గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జనవరి 2020, సోమవారం

నరాల రామారెడ్డి

జైశ్రీరామ్.
నరాల వారి సాహిత్యం.
వ్యాస రచన అజ్ఞాత మహనీయుఁడు
హాలునికి తెలుఁగు మౌక్తికహారం
నరాల రామారెడ్డి అనువాదం.

ఆధునిక సాహిత్యంలో స్రవంతులైన అభ్యుదయ, దళితవాద మొదలైన సాహిత్యాలకు మూలం వర్గ చైతన్యం. సమాజంలోని ప్రజలను ఆర్థిక, సామాజిక అంశాల ప్రాతిపదికన  ఊహించుకుని వర్గాలు చేసి ఆయా జనసమూహాల ప్రయోజనాలను కాపాడేందుకు వారిని అప్రమత్తంగా ఉంచేది వర్గ చైతన్యం. దానికంటే ముందుగా పుట్టవలసినది  సామాజిక స్పృహ, అనగా వర్గాలకతీతంగా సమాజంలో ప్రాథమికంగా ఉండవలసిన మానవీయ విలువలు, సంబంధాలు. అటువంటి అంశాలను ప్రకటించే సాహిత్యాన్ని వేలయేళ్ళ భారతీయ కావ్య జగత్తులో మొదటగా ఎవరు సృశించారు? ఆ ప్రశ్నకు సమాధానం వెదుక్కుంటూ వెనక్కుపోతే కనబడేది శాలివాహనుడు సంకలనం చేసిన గాథా సప్తశతి. శాలివాహనునికి హాలుడు అనే పేరు కూడా ఉన్నది. ఎప్పుడో 1వ శతాబ్దంలో సాహిత్యయుగం సంధ్యాసమయంలో వెలుగుచూసినదీ  గాథా సంకలనం. గీర్వాణభాష ( దేవ భాషైన సంస్కృతం) కు సమాంతరంగా ప్రయాణించి అధికారంలో ఉన్న వారి గురించే కాక సమాజంలోని లోతులను తెరచి చూపయత్నించింది ప్రాకృత భాషా సాహిత్యం. సంస్కృతం పురుషుడి గొంతుక వలె పరుషంగా ఉంటే, ప్రాకృతం స్త్రీ కంఠంలా కోమలంగా ఉంటుందని ప్రాకృతకవులు గర్వంగా చెప్పుకొంటారు. ఆ భాషలో రాయబడిందీ గాథా సప్తశతి.

మరి సామాజిక స్పృహకు చెందిన అంశాలున్న ప్రాచీన సాహిత్యం కావడం వల్లనే ఆ గాథలు  ప్రముఖావధాని, విద్వత్కవి, ఆశుకవనరచనాచతురుడు నరాల రామారెడ్డి గారిని ఆకర్షించాయి. మొదటినుండీ అవధానక్రీడలో భావుకత, వీలైనచోటల్లా సరళతను కనబరుస్తూ అవధాన కళను సమాజానికి మరింత చేరువగా తీసుకొని పోవడానికి ప్రయత్నించి,  నేటి కాలపు అవధాన జగత్తులో ప్రత్యేక స్థానం చాటుతూవచ్చిన రామారెడ్డి గారు సహజంగానే ప్రాకృతకవిత్వం పై అభిమానం పెంచుకున్నారు. ఏడువందల పద్యాలను తీసుకుని ఆనాటి సాంఘిక జీవనానికద్దం పట్టే మూడువందల ప్రాకృత గాథలను ఎంచుకొని తెలుగు చేశారు. మూలాన్ని ప్రాకృతం నుండి కాక సంస్కృతానువాదమైన “ఛాయ” ను తీసుకుని, వాటిలోని శ్లోకాలను తెలుగుదనం ఉట్టిపడే విధంగా తేటగీతి ఛందస్సునెంచుకొని అనువాదం చేశారు.

శృంగార, కరుణ, హాస్య రసాలు ప్రధానంగా కలిగిన ఈ గాథలలో రామారెడ్డి గారు తన అవధానవిద్యలో వారు ప్రదర్శించిన పాండిత్యం, ప్రతిభ తోపాటు భావుకతను కూడా జోడించి స్వతంత్ర రచనలాగా వెలువరించారు. పదులఏళ్ళుగా పద్యాలతో గాలిలో బంతులాడిన అనుభవం వారిది, అనువాద పద్యాలు చెక్కినట్టుగా వచ్చాయి.

తే॥
అమృతధామ! నిశాతిలకాభిరామ!
చల్లచల్లని మామ! ఓ చందమామ!
ధవునిరమణీయగాత్రమ్ము తాకినట్టి
శీతకరముల నన్ను స్పృశించుమోయి!

భావము = ఓ అమృతనిలయా! రాత్రి అనే రమణి ముఖానికి రమ్యమైన తిలకం వంటి వాడవు నీవు.చల్ల చల్లని మామవు. చందమామవు. నీవు నా ప్రాణ వల్లభుని స్పృశించిన కిరణాలతో నన్ను కూడా స్పృశించు.

