టుకున్నారు శంకరస్వామి. అందులోనూ ఆయువుపట్టు అయిన" మనసు" తో శ్రీ కారం చుట్టారు. అదే తత్త్వం గల"నిర్వాణదశకం( 'న' అని నిషేధంతో ఆరంభం.) నిర్వాణమంజరి (అహం నామరో...మొదలు)" ని అలా ప్రారంభించారు.
     ఇందు భౌతిక, మానసిక వ్యాధులకు , ఔషధంగా "చిదానందరూపః శివోహమ్ శివోహమ్" మంత్రాన్ని, త్ర్యక్షరి మంత్రాన్ని ఉపదేశంలేని ఉపాసనగా అందించారు.
"చిదానందరూపః శివోహమ్ శివోహమ్" అహమంటే అదే స్థితిలో ఉంటాం.
 "కశ్చిత్ ధీరః ప్రత్యగాత్మానమ్ ఐక్షత్ ఆవృత్త చక్షురమృతత్వమిచ్ఛన్"
కఠోపనిషత్తు.

"అంతవంత ఇమే దేహాః"అని దేహం రాలిపోయేదే.ఆత్మ శాశ్వతము. కనుక" "యుద్ధాయ కృతనిశ్చయః" ఆత్మ దర్శనమునకై తీవ్రప్రయత్నం చేయాలి.

     ఇంద్రియ నిగ్రహం కలిగి యుండాలి. బయట కనిపించే విషయాలనుండి చిత్తాన్ని మరలించాలి.మోక్షమునుగూర్చి తీవ్రాభిలాషయుండాలి. అలా ప్రయత్నించేవాడు ధీరుడు. జీవాత్మ లోని ప్రత్యగాత్మను దర్శించుకోగలడు. సాధన ద్వారా ఆత్మానుభూతి చెందాలి. అది అనుభవస్థితియే. ఈ " మనోబుద్ధ్యహంకార చిత్తాని…." అనే శ్లోకం సూక్ష్మ శరీర విషయాలే అన్నీ. సూక్ష్మ శరీరమే స్థూలశరీరాన్ని నడిపిస్తుంది. కనుక అంతఃకరణాలను,జ్ఞానేంద్రియాలను, సూక్ష్మభూతాలను శమింపజేయాలి,ఆత్మోన్ముఖంచేయాలి. బాహ్య చింతన కలిగినపుడల్లా "చిదానందరూపః శివోహమ్ శివోహమ్" అని స్మరిస్తూ సాధన నిరంతరం ఆత్మాను సంధానం చేయాలి. ఇది సందేశం.

వీరి... శివోఽహమ్ గ్రంథంలో ఈ పై విషయము వివరించి యున్నారు. ఈ గ్రంథముపై నా స్పందన్
శివోఽహమ్....ఒక సిద్ధాంత గ్రంథము.

మ. పరమానంద మనోజ్ఞ
జీవ విలసద్బ్రహ్మైక్య సిద్ధాంతమున్

గరుణాంభోనిధి, వెల్వరించిరిట
రంగావజ్ఝలాఖ్యాన్వయుల్

మురళీధారి సునామధేయులు శుభంబుల్ గొల్ప జిజ్ఞాసతో

నరయంజేయననంత తేజము,
శివోఽహమ్మంచునుద్గ్రంథమున్.
🙏🏻
బుధజన విధేయుఁడు

చిత్రకవితా సమ్రాట్
చింతా రామకృష్ణారావు
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.