విశేషము = మూలంలో లేని “చల్లచల్లని మామ ఓ చందమామ” పదాలను జోడించి తెలుగు వెన్నెల చల్లదనాన్ని కురిపించారు నరాల గారు.

తే॥
‘ఎన్ని మాఱులు నన్ను మర్దింతువోయి!
ఇంక చాలును నను విసర్జింపవోయీ’
అంచు జీర్ణవస్త్రము విలపించినట్లు
అంబుకణములు స్రవియించెనంచులందు.

అంచు = అనుచు

భావము = “ఎన్నిసార్లు నన్ను బండకేసి బాదుతావయ్యా! ఇప్పటికైనా నన్ను వదలి పెట్టవయ్యా!” అని ఒక బీదవాని చినిగిపోయిన పాతపంచె ఏడుస్తున్నదేమో అన్నట్లు చిరుగుపాత అంచుల నుండి నీటిబొట్లు కారుతున్నాయి.

విశేషము = ఆ నాటి సమాజంలోని ఒక పేదవాడి పాత పంచె ఏ స్థితి లో ఉందో హాలుడు చెప్పకపోతే మనకిప్పుడు తెలిసేదా! మనకు కూడా అంబు కణాలు జీరగా నిండలేదూ ?! ఎంతటి సామాజిక స్పృహ కవిది.

తే॥
మొదటిసారి గర్భిణియైన ముగ్దగాంచి
ఇంతి! యేవి వస్తువులు నీకిష్టమనుచు
సుదతులందఱు ప్రశ్నించ చుట్టుముట్టి
నాతిచూపులు ప్రసరించె నాథువైపు

భావము =మొదటి సారి గర్భవతియైన ఒక ముగ్దురాలిని చుట్టుముట్టిన సకియలు ‘ఏఏ వస్తువులు నీకు ఇష్టమో’ చెప్పమన్నారు. సిగ్గలుమొగ్గ అయిన ఆ ముగ్దచూపులు ఆమె ప్రాణవల్లభుని వైపు ప్రసరించినాయి

విశేషము = మగనికన్నా రుచికరమైన, ఇష్టమైన వస్తువు ప్రపంచంలో ఇంకేముందని ఆ ముగ్ద చూపులిచ్చిన ప్రౌఢసమాధానం. గర్భిణి చుట్టూ చేరిన అమ్మలక్కలు, వారడిగే ప్రశ్నలు, ఆ అనురాగాలు, ఆ మెత్తటి భావనలు, ఆ కాలం నుండే ఉన్నాయా అని ఆశ్చర్యపడడం ఇక పాఠకుడి వంతు.

తే॥
గగనలక్ష్మి కంఠము నుండి గళితమైన
పద్మరాగగారుత్మతభాసమాన
కంఠహారము కైవడి కాంచుమోయి!
రామచిలుకలు బారుగా వ్రాలుచుండె

భావము = గగనలక్ష్మి కంఠసీమనుండి కెంపులు, గరుడపచ్చలు చెక్కిన కంఠహారం నింగినుండి జారిపడుతున్నట్లు రామచిలుకల బారు నేలమీద వ్రాలుతున్నది చూడు

విశేషం = చిలుకల ముక్కులు పద్మరాగ మణుల్లా, చిలుకల శరీరాలు మరకత మణుల్లా భాసిస్తున్నాయని భావం. ‘బారుగా వ్రాలుచుండె’ - ‘బారుగా’ అన్న తెలుగు నుడికారం ఈ చిత్రానికి స్పష్టతనూ, విస్తృతినీ ఇచ్చిందంటారు పి. రామకృష్ణ గారు నరాల వారి అనువాదం ముందు మాటలో. కృష్ణ శాస్త్రికి సైతం భావుకతను నేర్పిన భావనలా లేదూ భావన !! ఎంతటి గొప్ప సమాజమో అది, అంత భావనలు పోయారు.

ఈరీతిలో రామచిలుకలు బారులుగా వ్రాలినట్లు,  ముత్యాల్లాంటి పద్యాలు బారులుగా పేర్చబడి హారం రూపం దాల్చాయా అన్నట్లుగా ఉంది. అందుకేనేమో సినారే గారు ముందు మాటలో “రామారెడ్డి గారు అనువాద రూపంలో తెలుగు వారికి మరో కవితామౌక్తికహారం అందించారు” అన్నది. అందుకేనేమో అంతగా పలవరించి సినారే గారన్నది “ప్రతిభా వ్వుత్పత్తులను అతులిత రూపంలో మేళవించుకొన్న కవితాశిల్పి రామారెడ్డి గారు” .

నరాల రామారెడ్డి గారందించిన ఆ మౌక్తికహారం రచన పేరు “ గాథా త్రిశతి - శాలివాహనప్రాకృత గాథలకు ఆంధ్రానువాదం”.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.